Home News Politics

ఇల్లు అల‌గ్గానే పండ‌గ‌కాదు

జేడీఎస్‌-కాంగ్రెస్‌ల కాపురం ఎన్నాళ్లు?

క‌ర్ణాట‌క‌లో ఊహించ‌ని అద్భుతం జ‌రిగిపోయింది. ఆర్జేడీని ప‌క్క‌కు తోసి బీహార్‌లో, కాంగ్రెస్‌ని కుమ్మేసి గోవాలో, చివ‌రికి జానాబెత్తెడు మేఘాల‌య‌లోనూ తెర‌వెనుక తంత్రం న‌డిపించి అల‌వోక‌గా అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన బీజేపీ..ద‌క్షిణాన కీల‌క‌మైన రాష్ట్రంలో వ్యూహాత్మ‌కంగా బోల్తాప‌డ‌ట‌మా! అది కూడా ఏడంటేఏడుగురు ఎమ్మెల్యేల మ‌ద్ద‌తుని కూడ‌గ‌ట్టుకోలేక‌పోవ‌డ‌మా! న‌మ్మ‌లేక‌పోతున్నారెవ‌రూ. 104 సీట్లు గెలిచి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన య‌డ్యూర‌ప్ప మూడ్రోజుల‌కే రాజీనామా చేస్తే…అందులో స‌గం సీట్లు కూడా గెల‌వ‌లేని పార్టీ అధికారంలోకి రావ‌డం విచిత్రం కాక మ‌రేంటి?

తంతే బూరెల బుట్ట‌లో ప‌డ్డాడ‌ని ఓ సామెత‌. బూరెల బుట్ట‌లో ఏం ఖ‌ర్మ‌..గారెలూ అరిసెలూ మురుకులూ పునుగులూ అన్నీ ఉన్న బుట్ట‌ల‌మీద ప‌డ్డాడు కుమార‌స్వామి . లేక‌పోతే గెలుచుకున్న 37 సీట్ల‌కు ముఖ్య‌మంత్రి అయ్యే యోగం ప‌ట్టిందంటే ఎక్క‌డో న‌క్క‌తోక తొక్కుండాలి. క‌ర్ణాట‌క‌లోని మొత్తం సీట్ల‌లో ఏడోవంతు సీట్లు కూడా గెల‌వ‌లేని పార్టీ అధికారంలోకి రావ‌డ‌మంటే సుడి సునామీలా తిరుగుతుండాలి. జేడీఎస్ మూడో స్థానానికే ప‌రిమిత‌మ‌వుతుంద‌నీ.. కాక‌పోతే ఏపార్టీకీ సంపూర్ణ మెజారిటీ కాక జేడీఎస్ కింగ్‌మేక‌ర్ అవుతుంద‌ని ఎగ్జిట్‌పోల్స్ ముందే ఊహించాయి. చివ‌రిక‌దే జ‌రిగింది.

అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌ర‌మైంది ఏడే సీట్లే అయినా జేడీఎస్‌ని క‌లుపుకుని వెళ్లేందుకు సిద్ధ‌ప‌డింది బీజేపీ. ఆలోపే గెలుపు ముఖం చూసి చాన్నాళ్ల‌యిన కాంగ్రెస్ జేడీఎస్‌కి జై కొట్టింది. త‌న‌కేమీ ప‌ద‌వులు వ‌ద్దంది. బేష‌రుతుగా మ‌ద్ద‌తిస్తాన‌ని జేడీఎస్‌ని ఎటూ పోకుండా చేసింది. బీజేపీకి మ‌ద్ద‌తిస్తే మ‌హాఅయితే ఓ డిప్యూటీ సీఎం ప‌ద‌వి, రెండుమూడు కేబినెట్ పోస్టులొస్తాయి. అదే కాంగ్రెస్‌తో క‌లిస్తే ఏకంగా కుమార‌స్వామి ముఖ్య‌మంత్రి అవ్వొచ్చు. ఆ కోరిక క‌ల‌గా మిగిలిపోకుండా నిజ‌మైంది. బీజేపీ మితిమీరిన ఆత్మ‌విశ్వాస‌మో, లేదంటే వ్యూహ వైఫ‌ల్య‌మో కానీ…కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో జేడీఎస్ క‌ర్ణాట‌క‌లో అధికారంలోకొస్తోంది.

బ‌య‌టినుంచి మ‌ద్ద‌తిస్తాన‌న్న కాంగ్రెస్‌ని ప్ర‌భుత్వంలో ఉండాల్సిందేన‌ని ఒత్తిడిచేశాడు దేవ‌గౌడ. దానికి ఒప్పుకుంటేనే మ‌ద్ద‌తిస్తామ‌న్నాడు. బ‌య‌టుంటే ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో తెలీదు. అదే క‌లిసుంటే మునిగినా తేలినా మూకుమ్మ‌డిగా జ‌రిగిపోతుంది. అద‌న్న‌మాట స‌ర్వ‌కాల నిద్రావ‌స్థ‌లో ఉండే దేవ‌గౌడ ఆలోచ‌న‌. ఇల్లు అల‌క‌గానే పండ‌గ‌కాదు. బీజేపీని దెబ్బ‌కొట్టామ‌ని జేడీఎస్‌-కాంగ్రెస్ చంక‌లు గుద్దుకున్నా ఈ మురిపెం ఎన్నాళ్లో చెప్ప‌లేం. రెండు సీట్ల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్య‌ని బ‌ట్టి మంత్రి ప‌ద‌వులు పంచుకోబోతున్నారు. డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ నేత‌కు అవ‌కాశ‌మివ్వ‌బోతున్నారు. కొత్త జంట కాబ‌ట్టి కొన్నాళ్లు స‌ర‌దాగానే గడుపుతారు. ఆ త‌ర్వాత ఎలా ఉంటుంద‌న్న‌దే ప్ర‌శ్న‌.

కౌంటింగ్ త‌ర్వాత కుమార‌స్వామి సోద‌రుడు రేవ‌ణ్ణ దాదాపు 12మంది ఎమ్మెల్యేల‌తో బీజేపీ వైపు వెళ్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే కాళ్లావేళ్లాప‌డి అత‌నికి న‌చ్చ‌జెప్పుకోవ‌డంతో కుమార‌స్వామి సీఎంకాగ‌లిగాడు. ఇక కాంగ్రెస్‌లో ఎవ‌రి గ్రూపు వారిదే. సిద్ధ‌రామ‌య్య‌ని కొంద‌రు బాహాటంగానే వ్య‌తిరేకిస్తున్నారు. మంత్రివ‌ర్గం కొలువుదీర‌గానే అసంతృప్తులు మొద‌ల‌వ్వ‌టం ఖాయం. ఎన్ని ప్ర‌లోభాలొచ్చినా, ఎన్ని ఒత్తిళ్లొచ్చినా పార్టీకోసం అన్నీ వ‌దులుకున్న ఎమ్మెల్యేలు మా సంగ‌తేంట‌ని అడిగితే అంద‌రినీ సంతృప్తిప‌ర‌చ‌డం కుమార‌స్వామికి త‌ల‌కుమించిన వ్య‌వ‌హారమ‌వుతుంది. రెండ్రోజులు కాబ‌ట్టి ఎటూ క‌ద‌ల‌కుండా చూశారుగానీ…కోరిక‌లు రెక్క‌లు తొడిగే ఎమ్మెల్యేల‌ను నెల‌లు ఏళ్ల త‌ర‌బ‌డి కంట్రోల్లో ఉంచుకోవ‌డం అంత సులువేం కాదు. సో…కుమార‌స్వామి స‌ర్కారుకు దిన‌దిన‌గండ‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here