Home News Politics

ఏం చేస్తున్నావ్ ప‌వ‌న్ బాబా?

రీలుకో ట్విస్ట్‌..ఫ్రేమ్‌కో డైలాగ్..

రీల్ లైఫ్‌లో ఏద‌న్నా సాధ్య‌మే. హెలికాప్ట‌ర్‌నుంచి దూకేయొచ్చు. చెయ్యి అడ్డంపెట్టి ప‌రిగెత్తే రైలుని ఆపేయొచ్చు. ఏం చేసినా ఈల‌లు, చ‌ప్ప‌ట్లు, వ‌న్స్‌మోర్‌లు. కానీ రియ‌ల్ లైఫ్ అలా ఉండ‌దు. ప‌బ్లిక్‌లోకొస్తే ఏమ‌న్నా అంటారు. వెండితెర‌మీద హీరోయిజం బ‌య‌టెక్క‌డా లేక‌పోయేస‌రికి నీర‌స‌ప‌డ‌తారు. తెర‌మీద‌ ప‌వ‌ర్‌స్టార్‌గా ఎంత‌మందిని మెప్పించినా జ‌న‌సేనానిగా మాత్రం ఒప్పించ‌లేక‌పోతున్నాడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. ఎందుకంటే ఏటి సెప్తాం. త‌న‌కి తిక్కుంద‌ని దానికో లెక్కుంద‌నేది ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సిన్మాలో డైలాగ్‌. రియాలిటీలోకొస్తే మొద‌టిదే క‌నిపిస్తోందిగానీ ఆ రెండోదే…కాగ‌డా వేసి వెతికినా ఎక్క‌డా క‌నిపించ‌డంలేదు.జ‌న‌సేన పార్టీ పెట్టిన‌ప్పుడే అది మ‌రో ప్ర‌జారాజ్యం అవుతుంద‌ని కొంద‌రు విమ‌ర్శ‌లు చేశారు. ఆ పార్టీలో యువ‌రాజ్యం బాధ్య‌త‌ల్ని చూసిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి అందులో లోటుపాట్లేంటో, వ్యూహాత్మ‌క త‌ప్పిదాలెలా జ‌రిగాయో అన్నీ తెలుసు. అందుకే ఆ పొర‌పాట్లు జ‌ర‌గ‌నివ్వ‌మ‌ని ఓ మాటైతే అడ్డ‌మేశాడు గానీ…ప్ర‌తీ అడుగూ త‌ప్ప‌ట‌డుగే.

పార్టీ పెట్టి ఐదేళ్లు కావ‌స్తోంది. ఇప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో తాడూబొంగరం లేదు. జ‌న‌సైనికులు కావాల‌ని ఆ మ‌ధ్యో ప్ర‌క‌ట‌న‌. అక్క‌డ‌క్క‌డా రిక్రూట్‌మెంట్లు. వాళ్ల‌నేంచేశారో, ఎలా వాడుకుంటున్నారో, పార్టీ సంస్థాగ‌త నిర్మాణంలో వాళ్ల పాత్రంటే వ‌న్ అండ్ ఓన్లీ ప‌వ‌న్‌కే తెలుసు. ఇదేమ‌న్నా సిన్మానా…ఆయ‌న వీరాభిమానులు న‌లుగురైదుగురు ఊళ్ల‌లోకి వెళ్లిపోయి చైత‌న్యాన్ని ర‌గిలించేస్తే…దెబ్బ‌కి జ‌నం మూడ్ మారిపోవ‌డానికి. మొన్న‌టిదాకేమో అధికారం ల‌క్ష్య‌మే కాద‌న్నారు. ఎన్నిక‌ల్లో గెలుపోట‌ముల‌పై ఆశే లేద‌న్న‌ట్లు మాట్లాడారు. ఏపీలో 175 సీట్ల‌లో మూడోవంతు స్థానాల‌కే పోటీచేస్తామ‌నే సంకేతాలిచ్చారు. మ‌రి ఇప్పుడో..175 సీట్ల‌లో పోటీకి స‌య్యంటూ తొడ‌గొడుతున్నారు. అన్ని సీట్ల‌లో నిల‌బెట్టేందుకు పార్టీక‌స‌లు నేత‌లెక్క‌డున్నార‌ని?!. మీటింగ్‌కొచ్చే ప్ర‌తీవాడూ నాయ‌కుడే. ఎవ‌రో ఒక‌రిని నిల‌బెట్టేస్తారా? ఎన్నిక‌ల‌నాటికి ప్ర‌ధాన‌పార్టీల్లో టిక్కెట్లు ద‌క్క‌నివారొస్తే కండువాలు క‌ప్పేసి చేతికి బీ ఫాం ఇచ్చేయొచ్చ‌నా?

జ‌గ‌న్‌పార్టీకి పీకే రూపంలో ఓ వ్యూహ‌క‌ర్త ఉండొద్దా? అందులోనూ 175 సీట్ల‌లో పోటీచేయాల‌నుకుంటున్న‌ప్పుడు తిమ్మినిబ‌మ్మిని చేసి..ఆకాశానికి నిచ్చెన‌లేసి..పేక‌మేడ‌ల్ని క‌ట్ట‌గ‌ల మొన‌గాడొక‌డు ఉండాల్సిందే. జ‌న‌సేన పార్టీకి చీఫ్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్‌గా తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు దేవ్‌. ఉత్త‌రాది నుంచేం ప‌ట్టుకురాలేదు. అప్పుడెప్పుడో కామ‌న్‌మ్యాన్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్‌లో (ఎక్క‌డో విన్న‌ట్లుంది క‌దూ..ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీలాఆ ఒక‌ప్పుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పెట్టిందే) ప‌నిచేసిన అనుభ‌వం ఉంద‌ట ఆయ‌న‌కి. ఆయ‌న‌కు 1200మంది సీసీఎఫ్ (అదే ఫోర్స్‌) వాలంటీర్లు ఆయ‌న‌కు స‌హ‌క‌రిస్తార‌ట‌. ఇదేమ‌న్నా ఠాగూర్ సిన్మానా…గుప్పెడుమంది క‌లిసి ఓ ఫోర్స్‌ని పెట్టి అవినీతి స‌మాజాన్ని గ‌డ‌గ‌డ‌లాడించేందుకు.

జ‌న‌సేన వ్యూహ‌క‌ర్త దేవ్ అద్భుతాలు సృష్టించేమాటేమోగానీ అప్పుడే సోష‌ల్‌మీడియా సాక్షిగా కామెడీ అయిపోతున్నాడు. పాత క్లిప్పింగ్‌లుంటాయిగా..ఎంత సూటూబూటు వేసుకుని కొత్త ట‌చ‌ప్ వేసుకున్నా పాత వాయిస్‌లు అలాగే ఉన్నాయి మ‌రి. ఇప్పుడీయ‌న తోక ప‌ట్టుకుని గోదావ‌రి ఈదాల‌నుకుంటున్నాడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. ఆయ‌నేమో జ‌న‌సేన అధికారంలోకొస్తుందంటూ ఆడ‌ని సిన్మాకి అదిరిపోయే టీజ‌ర్‌లా హ‌డావుడి మొద‌లుపెట్టేశాడు. మిగిలిన‌వ‌న్నీ ప‌క్క‌న‌పెట్టి సంస్థాగ‌తంగా ఎలా బ‌లోపేతం కావాలి..బూత్‌లెవ‌ల్‌కి పార్టీని ఎలా తీసుకెళ్లాల‌నేదానిపై క‌స‌ర‌త్తు చేయ‌కుండా అన్ని స్థానాల్లో పోటీచేస్తాం..అధికారంలోకొస్తామంటే అది ప‌గ‌టిక‌లే. దేవ్ కాదు క‌దా..ఆ బ్ర‌హ్మ‌దేవుడొచ్చినా అంతే. ఇది రీల్ కాదు బాబా…రియ‌ల్ లైఫ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here