96.. కొన్నేళ్లుగా ఇంత మంచి సినిమా రాలేదంటూ తమిళ మీడియా కోడై కూసింది. ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఓ సినిమాకు అవార్డులు రివార్డులు రావడం అరుదు. కానీ 96 అన్నీ చేసింది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం రెండేళ్ల కింద విడుదలై సంచలన విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో ఈ సినిమాను జాను పేరుతో రీమేక్ చేసారు.

దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. అయితే స్లో నెరేషన్ కారణంగా సినిమా ఎంతవరకు ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా శర్వానంద్ అద్బుతంగా నటించాడని చెబుతున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు. అక్కడే ప్రీమియర్స్ భారీగా పడ్డాయి. ఇక సమంత ఎప్పట్లాగే మరోసారి మాయ చేసింది. ముఖ్యంగా సమంత అక్కినేని అయితే జాను పాత్రకు ప్రాణం పోసిందని తెలుస్తుంది.
శర్వానంద్ తో వచ్చే ప్రతీ సన్నివేశాన్ని కూడా అద్భుతంగా పండించిందని.. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మనసుకు హత్తుకునేలా ఉంటుందని తెలుస్తుంది. సెకండాఫ్ కూడా చాలా వరకు బాగానే ఉన్నా కూడా కాస్త స్లో నెరేషన్ ఉందని ప్రచారం జరుగుతుంది. క్లైమాక్స్ అయితే ఏడుపు వచ్చేలా తెరకెక్కించాడు ప్రేమ్ కుమార్. మొత్తానికి ఎమోషనల్ జర్నీగా సాగే జాను తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలిక.