Home News Politics

సీరియ‌స్‌గానే చేసినా..చివ‌రికి కామెడీ!

ఉక్కు దీక్ష‌తో తుక్కు మిగిలింది

 

ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లు…దిక్కులు పిక్క‌టిల్లేలా ప్ర‌తిజ్ఙ‌లు..గంట‌ల త‌ర‌బ‌డి ప్ర‌సంగ‌పాఠాలు. ఎన్ని చేసినా ఏం ఒరిగిందంటే మొహాలు చూసుకోవాల్సిందే. హోదా కోసం ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లు. రైల్వేజోన్ కోసం ఎంపీలు, ఎమ్మెల్యేల నిర‌స‌న‌లు. క‌డప ఉక్కుకోసం ఏకంగా ఆమ‌ర‌ణ‌దీక్ష‌. కేంద్రం క‌నిక‌రించి చూస్తాం..ఏదో ఒక‌టి చేస్తాం..అని ఒక్క‌మాట చెబితే చాలు…తాగించేందుకు నిమ్మ‌ర‌సం రెడీ. కానీ అనుకున్న‌వేవీ జ‌ర‌గ‌లేదు. వారం ప‌దిరోజులైనా చ‌డీచ‌ప్పుడు లేదు. ఓ ద‌శ‌లో సీఎం ర‌మేష్ అమ‌ర‌జీవి అవ‌తార‌మెత్తుతాడ‌న్నంత బిల్డ‌ప్పు. కానీ చివ‌రికి వేసిన టెంటును తామే తీసేయాల్సి వ‌చ్చింది. కూర్చోబెట్టిన చేతుల‌తోనే నిమ్మ‌ర‌సం ఇవ్వాల్సి వ‌చ్చింది.

క‌డ‌ప ఉక్కు. రాయ‌ల‌సీమ హ‌క్కే. అందులో మ‌రో మాట‌లేదు. కేంద్రం కొర్రీ పెట్టింద‌నుకున్న‌ప్పుడు, ఓ ఉక్కు క‌ర్మాగారానికి అవ‌స‌ర‌మైన ఖ‌నిజ నిక్షేపాలు స్థానికంగా ఉన్నాయ‌నుకున్న‌ప్పుడు దాన్ని సాధికారికంగా చూపించి ఒత్తిడిపెంచాలేగానీ ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు కూర్చోవ‌డ‌మొక్క‌టే ప‌రిష్కారం కాదు. జ‌గ‌న్ సొంత జిల్లాలో విప‌క్ష‌నేత‌ను ఇరుకున పెట్టేందుకు ఉక్కుదీక్ష బ్ర‌హ్మాస్త్రం అవుతుంద‌నుకుంటే అదికాస్తా తుస్సుమంది. ఎంపీలు వెళ్లి కేంద్ర‌మంత్రి బీరేంద్ర‌సింగ్‌ని క‌లిసినా ఎలాంటి సానుకూల ప్ర‌క‌ట‌న లేదు. ప్ర‌ధానిని క‌లిసి హ‌డావుడి చేద్దామ‌న్నా ఆయన అప్పాయింట్‌మెంట్ దొర‌క‌లేదు. ఇంకో రెండ్రోజులు పోతే వ్య‌వ‌హారం బూమ‌రాంగ్ అయ్యేలా ఉంద‌ని చివ‌రికి సీఎమ్మే ఓ గంట స్పీచిచ్చి త‌ర్వాత నిమ్మ‌ర‌సం తాపిచ్చాల్సి వ‌చ్చింది.

బీటెక్ ర‌వి ముందే హాస్పిట‌ల్ పాల‌య్యాడు. సీఎం ర‌మేష్ ఆరోగ్య‌ర‌హ‌స్యం ఏంటోగానీ ప‌దిరోజులైనా మ‌నిషి డీలాప‌డ‌లేదు. వీర‌మాచినేనివారి ఆరోగ్య స‌ల‌హాల‌కంటే సీఎం ర‌మేష్ ఆరోగ్య ర‌హ‌స్య‌మేంటో క‌నుక్కుంటే ఇంకా మేలేమో. కేంద్ర‌మంత్రిని క‌లిసేందుకు వెళ్లిన టీడీపీ ఎంపీల‌కు నిజంగానే సీఎం ర‌మేష్ ఆరోగ్యంపై ఆందోళ‌నుంటే బ‌య‌టికొచ్చి కుళ్లు జోకులేసేవారే కాదు. ఏడెనిమిది కిలోలు త‌గ్గాల‌నుకుంటున్నాన‌నీ…దీక్ష చేస్తే మంచిదేమోన‌ని త‌మ‌లో తాము జోకులేసుకునేదాకా వ‌చ్చిందంటే…ఉక్కు దీక్ష వారికే అంత కామెడీగా క‌నిపించింది మ‌రి!

కేంద్రం స్పందించేలా లేద‌నీ, ఎలాంటి సానుకూల ప్ర‌క‌ట‌నా రాద‌నీ ఫిక్స్ అయిపోయింది తెలుగుదేశం. మ‌రోవైపు సీఎం ర‌మేష్ ఫిట్‌నెస్‌మీద ఇంటాబ‌య‌టా స‌వాల‌క్ష సందేహాలు. దీంతో ఈ డ్రామాకు ఎక్క‌డోచోట ముగింపు ప‌లికేందుకు స్వ‌యానా తానే రంగంలోకి దిగారు చంద్ర‌బాబు. కేంద్రం పెడితే స‌రేస‌రి.. లేదంటే తామే ఫ్యాక్ట‌రీ పెట్టేస్తామ‌ని గంభీరంగా ప్ర‌క‌టించారు. అస‌లే అస‌హ‌నంతో ఉన్న కేంద్రాన్ని ఇంకాస్త రెచ్చ‌గొడితే రాష్ట్రానికి ఒరిగేదేంటో చంద్ర‌బాబుకే తెలియాలి. స్వ‌యానా చంద్ర‌బాబే నిమ్మ‌ర‌సం ఇచ్చి దీక్ష‌ను విర‌మింప‌జేయ‌డానికి వ‌చ్చార‌ని తెలిసి..ఆస్ప‌త్రినుంచి వ‌చ్చి మ‌రీ సీఎం ర‌మేష్‌తో పాటు తానూ ఓ గ్లాస్ తాగేసి బీటెక్ ర‌వి ఇంటికెళ్లిపోవ‌డం టోట‌ల్ ఎపిసోడ్‌లో మ‌రో క‌డుపుబ్బ న‌వ్వించే దృశ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here