Home News Stories

కేసీఆర్ సారూ…జ‌ర చూడూ!

ర్యాంకులు వ‌చ్చిన వాళ్లు ఫెయిల్‌ ఇంట‌ర్ బోర్డులో ఏం జ‌రుగుతోంది?

అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని, స‌ర్కారును బ‌ద్నాం చేస్తున్నార‌ని రెవెన్యూశాఖ‌పై మూడోక‌న్ను తెరిచారు కేసీఆర్‌. ఏకంగా డిపార్ట్‌మెంట్‌నే ఎత్తేస్తాన‌నే సంకేతాలిచ్చారు. లోపాలుంటే స‌రిదిద్దాలిగానీ…శాఖ‌నే ర‌ద్దుచేస్తామంటే ఎలాగ‌ని రెవెన్యూ ఉద్యోగులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. మిగిలిన ఏ శాఖ‌లోనూ అవినీతే లేన‌ట్లు….ప్ర‌భుత్వ విభాగాల‌న్నీ పార‌ద‌ర్శ‌కంగా ప‌నిచేస్తున్న‌ట్లు ఒక్క రెవెన్యూశాఖ‌నే ల‌క్ష్యంగా చేసుకోవ‌డ‌మేంట‌న్న చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే…మ‌రోసారి బోనులో నిలుచుంది తెలంగాణ ఇంట‌ర్మీడియెట్ బోర్డు. ల‌క్ష‌ల మంది విద్యార్థుల పేప‌ర్ల వాల్యుయేష‌న్‌లో ఒక‌టీఅరా లోపాలు స‌హ‌జమే. రీ వాల్యుయేష‌న్‌లో ఆ త‌ప్పులు స‌రిదిద్దుకునే అవ‌కాశం ఉంది. కానీ ఈసారి ఇంట‌ర్‌బోర్డు దిద్దుకోలేని త‌ప్పుచేసిందంటున్నారు విద్యావేత్త‌లు.

ఫ‌స్టియ‌ర్‌లో ర్యాంకులొచ్చిన స్టూడెంట్లు సెకండియ‌ర్ ఫెయిల్ అయ్యామ‌ని తెలిసి ఘొల్లుమంటున్నారు. నైంటీప‌ర్సెంట్ పైన ఎంతొస్తుందా అని ఎదురుచూసిన‌వారు పాస్ మార్కులు రాలేద‌ని తెలిసి షాక్ తింటున్నారు. ఒక‌రిద్ద‌రికి కాదు వంద‌ల‌మందికి ఇదే అనుభ‌వం. ఈలోపే సున్నిత‌మ‌న‌స్కులైన విద్యార్థులు తొంద‌ర‌ప‌డి క‌న్న‌వారికి క‌డుపుకోత మిగిలిస్తున్నారు. పోయినేడాది ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో జిల్లా టాప‌ర్‌గా నిలిచిన విద్యార్థి సెకండియ‌ర్ తెల్ల‌మొహం వేయాల్సి వ‌చ్చింది. ఫ‌స్టియ‌ర్ తెలుగులో 98 మార్కులు వ‌చ్చిన మంచిర్యాల విద్యార్థిని సెకండియ‌ర్‌లో జీరో మార్కులు రావ‌డం చూసి చ‌దువు చెప్పిన‌వాళ్ల‌కే నోట‌మాట‌రావ‌డం లేదు. ద‌గ్గ‌ర‌ద‌గ్గ‌ర 25వేల‌మంది విద్యార్థుల‌ది ఇలాంటి అనుభ‌వ‌మే.

పిల్ల‌ల భ‌విష్య‌త్తుపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న త‌ల్లిదండ్రులు ఆక్రోశం ప‌ట్ట‌లేక ఇంట‌ర్‌బోర్డుమీద దండ‌యాత్ర‌కు దిగుతున్నారు. మెడ‌కాయ‌మీద త‌ల‌కాయ ఉన్న‌వాడే పేప‌ర్లు దిద్దాడా అని ఆగ్ర‌హిస్తున్నారు. త‌మ పిల్ల‌లు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో…ప‌రీక్ష‌లు ఎలా రాశారో క‌ళ్లారా చూసిన త‌ల్లిదండ్రులు ఇంట‌ర్‌బోర్డు వైపు వేలెత్తిచూపుతున్నారు. కానీ ఇంట‌ర్‌బోర్డు మాత్రం త‌మ‌వైపునుంచి ఎలాంటి త‌ప్పూ లేదంటోంది. మ‌ళ్లీ విద్యార్థులంద‌రి పేప‌ర్ల‌ను వాల్యుయేష‌న్ చేయాల్సిందేన‌ని డిమాండ్ చేస్తోంది బీజేపీ. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విద్యార్థుల కుటుంబాల‌కు కోటి చొప్పున ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోంది.

ఇంత‌కీ పేప‌ర్ల వాల్యుయేష‌న్‌లో అస‌లేం జ‌రిగింద‌న్న‌దే ప్ర‌శ్న‌.అనుకున్న‌దానికంటే ఐదారు మార్కులు అటూఇటూ రావ‌డం వేరు. టాప‌ర్లు కూడా ఫెయిల్ అయ్యారంటే ఎక్క‌డో త‌ప్పు జ‌రిగింద‌నేది సుస్ప‌ష్టం. ఒక‌వేళ అదే జ‌రిగి ఉంటే మాత్రం అది క్ష‌మార్హం కాని త‌ప్పిదం. ఇంట‌ర్‌బోర్డు చుట్టూ తిరుగుతున్న త‌ల్లిదండ్రుల అనుమానాలు తీర్చాల్సింది… వారికి న్యాయం చేయాల్సింది ప్ర‌భుత్వ‌మే. ఏదో శాఖ‌లో అవినీతి ఉంద‌ని దాన్ని ఎత్తేస్తామ‌నే స‌రికాదు. ప్ర‌తీ వ్య‌వ‌స్థా లోప‌భూయిష్టంగానే ఉంద‌ని గ్ర‌హించాలి. విద్యార్థుల చావుల‌తోనే ఏలిన‌వారు క‌ళ్లు తెర‌వాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here