Home News Stories

సంవత్సరం పూర్తి చేసుకున్న జగన్ పాదయాత్ర….

ఓ వైపు పార్టీ నుంచి వరుసగా ఎమ్మెల్యే ల ఫిరాయింపులు మరో వైపు పార్టీ నడపడం రాదన్న విమర్శలు మరో వైపు
జగన్ హవా తగ్గిపోయిందన్న ప్రచారాలు ఇంకో వైపు ఇలా అనేక ఒడిదొడుకుల మధ్య, ప్రతికూల పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం పాదయాత్ర చేయాలనుకోవడం. తండ్రి బాటలో తాను ఇక ప్రజల్లోనే ఉండాలని… ప్రజల సమస్యలను నేరుగా చూడాలనే సంకల్పంతో ఆయన ఇవ్వాల్టికి సరిగ్గా సంవత్సరం క్రితం 2017 నవంబర్ 6న ప్రజా సంకల్పయాత్రను మొదలుపెట్టారు. కడప జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డికి నివాళి అర్పించి భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తల మధ్య ఆయన పాదయాత్ర ప్రారంభమై నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తైంది.


ఇప్పటి వరకు ఆయన పాదయాత్ర 3,211.5 కిలోమీటర్లు కొనసాగింది. మొత్తం 294 రోజుల్లో 12 జిల్లాల్లో 122 నియోజకవర్గాల మీదుగా ఆయన పాదయాత్ర చేశారు. అక్టోబరు 25న విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని పాయకపాడు వద్ద ఆయన పాదయాత్ర ముగిసింది. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ బయలుదేరడానికి విశాఖపట్నం రాగా అక్కడి ఎయిర్ పోర్టులో ఆయనపై హత్యాయత్నం జరగడం… పాదయాత్రకు విరామం ప్రకటించారు. మళ్లీ నవంబరు 10వ తేదీ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.

పాదయాత్ర ప్రారంభించే నాటికి పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేది. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారడంతో నాయకులు, కార్యకర్తలు కొంత నిరుత్సాహం నెలకొంది. ఈ సమయంలో ప్రారంభించిన జగన్ పాదయాత్ర వారిలో ఉత్సాహం నింపింది. ఎళ్లవేళలా ప్రజల్లోనే ఉంటుండటం… వారిని నేరుగా కలిసి సమస్యలు తెలుసుకుంటుండటం… తమ ప్రభుత్వం వస్తే పరిష్కరిస్తామనే భరోసా ఇస్తుండటంతో ప్రజల్లో జగన్ పట్ల సానుకూలత ఏర్పడింది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ ఓపిక గా తెలుసుకుంటున్నారు. దీంతో ఆయనకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సమస్యల పట్ల అవగాహన పెరిగింది.

ప్రారంభంలో జగన్ పాదయాత్రకు విపరీమైన స్పందన కనిపించింది. అయితే, రాయలసీమ జిల్లాలు కావడంతో సహజంగానే ఆయనకు కొంత సానుకూలత ఉంటుంది కాబట్టి మంచి స్పందన వస్తుందని అంతా అంచనా వేశారు. అయితే, టీడీపీ ఆధిపత్యం ఉన్న అనంతపురం జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనపడింది. ప్రత్యేకించి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మల్యేల నియోజకవర్గాల్లో భారీగా స్పందన కనిపించింది. ఇక రాయలసీమ దాటినా పాదయాత్రకు స్పందన ఏ మాత్రం తగ్గలేదు. ప్రత్యేకించి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ జగన్ కు బ్రహ్మరథం పట్టారు. గత ఎన్నికల్లో టీడీపీకి ఏకపక్షంగా అండగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించే నాటికి వైసీపీ శ్రేణులకు సైతం ఊహించని స్పందన లభించింది. ప్రతి నియోజకవర్గంలో జరిగిన ఆయన బహిరంగ సభలకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఇందులో జన సమీకరణ కొంత ఉన్నా స్వచ్ఛందంగా పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఇక విజయవాడ ప్రకాశం బ్యారేజ్, రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ పై జగన్ పాదయాత్ర… ప్రజల స్పందన ఆ పార్టీ శ్రేణుల్లోనే కాక సాధారణ ప్రజలనూ ఆశ్చర్యానికి గురిచేసింది.

పాదయాత్రకు ముందు జగన్ పక్కా ప్రణాళికను రూపొందించుకున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతం మీదుగా పాదయాత్ర రూట్ మ్యాప్, ఎక్కువ మంది ప్రజలను కలిసే విధంగా ప్రణాళికను తయారుచేసుకున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉండేలా చూసుకున్న ఆయన వాటిలో ఎక్కువగా స్థానిక సమస్యలపై ప్రసంగించేందుకు ప్రయత్నించారు. ఇక ప్రాంతాలవారీగా అక్కడ ప్రభావం చూసే సామాజకవర్గాలు, వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేక ఆత్మీయ సమ్మెళనాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే చేపట్టనున్న ‘నవరత్నాలు’ పథకాలను ప్రజలకు వివరించారు. ఇక స్థానిక సమస్యల పరిష్కారానికి కూడా అనేక హామీలు ఇచ్చారు. ఇక, పార్టీపరంగానూ పాదయాత్ర జగన్ కు ఎంతో మేలు చేసింది. ఏ నియోజకవర్గంలో పార్టీ ఎంతమేర బలంగా ఉందో, ఏ నాయకుడికి ప్రజాబలం ఉందో జగన్ ఒక అంచనాకు రాగలిగారు.

మొత్తానికి తండ్రి బాటలో జగన్ నిర్వహించిన పాదయాత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకువచ్చింది. క్షేత్రస్థాయిలో న్యూట్రల్ గా ఉండే ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత పెరిగిందనే అంచనాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల జాతీయ మీడియా సంస్థలైన ఇండియాటుడే, రిపబ్లిక్ టీవీలు నిర్వహించిన సర్వేల్లోనూ సుస్పష్టమైంది. రాష్ట్రంలో అత్యధిక జనాధారణ కలిగిన నేతగా జగన్మోహన్ రెడ్డి మారడనికి పాదయాత్ర కారణమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here