Home News Stories

జగిత్యాల కోటలో జీవన్ రెడ్డిని జయిస్తారా….?

జగిత్యాల కోట పై పోరు నువ్వా.. నేనా అన్నట్లు సాగుతోంది. టీఆర్‌‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. అయితే ఇక్కడ ప్రధాన పోటీ మాత్రం హస్తం-గులాబీ పార్టీల మధ్యే ఉంది. కేసీఆర్ కూతురు కవిత ఈ సీటు పై ప్రత్యేక దృష్టిపెట్టడంతో ఇక్కడ రెండు పార్టీల మధ్య పోరు యావత్ రాష్ట్రాన్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ పోటి చేస్తున్న వారిలో ఒకరు రాజకీయ దురంధరుడు కాగా మరొకరు ఒక్క చాన్స్ అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. జగిత్యాల రాజకీయ ముఖచిత్రం పై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ రిపొర్ట్…

జీవన్‌ రెడ్డి, సంజయ్‌లు రెండవసారి తలపడుతుండగా, బీజేపీ అభ్యర్థి రవీందర్‌రెడ్డి తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రత్యేకత సంతరించుకున్న జగిత్యాల నియోజకవర్గంలో గెలుపోటములు పై అంతట ఆసక్తి నెలకొంది. ముగ్గురు అభ్యర్థులు ఎవరికి వారే ప్రచారం హోరెత్తిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌ కుమార్‌ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన తరపున నిజామాబాద్‌ ఎంపీ కవిత రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ గులాబీ దళపతి కేసీఆర్ కూడ ఒక విడత ప్రచారం నిర్వహించారు.

తాజా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి కూడా తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. నిత్యం ఆరేడు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్నారు. ఆయన తరపున ప్రజాగాయకుడు గద్దర్‌ జగిత్యాల, సారంగాపూర్‌లో రోడ్‌ షో నిర్వహించి ప్రచారం చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ బీర్‌పూర్‌లో ప్రచారం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కూడా ఇంటింటికీ తిరుగుతూ జీవన్‌రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అలాగే రాయికల్‌, జగిత్యాలలో రేవంత్‌రెడ్డి సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

బీజేపీ అభ్యర్థి ముదుగంటి రవీందర్‌ రెడ్డి కూడా తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు. మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈయన తరుపున పరిపూర్ణానంద స్వామి జగిత్యాలలో ప్రచారం చేశారు. దీనికి తోడు మహారాష్ట్ర నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్య నాయకులు జగిత్యాలకు చేరుకుని మండలాలవారీగా ప్రచారం చేస్తున్నారు.


టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌కుమార్‌ అభివృద్ధిపైనే ఆశలు పెంచుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందనప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటున్నానని, ఈ నాలుగేళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి కోసం రూ.1200 కోట్లు మంజూరు చేయించానని చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, నిజామాబాద్‌ ఎంపీ కవిత సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నానని, అదే నన్ను గెలిపిస్తుందని ఆశలో ఉన్నారు. దీనికి తోడు ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, సబ్సిడీ గొర్రెలు పొందిన లబ్ధిదారులు అండగా ఉంటారని దీమాగా ఉన్నారు.

తాజా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకతే తనను గెలిపిస్తుందన్న ఆశతో ఉన్నారు. ఆరుసార్లు గెలుపొందిన తాను నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని, ప్రజల్లో సానుభూతి ఉందనే దీమాతో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభంజనం వీచిన సమయంలోనే 2014లో ఎదురొడ్డి గెలుపొందానని అంటున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు కాంగ్రెస్‌కు అండగా ఉంటారని ఆశిస్తున్నారు. దీనికి తోడు మహా కూటమి పొత్తుతో టీడీపీకి చెందిన ఎల్‌.రమణ మద్ధతు ఉండటంతో ఆ పార్టీ క్యాడర్‌ సహకారం, టీడీపీ ఓటు బ్యాంకు తనకే ఉంటుందని నమ్ముతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here