కోర్టులు వర్సెస్ వైసీపీ సర్కార్ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. సుప్రీం న్యాయమూర్తి వైఖరిని తప్పుపడుతూ ఏకంగా చీఫ్ జస్టిస్‌కే లేఖరాశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. లేఖరాయడం ఒక ఎత్తయితే, ఆయన రాసిన లేఖ అక్షరం పొల్లుపోకుండా బయటికి రావడం మరో వివాదాన్ని సృష్టించింది. రహస్యంగా ఎవరో బయటికి తీయలేదా లేఖని. స్వయానా ప్రభుత్వ పెద్దలే మీడియా ముఖంగా బ్రీఫింగ్ ఇచ్చేశారు. దీంతో సీజేఐకి రాసిన లేఖ బహిర్గతం చేయడం న్యాయ ధిక్కరణ కిందికి వస్తుందనే వాదన వినిపిస్తోంది. సుప్రీం చీఫ్ జస్టిస్‌కి రాసిన లేఖను బహిర్గతం చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కొందరు లాయర్లు. న్యాయవాదుల పిటిషన్లపై ఈ నెల 16న విచారణ జరగనుంది.

న్యాయస్థానాలపై అసత్య ఆరోపణలు చేయకుండా ప్రతివాదిపై చర్యలు తీసుకోవాలని, షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పిటిషన్ వేశారు న్యాయవాది సునీల్ కుమార్. సొంత ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలు చేసినందుకు.. జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది జీఎస్ మణి. వీరితోపాటు న్యాయవాది ప్రదీప్‌కుమార్ సింగ్, యాంటీకరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ వేసిన పిటిషన్లను విచారించనుంది… జస్టిస్ లలిత్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ రవీంద్రభట్ నేతృత్వంలోని ధర్మాసనం.
సీజేఐకి రాసిన లేఖ లీకేజీ వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లంపై కోర్టు ధిక్కరణ ప్రక్రియ మొదలుపెట్టేందుకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినికుమార్ రాసిన లేఖపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ రియాక్ట్ అయ్యారు. సీజేఐ పరిధిలో ఉండటంతో అనుమతి ఇవ్వలేనని ఏజీ స్పష్టంచేశారు. దీనికి స్పందించిన అశ్వినీ కుమార్ ఏజేకు మరో లేఖ రాశారు. సీజేఐ పరిధిలో ఉన్నది జగన్ రాసిన లేఖ మాత్రమేనని, కాబట్టి కోర్టు ధిక్కరణ ప్రక్రియకు అనుమతి ఇవ్వాలని కోరారు. సీజేఐకి లేకరాయడంపైనే వివాదం రేగితే….దాన్ని బహిర్గతం చేయడంపైనా న్యాయ నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టులను ప్రశ్నించడం, లోపాలను ఎత్తిచూపడం తప్పేమీ కాదంటున్నారు ప్రశాంత్భూషణ్లాంటి సీనియర్ అడ్వకేట్లు. అయితే న్యాయవ్యవస్థపైనే నమ్మకం లేనట్లు…చివరికి చీఫ్ జస్టిస్‌కి రాసిన లేఖను కూడా బయటపెట్టడం సరికాదన్నది మరికొందరి వాదన. ఫైనల్‌గా ధర్మాసనం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.