Home News

సింహపురిలో జనసేన ఇక అంతేనా…!

నెల్లూరు జిల్లాలో జనసేన కనుమరుగు కాబోతుందా? … ఉన్న నాయకులు పార్టీ నుంచి బయటకు పోతున్నారా? … అధినేత సమీక్షల్లో తమను పట్టించుకోవడం లేదని వారు అసంతృప్తితో ఉన్నారా? లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల లెక్కలతో ఇతర పార్టీల వైపు చూస్తున్నారా? .. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అమితంగా అభిమానించే సింహపురిలో ఆ పార్టీ పరిస్థితి ఏంటి ?

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు నెల్లూరుపై ప్రత్యేక అభిమానం వుంది… ఆయన తండ్రి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ కుటుంబం ఇక్కడే నివిసించింది.. మరోవైపు ఇక్కడ నుంచే ఆయన అన్నచిరంజీవి చెన్నైవెళ్ళి … సినిమాలలో సెటిల్ అయ్యారు .. వాటితో పాటు పవన్ ఇంటర్‌ వరకు నెల్లూరులోనే చదువకున్నారు .. అంతేకాదు ఈ ప్రాంతానికి చెందిన కమ్యూనిస్టు నాయకుడు సుందరయ్య అయనకు అభిమాన నాయకుడు కూడా .. అందుకే నెల్లూరు జిల్లా అంటే ప్రత్యేక అభిమానం జనసేన అధినేతకి .. ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ నెల్లూరు గురించి ఆయన చెపుతుంటారు …

జనసేన అవిర్భావం నుంచి పార్టీ ఎన్నికల ప్రచారం వరకు నెల్లూరు జిల్లా పర్యటనకు పవన్ కళ్యాణ్ వచ్చారంటే అభిమానులతో నెల్లూరు వీధులు కిటకిటాలాడిపోయి .. జన ప్రభంజనం కనిపించేది…అయితే ఎన్నికల్లో మాత్రం జనసేనకు ఆ రేంజ్లో ఓట్లు పడలేదు … రెండు నుంచి మూడు శాతం ఓటర్లు కూడా పవన్‌ పార్టీని ఆదరించలేదు … జిల్లాలోని ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్లు దక్కలేదు… పార్టీకి సంస్థాగత నిర్మాణం లేకపోవడం .. పవన్‌పై యువతకు ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకోలేక పోవడమే అందుకు కారణమని చెప్పవచ్చు … జిల్లాలో కేవలం ఒక్క కావలి నియోజకవర్గంలో మాత్రమే జనసేనకు పదివేల వరకు ఓట్లు వచ్చాయి … తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 8 వేల ఓట్లు రాగా , కోవూరు, నెల్లూరు సిటి, సూళ్ళూరు పేట నియోజకవర్గాలలో ఐదు వేల ఓట్లు పడ్డాయి…

మిగతా నియోజకవర్గాలలో కేవలం రెండు నుంచి మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి… వెంకటగిరి, ఆత్మకూరు, గూడూరుల్లో అయితే నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి .. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్‌ నుంచి జనసేన పొత్తుతో బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ శ్రీహారి రావు పోటీ చేసారు… నెల్లూరు ఎంపి స్థానంనుంచి సిపిఎం పోటీ చేసింది… సిపిఎం అభ్యర్థి చండ్ర రాజగోపాల్ కు కేవలం 19 వేల ఓట్లు మాత్రమే వచ్చాయంటే జనసేన వైఫల్యం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు..

అయితే ఎన్నికల తర్వాత సమీక్షలు నిర్వహించిన పవన్ కళ్యాన్ .. పార్టీ పాతిక సంవత్సరాల పాటు కొనసాగేలా .. గ్రామాస్థాయి నుంచి బలోపేతం చేస్తానని చెప్పారు … అయితే అ దిశగా చర్యలు మాత్రం నెల్లూరు జిల్లాలో కనిపించడం లేదు … జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉండి.. కావలిలో జనసేన నుంచి పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ ఇప్పుడు జనసేనకు రాజీనామా చేశారు… ఇతను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది… గత ఎన్నికల్లో పార్టీకి అర్థికంగా అండదండలు అందించిన సుధాకర్‌ జనసేన నుంచి సైడ్‌ అవ్వడం అంటే … మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ..

ఎన్నికల ముందే తాము గ్రామస్థాయి కమిటీల గురించి చెబితే రాష్ట పార్టీ కార్యాలయం ఏమాత్రం స్పందించలేదని జనసేన నేతలు విమర్శిస్తున్నారు … అగస్టు చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటీఫికేషన్ వెలువడే అవకాశమున్నా .. ఇప్పటి దాకా కనీసం జిల్లా, మండల స్థాయి కమిటీల గురించి పార్టీ అలోచించడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు … ఇలాంటి పరిస్థితులలో ఎన్నికల ముందు హాడావుడి చేసే కంటే …ఇతర పార్టీలలోకి పోయి అక్కడ నుంచి పోటీ చేయాలని కొంతమంది ఔత్సాహికులు రెడీ అవుతున్నారు…

మొత్తమ్మీద జిల్లాలో జనసేన పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదని ..నాయకులు వదిలి పోతున్నా నాయకత్వం పట్టించుకోవడంలేదని .. పవన్‌ అభిమానులు తెగ ఇదై పోతున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here