Home News

జగన్ సర్కార్ క్యాస్ట్ ‘పాలిట్రిక్స్’ …!

సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్సులా జగన్ సర్కార్ చట్టాలను చేసేస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రజలను ప్రభావితం చేసే వివిధ కీలక చట్టాలను అధికారంలోకి వచ్చిన రెండు నెలలు గడవక ముందే అమల్లోకి తెస్తోంది. చట్టాల రూపకల్పనలోనూ ఈ స్థాయిలో జగన్ దూకుడు వెనుక కారణాలేంటీ..? ఏం టార్గెట్ చేసుకుని జగన్ వరుస పెట్టి కీలక చట్టాలను రూపకల్పన చేస్తున్నారు..?

పాలనా పరమైన నిర్ణయాల్లోనే కాదు.. చట్టాలు చేసే విషయంలోనూ జగన్ సర్కార్ దూకుడును ప్రదర్శిస్తోంది. కీలక చట్టాలను రూపొందించడానికి ఎంతో సమయం తీసుకోవాలనే రోటీన్ పద్దతికి స్వస్తి చెప్పి అతి తక్కువ కాలంలోనే కీలక బిల్లులను ప్రవేశపెట్టడం ద్వారా జగన్ ప్రభుత్వం కొత్త అధ్యాయానికి తెర తీసిందనే చెప్పాలి. పరిపాలనా పగ్గాలు చేపట్టి రెండు నెలలు గడవక ముందే అతి ముఖ్యమైన అంశాలపై చట్టాలు చేసిన సీఎం జగన్ వ్యూహంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50 శాతం పదవులను కట్టబెట్టే బిల్లు, అలాగే కాంట్రాక్టుల్లో కూడా అవే వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు.. ఇక రెండు అంశాల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ చేసిన చట్టం కీలక చట్టంగానే చెప్పాలి. అలాగే శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాన్ని అతి తక్కువ కాలంలోనే తీసుకోవడమే కాకుండా.. దానికి అనుగుణంగా బిల్లును ఆమోదించేసి చట్టాన్ని కూడా చేసింది జగన్ సర్కార్. అలాగే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే కీలకాంశం పైనా చట్టం చేసింది ఏపీ సర్కార్. దీంతోపాటు కీలక కౌలు రైతులకు హక్కులు కల్పిస్తూ చట్టం చేసిన ఘనత కూడా ఈ సర్కార్ అతి తక్కువ కాలంలోనే సొంతం చేసుకుందని చెప్పాలి.

ఇలాంటి కీలక బిల్లులను చాలా త్వరగా చట్టరూపంలోకి తెచ్చేసింది సర్కార్. ఇప్పుడిదే అంశంపై రాజకీయ వర్గాల్లో కీలక చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం జగన్ సర్కార్ చేసిన కొన్ని చట్టాలు పైకి మామూలుగా కన్పిస్తున్నా.. అవి అమల్లోకి వస్తే మాత్రం ఆ ప్రబావం ఎవ్వరూ ఊహించనంత స్థాయిలో ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే.. ఎన్నికైన ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తుంటే.. పార్టీ కోసం కష్టపడిన ఇతర కేడర్ నామినేటెడ్ పదవులపై ఆశతో ఉంటారు. ఇలా దక్కించుకునే నామినేటేడ్ పదవుల్లో అగ్ర వర్ణాలకే ఎక్కువగా దక్కుతాయనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ క్రమంలో జగన్ సర్కార్ చేసిన చట్టం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనే చెప్పాలి.

ఈ తరహా చట్టంతో ఆ వర్గాలకు లెక్కకు మిక్కిలి నామినేటెడ్ పోస్టులు దక్కుతాయి. అలాగే సదురు వర్గాలను ఆర్థికంగా ఆదుకునేందుకు కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఆ వర్గాలను ఆర్థికంగా లిఫ్ట్ ఇచ్చినట్టు అయింది.ఈ క్రమంలో ఈ చట్టాల ద్వారా జగన్ తన పార్టీకి కీలక ఓటు బ్యాంకును సిద్దం చేసుకుంటున్నట్టుగా కన్పిస్తోంది. వైసీపీకి సహజంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉంటారు. గత ఎన్నికల్లో ఈ ఓట్లను తమకు పూర్తిగా పడేలా చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో పాటు బీసీ ఓట్లల్లోనూ భారీగానే చీలిక తేవడంలో వైసీపీ సక్సెస్ అయింది. అయితే బీసీ ఓట్లను కూడా టీడీపీకి శాశ్వతంగా దూరం చేసే ప్రక్రియకు ఈ తరహా చట్టాల చేయడం ద్వారా జగన్ సర్కార్ శ్రీకారం చుట్టినట్టు కన్పిస్తోంది.

గత ప్రభుత్వంలో ఒక్క సామాజిక వర్గానికే పెద్ద పీట వేసి.. మిగిలిన వర్గాలను పూర్తిగా పక్కన పెట్టేశారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగిన క్రమంలో జగన్ పాలనా పగ్గాలు చేపట్టాక కులపరమైన తేడాలున్నాయనే చర్చ జరగ్గకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే టైములో బడుగులకు పెద్ద పీట వేస్తామని చెప్పడమే కాకుండా.. వాటిని చట్ట రూపంలో తీసుకురావడమంటే.. కచ్చితంగా క్షేత్ర స్థాయి నుంచి బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల్లో కచ్చితంగా మార్పు వస్తుందనే చర్చ జరుగుతోంది. ఇది కచ్చితంగా బీసీ ఓటు బ్యాంకుతో ఇన్నాళ్లూ రాజకీయం చేసిన టీడీపీని దెబ్బ కొట్టినట్టే అవుతుందనేది రాజకీయ వర్గాల భావన.

ఇదే తరహాలో పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసే చట్టం కూడా రాజకీయంగా వైసీపీ కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. ఇప్పటికే గ్రామ సచివాలయాల ద్వారా భారీ స్థాయిలో రిక్రూట్మెంటుకు తెర లేపింది సర్కార్. మరోవైపు వలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తీసుకు రావడం ద్వారా మరో మూడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది.

రానున్న రోజుల్లో యూత్ ఓట్ల సంఖ్య గణనీయంగా పెరిగే ఛాన్సులున్నాయి. ఈ క్రమంలో యువత ఓటు బ్యాంకును ఫిక్స్ చేసుకోవడానికి ఈ చట్టాలు కలిసి వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు దశల వారీ మద్య నియంత్రణ ఎఫెక్ట్ కూడా గ్రామీణ మహిళల్లో బలంగా ఉంటుంది. మరో వైపు కౌలు రైతులకు హక్కులు కల్పిస్తూ చేసిన చట్టం కూడా ఆ వర్గాలను సాటిస్ఫై చేస్తుందనే చెప్పాలి. ఇలాంటి అంశాలన్నింటి మీద.. అతి తక్కువ కాలంలో చట్టాలు చేసి వైసీపీకి పర్మినెంట్ ఓటు బ్యాంక్ గా మారుస్తున్నాడు సీఎం జగన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here