అమెరికా అధ్యక్ష ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. ట్రంప్ కలలను కల్లలు చేస్తూ చివరి ఫలితం జో బైడెన్‌కే అనుకూలించింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్‌నే చివరికి విజయం వరించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో అడుగు పెట్టబోతున్నారు జో బైడెన్.

మరోవైపు ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలిమహిళగా, రికార్డు సృష్టించబోతున్నారు భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్. సొంత రాష్ట్రం పెన్సిల్వేనియాలో ఆధిక్యంతో అమెరికా అద్యక్షుడిగా జో బైడెన్ విజయం ఖాయమైపోయింది. 538 ఎలక్టోరల్ ఓట్లకుగాను మ్యాజిక్ ఫిగర్ 270 కాగా, 284 ఓట్లతో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించారు జో బైడెన్. జార్జియా, నార్త్ కరోలినా, అలాస్కా రాష్ట్రాల కౌంటింగ్ కొలిక్కిరాకముందే అవసరమైన మెజారిటీ దక్కటంతో శ్వేతసౌధంలోకి అడుగుపెడుతున్నారు జో బైడెన్
జో బైడెనే తదుపరి అధ్యక్షుడని సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్ తదితర ప్రముఖ వార్తా సంస్థలు ప్రకటించాయి. ట్రంప్ హయాంలో వైట్ హౌస్‌లో నాలుగేళ్ల పాటు సాగిన గందరగోళానికి జో బైడెన్ ముగింపు పలికారంటూ కామెంట్ చేసింది న్యూయార్క్ టైమ్స్. అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే ట్విట్టర్లో స్పందించారు అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్. గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి నన్ను ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నాన్నారు జో బైడెన్ తన లక్ష్యం చాలా కష్టమైనదనా…తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని జో బైడెన్ హామీఇచ్చారు.
ఇప్పటి వరకు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నానా యాగీ చేసిన అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోకముడిచారు. తుది ఫలితం తెలియగానే ట్రంప్.. వర్జీనియా రాష్ట్రం స్టెర్లింగ్‌లో ఉన్న తన సొంత ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌కు వెళ్లిపోయారు.
ఈ ఓటమితో అమెరికా చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండో విడతగా ఎన్నిక కాలేకపోయిన మూడో అధ్యక్షుడిగా చరిత్రకెక్కారు ట్రంప్. అయితే ఇంత జరిగాక కూడా ఓటమిని అంగీకరించేందుకు సిద్ధపడటం లేదు ట్రంప్. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. కొత్త అధ్యక్షుడిని అభినందించాల్సిన సమయంలో…గెలిచింది తానేనని ట్వీట్ చేశారు ట్రంప్. కౌంటింగ్ గదిలోకి తమ పార్టీ అబ్జర్వర్లను అనుమతించలేదని ఆరోపణలుచేశారు. అమెరికా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా సిటింగ్ ప్రెసిడెంట్‌కు 7 కోట్ల 10 లక్షల లీగల్ ఓట్లు వచ్చాయన్న ట్రంప్…గెలిచింది తానేనంటూ ట్వీట్ చేసి మరింత దిగజారారు. మొత్తానికి సంచలనాత్మకంగా అమెరికా అధ్యక్షుడిగా పదవి దక్కించుకున్న ట్రంప్ నిష్క్రమణలో కూడా సంచలనాలు నమోదయ్యాయి.