దుబ్బాక ఫలితాలొచ్చేశాయి. బీహార్ అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. ఉప ఎన్నికల ఫలితాలు కూడా తేలిపోయాయి. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వారం పదిరోజుల తర్వాత కూడా వస్తూనే ఉన్నాయి. కిందపడ్డా పై చేయి తనదేనని తెంపరి ట్రంప్ చిందులేస్తుంటే…డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ మాత్రం..చిద్విలాసంగా ఉన్నారు. ఎందుకంటే… అమెరికా కొత్త అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టేందుకు జో బైడెన్.కి రూట్ పూర్తిగా క్లియర్ అయిపోయింది. తాజా ఫలితాలు కూడా కలిపి చూస్తే జో బైడెన్ ఎలక్టోరల్ ఓట్లు మరింత పెరిగాయి. జార్జియా, ఆరిజోనా రాష్ట్రాల్లో విజయంతో ట్రిపుల్ సెంచరీ దాటారు జో బైడెన్. ఆయన స్కోరు 306కి చేరితే…చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్న ట్రంప్ ఓట్లు 232 దగ్గరే ఆగిపోయాయి. జార్జియా రాష్ట్రంలో మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ తర్వాత విజయం సాధించిన డెమొక్రాటిక్ అభ్యర్థిగా రికార్డు సృష్టించారు జో బైడెన్.

అమెరికా అధ్యక్షపదవి కోసం 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. అయితే దానికంటే 36 ఓట్లు అధికంగానే సాధించిన జో బైడెన్ అగ్రరాజ్య కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టటం ఖాయం. అయితే సాంకేతికంగా ఇప్పటికీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నారు ట్రంప్. పదవీ మార్పిడికోసం లాంఛనప్రాయ కార్యక్రమాలు మొదలయ్యాయి. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారానికి ముందే పాలనపై పట్టు బిగించేందుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు జో బైడెన్. ట్రంప్ తోక జాడించకుండా వైట్.హౌస్.లో ఆయన్ని కట్టడి చేస్తున్నారు. వైట్.హౌస్.లో తన చిరకాల ఆప్తుడు రాన్ క్లెయిన్.ని చీఫ్ ఆఫ్ స్టాఫ్.గా నియమించారు బైడెన్. ట్రంప్ ఎంత కంగాళీ చేసినా… అమెరికా తదుపరి అధ్యక్షుడిని తానేనని మెజారిటీతో తేలిపోవటంతో…నిశ్చితంగా తన పని తాను చేసుకుపోతున్నారు జో బైడెన్.
అటు ట్రంప్ మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. తాను పట్టిన కుందేలుకి మూడేకాళ్లని మొండికేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపణలు చేస్తున్నారు ట్రంప్. అయితే ట్రంప్ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు అమెరికా ఎన్నికల సంఘం అధికారులు. అమెరికా చరిత్రలోనే అత్యంత భద్రంగా ఎన్నికలు జరిగినట్లు క్లారిటీ ఇచ్చారు ఫెడరల్ ఎలక్షన్ అధికారులు. ఓట్లను డిలీట్ చేయలేదని, ఎక్కడా ఓట్లను మార్చలేదని, ఎవరికీ అనుకూలంగా వ్యవహరించలేదని ట్రంప్ ఆరోపణలను తిప్పికొట్టింది ఎన్నికల అధికారుల కమిటీ. అయితే కీలక రాష్ట్రాల్లో ఓడిపోయిన ట్రంప్.. కోర్టును ఆశ్రయించారు. దిగిపోయేలోపు ఎంత వీలైతే అంత రచ్చ చేయడానికే…ట్రంప్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.
గౌరవంగా తప్పుకోకుండా రచ్చ చేసి చివరికి ట్రంప్.కి మాజీ అధ్యక్షుడనే గౌరవం కూడా పోగొట్టుకునేలా ఉన్నాడు. పదవి పోతోందని తెలియగానే ట్రంప్.కి ఇంట్లోనే విలువలేకుండా పోయింది. భార్య మెలానియా విడాకులిచ్చే ఆలోచనలో ఉందన్న ప్రచారం ట్రంప్ పుండుమీద కారం చల్లుతోంది. మెలానియా ఎప్పుడో విడాకులిచ్చేసేదని, అయితే అనుకోకుండా ట్రంప్ గెలవకుండా, ప్రథమ మహిళ హోదా రావటంతో నాలుగేళ్లు సర్దుకుపోయిందనేది కొందరి వాదన. ఇప్పుడా పోస్ట్ కూడా ఊస్టింగ్ అవుతుండటంతో…తమ పదిహేనేళ్ల వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ వేసే ఆలోచనలో ఉందట మెలానియా. మొత్తానికి ట్రంపుకి పాపం..ఎన్ని కష్టాలొచ్చిపడ్డాయో.