దిల్లీ: కరోనా వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న హుబి ప్రావిన్సు నుంచి భారతీయులు శనివారం ఉదయం 7:30 గంటలకు దిల్లీకి చేరుకున్నారు. కేంద్రం శుక్రవారం వీరికోసం ప్రత్యేకంగా ఓ ఎయిరిండియా విమానాన్ని వుహాన్‌కు పంపిన విషయం తెలిసిందే. ప్రావిన్సు మొత్తంలో 600 మందికిపైగా భారతీయులు ఉండగా.. వారిలో 400 మంది స్వదేశానికి వస్తామని అభ్యర్థించడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టింది. వీరిలో ప్రస్తుతం 324 మంది భారత్‌కు చేరకున్నారు. మరికొంత మందిని తీసుకురావడానికి ఈరోజు మరో విమానం వెళ్లనుంది. ఇవాళ వచ్చిన విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 56 మంది ఇంజినీర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు ఉన్నట్టు సమాచారం.

మానేసర్‌లో పర్యవేక్షణ కేంద్రం…
చైనా నుంచి తీసుకొచ్చిన భారతీయుల కోసం హరియాణాలోని మానేసర్ సమీపంలో భారత సైన్యం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వారికి స్క్రీనింగ్ 2 దశల్లో జరగనుంది. తొలుత ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని పరీక్షిస్తారు. అనంతరం మానేసర్ కేంద్రానికి తరలించి క్షుణ్నంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరికైనా కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తమైతే.. వారిని వెంటనే ‘బేస్ హాస్పిటల్ దిల్లీ కంటోన్మెంట్(బీహెచ్డీసీ)’కు తరలిస్తారు. జ్వరం, దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారిని బీహెచ్‌డీసీకి పంపుతారు. వైరస్ సోకిన లక్షణాలు లేనివారిని కూడా మానేసర్‌లోనే ఉంచుతారు. వారికి ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 14 రోజుల తర్వాత కూడా వారిలో వైరస్ లక్షణాలేవీ కనిపించకపోతే స్వస్థలాలకు పంపిస్తారు. దిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో భారత్-టిబెట్ సరిహద్దు పోలీసు దళం 600 పడకలతో కూడిన ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేసింది.
259కి చేరిన మృతుల సంఖ్య…
మరోవైపు వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 259కి చేరింది. మరో 11,791 మందికి ఈ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. వీరిలో 1795 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. ఒక్క శుక్రవారమే వైరస్ మహమ్మారి 46 మంది ప్రాణాలు బలితీసుకోవడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది. మరో 2,012 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌కు కేంద్రంగా ఉన్న హుబి ప్రావిన్సు నుంచి తమ పౌరుల్ని సొంత దేశాలకు తీసుకెళ్లేందుకు అన్ని దేశాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. వైరస్ తీవ్రత నేపథ్యంలో ‘అంతర్జాతీయ ఆత్యయిక స్థితి’గా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.