Home News

ఆ సీనియర్ మంత్రికి జగన్ చెక్ పెట్టారా…!

గత ప్రభుత్వ వ్యవహారాలపై అంతు తేలుస్తామంటూ.. వైసీపీ ప్రభుత్వం ఓ సబ్‌ కమిటీని వేసింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది… ఈ కమిటీలో ముఖ్యమైన వారికి.. ఆయా శాఖలకు చెందిన వారికి చోటు దక్కింది… అయితే ఓ సీనియర్‌ మంత్రి మాత్రం ఆ సబ్‌ కమిటీలో స్థానం సంపాదించుకోలేకపోయారు… ఆ సీనియర్ మంత్రి శాఖలోనే గతంలో అవినీతి జరిగిందంటూ విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ తెగ హడావిడి చేసింది…అలాంటిది ఆ సీనియర్‌ మంత్రికి ఆ కమిటీలో ఎందుకు అవకాశం దక్కలేదు ? పక్కన పెట్టడానికి కారణం ఏంటి..?

ఆంధ్రపదేశ్‌లో జగన్‌మోహన్‌ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టాక గత ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులు .. ఆ ప్రాజెక్టుల్లో అవినీతి ఏ మేరకు జరిగింది.. అనే అంశాలపై ఓ క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు … ముఖ్యంగా ఇరిగేషన్‌ శాఖకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహరాల విషయంలో ఫోకస్డ్‌గా ఉంది వైసీపీ ప్రభుత్వం, అలాగే సీఆర్డీఏ వ్యవహరాల్లోనూ.. భూ సమీకరణ వంటి అంశాల్లోనూ లెక్కకు మించి అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి వైసిపి ఆరోపిస్తూనే ఉంది.

అధికారంలోకి వచ్చాక.. అప్పట్లో తాము చేసిన ఆరోపణల విషయంలో అసలు విషయాలు నిగ్గు తేల్చేందుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీని వేసింది జగన్‌ సర్కార్. ఈ క్యాబినెట్‌ సబ్ కమిటీలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి, కన్నబాబు, గౌతమ్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌లను నియమించింది.. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు విజయసాయి రెడ్డి, మిధున్‌ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిలకు కమిటీలో చోటు కల్పించింది …

ప్రస్తుతం ఆ కమిటీ తన పని మొదలు పెట్టింది. వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ..అయితే తనశాఖ కి సంభందించి విచారణ చేస్తున్న ఈ క్యాబినెట్‌ సబ్‌ కమిటీలో మంత్రి బొత్స సత్యనారాయణకు ఎందుకు చోటు కల్పించలేదనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం మున్సిపల్‌ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న బొత్స సత్యనారాయణ పరిధిలోకే సీఆర్డీఏ వస్తుంది. ఈ క్రమంలో ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న బొత్సకు కమిటీలో స్థానం కల్పించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి…

మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి గత ప్రభుత్వం మీద విరుచుకుపడడంలో బొత్స ముందు వరుసలోనే ఉంటున్నారు… ప్రజా వేదిక కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాక ముందు నుంచి ప్రభుత్వ వాదనను బలంగా వినిపించే ప్రయత్నమూ చేశారు … అలాగే అర్బన్‌ హౌసింగ్‌ స్కీములో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆధారాలతో సహా బయటపెట్టేందుకు శాఖ పరంగా బొత్స తీవ్ర కసరత్తు చేశారు.దీనికి సంబంధించి ఇప్పటికే కొంత ఆధారాలను సేకరించిన బొత్స వాటిని మీడియా ముందు కూడా పెట్టారు…

గతంలో వైఎస్‌ హయాంలో కావచ్చు.. ఆ తర్వాత రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కారుల్లో క్యాబినెట్‌ సబ్‌ కమిటీలు వేసిన సందర్భాల్లో బొత్సను పక్కన పెట్టి క్యాబినెట్‌ సబ్‌ కమిటీల కూర్పు జరిగిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి… వైఎస్‌ హయాంలో బొత్సకు హై ప్రయార్టీనే ఉండేది… అటువంటిది జగన్‌ సర్కార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవహరంగా భావిస్తున్న ఈ సబ్‌ కమిటీలో బొత్సకు ఎందుకు చోటు కల్పించలేకపోయిందనే చర్చ జరుగుతోంది. అయితే ఆయన్నిఎందుకు పక్కకు తప్పించారనే దానిపై కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులొకొచ్చాయి…

బొత్స ఇండిపెండెంట్ గా కొందరు ఉన్నతాధికారులతో విజయవాడలోని ఓ హోటల్లో సమావేశమయ్యారని…ఈ సమావేశానికి సంభందించిన వివరాలు సీఎం జగన్ కి తెలియడంతోనే బొత్స స్పీడ్ కి చెక్ పెట్టారని తెలుస్తుంది. అటు బొత్స కానీ.. ఇటు వైసీపీ అధినాయకత్వం కానీ.. ఈ వ్యవహరంలో పైకి స్పందించకున్నా.. మొత్తానికి ఏదో గ్యాప్‌ మాత్రం కచ్చితంగా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here