Home News Politics

జనసేన పయనమెటూ….?

కొన్ని రోజులు పార్టీ కార్యాక్రమాలతో జనంలో మమేకం అవుతారు…అంతలోనే అదృశ్యమవుతారు. ఒకవైపు కమిటీలు వేసుకుంటూ కదనరంగంలోకి దిగుతారు మరోవైపు క్లారిటీ లేకుండా కాలయాపన చేస్తారు ఇదంతా తృతియ రాజకీయ ప్రత్యామ్నాయంగా ఆంధ్రా రాజకీయాల్లో అడుగుపెట్టిన జనసేన పార్టీ రాజకీయ ముఖచిత్రం. అంతాబాగానే ఉంది. అయితే తెలుగుదేశంతో కొంతకాలం కలిసి నడిచిన పాపం వెన్నాడుతోంది. పొత్తుకోసం ప్రయత్నించి విఫలమైన వైసీపీ కసితో వేటాడుతోంది. ప్రజారాజ్యం వైఫల్యాలు ప్రజల్లో అనుమానాల రూపంలో వెన్నాడుతున్నాయి. ఇప్పుడిప్పుడే పురుడుపోసుకుంటున్న పార్టీకి నలువైపులా సమస్యలు చుట్టుముడుతున్నాయి ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేన పయనమెటూ ….

అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీని నియమించారు. ఇందులో తన విధేయులు, దీర్ఘకాలంగా పార్టీతో ముడిపడినవారు, అనుభవజ్ణులకు చోటు కల్పించారు. పైరవీలు, అవినీతి ఆరోపణలు లేనివారితోనే వడపోత చేయాలని తలపోస్తున్నారు. ఇక పోటీలో దింగేందుకు అధినేత సిద్దమవుతున్నారు. తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి మాజీ సీఎం జయలలితకు సన్నిహితుడు రామ్మోహన్ రావుని రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. కానీ ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. పార్టీ పై ప్రజల్లో నమ్మకం కలిగించడంలో ఎక్కడో ట్రాక్ తప్పుతుంది. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు రెండు తమ మధ్యలో మూడో ప్రత్యర్థి వస్తే తమకే నష్టమని భావిస్తున్నాయి. దాంతో జనసేన తొలి ప్రస్థానానికి ఆదిలోనే గండి కొట్టాలని యత్నిస్తున్నాయి.

ఒకసారి తమతో జత కట్టిన జనసేన ఒంటరిగా వెళ్లడాన్ని అధికారపార్టీ సహించలేకపోతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన తమ అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తుందని టీడీపీ ఒక అంచనాకు వచ్చేసింది. వీలుంటే పొత్తు లేకపోతే జనసేన క్రెడిబిలిటీని పూర్తిగా దెబ్బతీయడమనే ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. జనసేన తమకు ప్రత్యర్థి కాదనే భావనను క్యాడర్ లోకి ప్రజల్లోకి పంపుతున్నారు. దీనివల్ల సహజంగానే జనసేన బలహీనపడిపోతుంది. అభ్యర్థుల విషయానికొస్తే వైసీపీ, జనసేన కంటే ఉభయగోదావరిజిల్లాల్లో టీడీపీకే బలమైన వ్యక్తులు ఉన్నారు. ఆర్థికంగా, అంగబలం రీత్యా కూడా టీడీపీ అభ్యర్థులది ప్రత్యర్థులకంటే పై చేయే. ముఖ్యమైన నాయకులందరూ టీడీపీలోనే ఉండటంతో ప్రతిపక్షాలకు నాయకత్వ కొరత వెన్నాడుతోంది. దీనిని ఆసరాగా చేసుకుంటూ జనసేన బలాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి విజయం సాధించాలని యోచిస్తోంది టీడీపీ.

ఇక ఓటర్లలో విశ్వాస రాహిత్యం ఏర్పడితే జనసేనకు చాలా కష్టం. తొలి ప్రయత్నంలోనే ఎదురుదెబ్బ తగలవచ్చు. ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేనలు కలుస్తాయనే వదంతులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. దీనిని అడ్డుకోవడం జనసేనానికి సాధ్యం కావడం లేదు. పవన్ తన సన్నిహిత సహచరుడు నాదెండ్ల మనోహర్ ఇద్దరు టీడీపీతో సహృద్బావ వాతావరణంతో వెళ్ళాలనే ఫ్యూహం వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. దీంతో పవన్ కల్యాణ్ చిత్తశుద్ధిని ప్రత్యర్థులు ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఒకసారి పొత్తుతో ఆ పార్టీని విజయతీరాలకు చేరిస్తే వారు తమపట్ల అనుసరించిన ధోరణి పై పార్టీలోని కాపు సామాజికవర్గం నేతలు భగ్గుమంటున్నారు.

జనసేన పేరు చెబితే వైసీపీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. పాత అనుభవాలు పక్కనపెట్టినా తాజాగా చేసిన ప్రయత్నాలూ వికటించాయి. టీఆర్ఎస్ ద్వారా రాయబారం నడిపి జనసేనను మచ్చిక చేసుకోవాలని ప్రయత్నించారు. 20 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్ల వరకూ అవగాహనకు వచ్చేందుకు సంప్రదింపులు సాగినట్లు రాజకీయ వర్గాల సమాచారం. అయితే పవన్ భీష్మించుకుని అసలు చర్చలకే అంగీకరించకపోవడంతో కథ ముందుకు నడవలేదు. అధికారపీఠాన్ని తమకు అందకుండా చివరలో జనసేన నోటికాడ కూడును కిందపడేలా చేస్తుందేమోననే అనుమానం వైసీపీలో ఉంది.

ఉభయగోదావరి జిల్లాల్లోని 34 స్థానాలు చాలా కీలకం. ఇటు రాయలసీమలో వైసీపీకి ఆధిక్యం లభిస్తే అటు ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దానిని బ్యాలెన్స్ చేయగల సామర్థ్యం టీడీపీకి ఉంది. ఇక డిసైడింగ్ ఫాక్టర్ గా గోదావరి ప్రాంతాలను రాజకీయ పరిశీలకులు పరిగణిస్తున్నారు. అందుకే జనసేన పార్టీ అధినేత పవన్ సైతం తాను కింగ్ మేకర్ ను అవుతానని పార్టీ అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు. అదను చూసి జనసేనను దెబ్బతీయాలనే ఎత్తుగడలు వేస్తోంది వైసీపీ. పవన్ కల్యాణ్ చిత్తశుద్ధి, విశ్వసనీయతనే లక్ష్యంగా చేసుకుంటూ ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది వైసీపీ.

సందట్లో సడేమియా, ఆటలో అరటి పండు అన్నట్లుగా ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ జనసేనను కవ్విస్తున్నారు. రాష్ట్రంలో ఒక్కసీటూ గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ తానే అధికారంలోకి వస్తానని చెబుతుంటారు పాల్. మీడియాలో, ప్రజల్లో ఆయనకు బాగానే ఆదరణ లభిస్తోంది. ఓట్లు వేస్తారో లేదో తెలియదు కానీ ఆయనను కమెడియన్ పొలిటీషియన్ గా చూస్తున్నారు. పవన్ తనతో కలవాల్సిందేనంటూ డిమాండు చేయడంతోపాటు ఒక రకంగా జనసేనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారాయన. ఎస్పీ వర్గాల్లో యువతలో పవన్ కు కొంత ఆదరణ ఉంది. వారిని లక్ష్యంగా చేసుకుంటూ పాల్ ప్రచారానికి తెర తీశారు. పవన్ ను తనవైపు తీసుకురావాల్సిన బాధ్యత వారిదే అన్నట్లుగా సంప్రదింపులు మొదలుపెట్టారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఇందుకు సంబంధించి ఒత్తిడి పెంచుతున్నారు. చెవిలోని జోరీగ మాదిరిగా పాల్ చేస్తున్న హడావిడి జనసేన వర్గాలకు చికాకు కలిగిస్తోంది. ఆయనను విస్మరించాలో, ఖండించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

మొత్తమ్మీద రాజకీయ ముఖచిత్రంలో జనసేన ప్రస్థానం ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీ ప్రజావిశ్వాసాన్ని ఎంతవరకూ పొందగలుగుతుందనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here