Home News

అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి.. ఆ పై బెదిరింపులు..కడపలో ఏంజరుగుతుంది…?

ఆయన ఎమ్మెల్సీ అయ్యి పదిరోజులు కూడా కాలేదు. అప్పుడే ఇబ్బందులు మొదలయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు అదేపనిగా ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారట. ఆ కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నేత రమేష్‌ యాదవ్‌. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో ప్రొద్దుటూరు ఛైర్మన్‌ సీటు ఆశించి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే అది దక్కకున్నా అనూహ్యంగా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అయిన నలుగురిలో రమేష్‌ యాదవ్‌ చాన్స్ దక్కింది. కానీ ఎమ్మెల్సీ ఎంపికైంది మొదలు వరుస బెదిరింపు ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నాయట…

ఏపీలో ఇటీవల గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి అంచనాలకు అందకుండా చోటు దక్కించుకున్నారు రమేశ్ యాదవ్. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందారు. హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్‌ విదేశీ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న ఆయన.. రాజకీయాలకు కొత్త. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రొద్దుటూరులో 11వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా మరోకరిని ఛైర్మన్‌ స్థానంలో కూర్చోబెట్టాల్సి వచ్చింది. అప్పటి నుంచి ప్రొద్దుటూరు వైసీపీలో పరిణామాలు ఆసక్తిగా మారాయి.

రాష్ట్రస్థాయిలో నామినేటెడ్‌ పదవి ఇస్తామని రమేష్‌ యాదవ్‌ను ఎమ్మెల్యే, ఇతర నాయకులు బుజ్జగించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చేస్తామని చెప్పారట. అయితే మున్సిపల్‌ ఛైర్మన్‌ కాలేదన్న ఆవేదనలో ఉన్న రమేష్‌ యాదవ్‌..తనకు నామినేటెడ్‌ పదవి వద్దని ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తే వచ్చిన దారినే వెళ్లిపోతానని గొడవ చేసినట్టు సమాచారం. డబ్బు ఇచ్చేస్తామని ఎమ్మెల్యే కూడా ఆయనకు హామీ ఇచ్చారట. ఈ విషయం బయటకు లీక్‌ కావడంతో రాజకీయంగా రచ్చ రచ్చ చేశారు. అధికార..విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి.

ఈ వివాదం నడుస్తుండగానే రమేష్ యాదవ్‌ పేరు ఒక్కసారిగా రాష్ట్రస్థాయిలో వైసీపీలో చర్చకు వచ్చింది. గవర్నర్‌ కోటాలో నామినేట్‌ చేసిన నలుగురిలో రమేష్‌ యాదవ్‌ పేరు ఉండటమే దానికి కారణం. ప్రొద్దుటూరులో అయితే పెను సంచలనంగా మారింది. సీఎం సొంత జిల్లాలో ఎంతో మంది ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తుండగా.. అసలు చర్చలోనే లేని..రాజకీయాలకు కొత్త అయిన రమేష్‌ యాదవ్‌ను ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే..ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రమేష్‌ యాదవ్‌కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఆయన ఫోన్‌కు విపరీతంగా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయట.

అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేసి..నువ్వెంత.. నీస్థాయి ఎంత నువ్వు ఎమ్మెల్యేతో సరితూగే వ్యక్తివా టీడీపీ నేత నందం సుబ్బయ్యకు పట్టిన గతే నీకు కూడా పడుతుంది అని ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ను బెదిరిస్తున్నారట. ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన బావమరిది పాతకోట బంగారు రెడ్డితో రమేష్‌యాదవ్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. తనకు ఎమ్మెల్సీ పదవి రావడం వెనక రాచమల్లు కృషి ఉందని రమేష్‌ ప్రకటించారు. మరి ఎమ్మెల్సీని బెదిరించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ఆయనను ప్రొద్దుటూరులో శత్రువుగా భావిస్తున్నది ఎవరు అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఎమ్మెల్సీగా రమేష్ యాదవ్ ప్రొద్దుటూరులో రాజకీయంగా ఎదుగుతున్నారనే ఉద్దేశ్యంతోనే బెదిరింపు ఫోన్ కాల్స్ ద్వారా కట్టడి చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది.

రాజకీయంగా, వ్యాపార పరంగా ఎలాంటి వివాదాలు లేని రమేష్ యాదవ్‌కు ప్రస్తుతం వార్నింగ్‌ కాల్స్ ఎవరు చేస్తున్నారు అంతగా బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంది అనేది రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. రమేష్ యాదవ్‌కు ఎమ్మెల్సీ రావడం వైసీపీలో కొంతమందికి ఇష్టం లేదట. ఫోన్‌ చేసిన వారు కూడా.. పదవి ఇచ్చారని ప్రొద్దుటూరులో ఏదో చేయాలని చూడకు. పదవిని ఎంజాయ్‌ చేయ్యి.. అంతేకాని పదవి ఉంది కదా అని గ్రూపులు పెడితే సహించేది లేదు అని తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారట. దీంతో పదవి వచ్చిన సంతోషం కంటే జరుగుతున్న పరిణామాలు కొత్త ఎమ్మెల్సీని కంగారు పెట్టిస్తున్నాయట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here