Home News Politics

పవన్ పయనమెటూ…జనసేన స్కెచ్ ఇదేనా…?

ఒక అబ‌ద్దాన్ని ప‌దేప‌దే చెప్ప‌డం ద్వారా నిజం చేయాల‌ని చూసే రోజుల్లో ప్ర‌జ‌లు ఉన్నారా? బ‌ల‌మైన నాయ‌కుడు ఒక పిలుపు ఇచ్చినంత మాత్రాన మంచేదో చెడోదో తెలుసుకోలేని స్థితిలో ప్ర‌జ‌లు ఉన్నారా?- తాజాగా ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ‌.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ఎన్నిక‌ల స‌ర్వేచేసిన‌ప్పుడు ప్ర‌జ‌ల నుంచి ఎదురైన ఎదురు ప్ర‌శ్న‌లు ఇవి! ముఖ్యంగా జ‌న‌సేన పార్టీతో ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి.. తాను మార్పు చేస్తాన‌ని చెబుతున్న ప‌వ‌న్‌.. స‌మాజంలో మార్పు తీసుకు రాక‌మునుపే.. తానే మారిపోయిన ఉదంతం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది.

ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చే స‌రికి యూట‌ర్న్ తీసుకున్న నాయ‌కుడు ఎవ‌రైనా ఉంటే.. ప‌వ‌నే అనే వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రం విభ‌జ‌న క‌ష్టాల‌తో అట్టుడుకుతున్న స‌మ‌యంలో అనేక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. వీటికి సంబంధించి ప్ర‌జ‌లు.. ఆయా పార్టీల నాయ‌కుల నుంచి అనేక హామీల‌ను కోరుతున్నారు. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా విష‌యంపై ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ త‌మ ఆశ‌ల‌ను స‌జీవం చేసుకున్నారు. దీనిని సాధించే మొన‌గాడు ఎవ‌ర‌నే విష యంపై వారు ఎదురు చూస్తున్నారు. అయితే, మ‌రి కొద్దిరోజుల్లో ఎన్నిక‌లకు వెళ్ల‌నున్న ప‌రిస్థితిలోనూ ఈ హామీపై ఏ ఒక్క పార్టీ కూడా ఇత‌మిత్థంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి హామీ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక రాష్ట్ర ప‌రిస్థితిని గ‌మ‌నించిన ఇచ్చే హామీల నుంచి త‌ప్పించుకునేందుకు ప‌వ‌న్‌వంటి నాయ‌కుడు వేరే వేరే విష‌యాల‌ను తెర‌మీదికి తెస్తున్నాడ‌నే బ‌ల‌మైన వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో ఏపీకి కానీ, ఏపీ ప్ర‌జ‌ల‌కు కానీ ఎలాంటి లాభం ఉంటుంది? అనే ప్ర‌శ్న కూడా తెర‌మీదికి వ‌స్తోంది. కీల‌క మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో కేవ‌లం వైసీపీని ఓడించాల‌నే ఏకైక ల‌క్ష్యంతో ప‌వ‌న్ ఈ త‌తంగానికి తెర‌దీశార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో తెలంగాణ, ఏపీ మ‌ధ్య వైరుధ్యాలు పెట్టే నాయ‌కుడిని ఏపీ ప్ర‌జ‌లు కోరుకోవ‌డం లేదు.

ఏపీకి-తెలంగాణ‌కు మ‌ధ్య స‌యోధ్య చేసి.. విభ‌జన తాలూకు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునే నాయ‌కుడి కోసం అన్వేషిస్తున్నారు. మ‌రి ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా. ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు ఎవ‌రికి చేటు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏపీకి తెలంగాణ వంటి కీల‌క రాష్ట్రం నుంచి అనేక రూపాల్లో సాయం అందాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే, ప‌వ‌న్ చేస్తున్న రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌తో రానున్న రోజుల్లో ఇరు రాష్ట్రాల మ‌ధ్య సంబంధాలు జ‌ఠిల‌మ‌వుతాయ‌ని అంచ‌నా వేస్తున్న‌వారు ఉన్నారు.

గ‌తంలో ప‌వ‌నే చెప్పిన‌ట్టు.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య సుహృద్భావ వాతావ‌ర‌ణం.. ఇప్పుడు తాను చేస్తున్న వ్యాఖ్య‌ల వ‌ల్ల ఉంటుందా? ఊడుతుందా? అన్న‌ది ప‌వ‌న్ ఆలోచించుకోవాల‌ని మేధావులు సూచిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ వ్యాఖ్యలతో వచ్చే కొన్ని ఓట్లు కూడా పవన్ కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here