Home News Politics

కడప లోక్ సభ టార్గెట్ గా జమ్మలమడుగు రాజకీయం….జమ్మలమడుగు బరిలో చినబాబు

కడప జిల్లా రాజకీయాలు మొత్తం ఆ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి.పగవాడు పరాయి వాడి ఇంటి వైపు వెళ్లి ఊపిరి పీల్చినా.. క్షణాల్లో అదే ఊపిరి తీసే పరిస్థితి ఉన్న పౌరుషల గడ్డ జమ్మలమడుగు. అలాంటి నెత్తుటి మడుగు అయిన జమ్మలమడుగులో ఇప్పుడు రాజకీయం రంకెలు వేస్తుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులంటూ ఎవరూ ఉండరంటూ బద్ద శత్రువులను ఒక తాటి పైకి తెచ్చే పనిలో ఉంది సైకిల్ పార్టీ. పార్టీలోని గ్రూపులను ఒక గాటికి తెచ్చి జమ్మలమడుగు మీదుగా వైసీపీ కంచుకొట కడప పార్లమెంట్ పై ఎక్కుపెట్టింది టిడిపి….

ఒకప్పుడు దశాబ్దాలుగా ఫ్యాక్షన్ నీడలో తల్లడిల్లుతున్న జమ్మలమడుగు సెగ్మెంట్ కొంతకాలంగా సేదతీరుతోంది.. గత చరిత్ర సమస్తం బాంబులు హత్యల మయమే .. రెండు కుటుంబాల మధ్య సాగిన ఆధిపత్య పోరును అడ్డుకట్ట వేసే దిశగా ఫ్యూహాలు రచిస్తుంది అధికార పార్టీ. రెండు వర్గాలను ఒక తాటి పైకి తెచ్చినా ఇంకా ఎదురుపడని పరిస్థితే ఉంది. ఇక ఇలా ఉంటే కష్టమే అనుకున్న అధినేత తానే స్వయంగా రంగంలోకి దిగి రెండు వైరి వర్గాలను ఒక్కటి చేసే పనిలో పడ్డారు.

 

మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ, మండలి విప్‌ రామసుబ్బారెడ్డిల మధ్య కుదిరిన ’సయోధ్య’ టీడీపీకి అనుకూలించే అంశంగా పేర్కొంటున్నారు. ఆ ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తే నాలుగు నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని దీంతో కడప లోక్‌సభ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంటుందని అంచనా. ఇటీవల అధినేత చంద్రబాబు ఆ ఇద్దరు నేతలతో చర్చించడంతో స్థానిక కార్యక్రమాల్లో వారు చురుకుగా పాల్గొంటున్నారు. మరోవైపు కోర్టుల్లో నడుస్తున్న కేసులు కూడా రాజీతో సర్దుబాటు చేసుకున్నట్లు సమాచారం. దీంట్లో భాగంగా ఇరు కుటుంబాల మధ్య పగ రగిల్చిన షాద్ నగర్ జంట హత్యల కేసు సుప్రీం కోర్టు లో ముగింపు దశలో ఉంది. ఈ కేసు కూడా సుప్రీం లో చంద్రబాబు రాజీ చేశారని వినికిడి.

నెత్తుటి మడుగు అయిన జమ్మలమడుగులో ఇప్పుడు ప్రశాంతతే ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడున్న రెండు వర్గాలు ఒక్కటయ్యాయి. రెండు రాజకీయ సింహాలు స్నేహాభావం తో పడవెక్కి షికారు చేస్తున్నాయి. ఇలా ఇద్దరు నేతలే ఒకే బోటులో షికార్లు చేస్తుంటే ఇక ఇక్కడ ప్రత్యర్థులు ఉండరు. రాజకీయ ప్రత్యర్థులు అస్సలే ఉండరు..ఒకే పార్టీలో ఉన్న నిన్నటివరకు ఉప్పు నిప్పులా ఉన్న వీరు హటాత్తుగా ఇలఎలా అనుకుంటున్నారా…కాని ఇక్కడే ఉంది కొత్త ట్విస్టు దీనికి మధ్యే మార్గంగా జమ్మలమడుగు రాజకీయంలోకి చినబాబు ఎంటరయ్యారు. జమ్మలమడుగు నుంచి టీడీపీ చిన్న బాస్ అదే నండి చినబాబు లోకేశ్ ను పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేసేస్తున్నారు. స్థానికంగా ఇద్దరు అగ్రనేతలు.

ఇద్దరు నేతలు ఒక్కటైతే గెలుపు ఏకపక్షం గాక మరేముంటుంది. లోకేశ్ బాబు జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తే.. మరి మంత్రి ఆది విషయం ఏంటనేదే గా మీ డౌట్.. అక్కడికే వెళదాం.. ఆదినారాయణ రెడ్డి టీడీపీ నుంచి కడప పార్లమెంటుకు పోటీ చేస్తారు.. ఇక ఎమ్మెల్సీ గా రామసుబ్బారెడ్డి మరో అయిదేళ్ళు పదవి లో ఉంటారు. 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కి తిరిగి మంత్రిగా అవకాశం. అంతే కాదు ఎంపి గా ఆది గెలిస్తే ఆయనకూ కీలక పదవి. ఇక చినబాబు ఇక్కడి నుంచే సారథ్యం వహిస్తారు కాబట్టి ఇక సమస్యే ఉండదంటారు తెలుగు తమ్ముళ్ళు.

ఇక ఈ ఇద్దరు నేతలు కూడా అందుకు సంసిద్దమై సరే అన్నట్టు కూడా పార్టీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. చూసారా.. జగన్ సొంత జిల్లాలో చంద్రబాబు చాణక్యం…అసలు ఇక్కడి రాజకీయం ఇంత సునాయాసంగా ఒకే ఒక్క రాజీ ఫార్ములాతో ఇద్దరు బద్ద శత్రువులను ఏకం చేసి అక్కడి నుంచే తన పుత్ర రత్నానికి పోటీ చేయించడంతో పాటు జగన్ కు షాక్ ఇవ్వాలనుకుంటున్నారు. మరి ఇక సీమ సందుల్లో తొడగొట్టే సింహం గా లోకేశ్ బాబు అవతరించబోతున్నరన్నమాట… ఎన్నికల వరకు చూడాలి మరి జమ్మలమడుగు రాజకీయంలో ఇంకా ఎన్ని ట్విస్టులుటాయో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here