Home Entertainment Reviews

రివ్యూ:హిట్ Hit telugu movie review

నటీనటులు: విశ్వక్ సేన్, రుహానీ శర్మ, భాను చందర్, మురళీ శర్మ తదితరులు
ఎడిటర్: గ్యారీ బిహెచ్
సినిమాటోగ్రఫర్: మణికందన్
నిర్మాతలు: ప్రశాంతి, నాని
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: శేలేష్ కొలను

అ.. లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాతో నిర్మాతగా మారిన నాని.. రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు హిట్ సినిమాతో వచ్చాడు. ఇప్పటికే చాలాసార్లు చూసిన ఇన్వెస్టిగేటివ్ డ్రామాతోనే మరోసారి నిర్మాతగా మారాడు నాని. ఫలక్‌నుమా దాస్ ఫేమ్ విశ్వక్ సేన్ ఇందులో హీరోగా నటించాడు. మరి ఈ కాప్ డ్రామాతో నాని నిర్మాతగా ఎంతవరకు ప్రేక్షకులను అలరించాడో చూద్దాం..

కథ :
విక్రమ్ రుద్రరాజు (విశ్వక్ సేన్) పోలీస్ ఆఫీసర్. క్రైమ్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తుంటాడు. ఎన్నో కేసులు పరిష్కరించిన అనుభవం ఉంటుంది. కానీ ఆయన జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనల వల్ల ఏ చిన్న క్రైమ్ చూసినా కూడా ప్యానిక్ అవుతుంటాడు. దాంతో హెల్త్ కూడి డిస్టర్బ్ అవుతుంది. దాంతో లీవ్ తీసుకుని వెళ్లిపోతాడు. కానీ ఆ సమయంలో తన గాళ్ ఫ్రెండ్ నేహా (రుహానీ శర్మ) మిస్ అయిందని తెలుసుకుని మళ్లీ డ్యూటీలోకి వచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఆ కేసు అప్పుడే ప్రీతి(సాహితి) అనే అమ్మాయి మిస్సింగ్ కేసుతో లింక్ ఉందని తెలుస్తుంది. ఈ రెండు కేసులను విక్రమ్ హ్యాండిల్ చేస్తాడు. అసలు ప్రీతికి ఏమైంది.. ఆ కేసుతో నేహాకు ఏంటి సంబంధం అనేది అసలు కథ..

కథనం:
తెలుగులో క్రైమ్ థ్రిల్లర్స్‌ రావడం ఇదేం తొలిసారి కాదు. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి అయితే ఇలాంటి సినిమాలకు కావాల్సింది స్క్రీన్ ప్లే. ఈ విషయంలో దర్శకుడు శైలేష్ కొలను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అతడు రాసుకున్న కథకు అద్భుతమైన స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. చాలా చిన్న పాయింట్ తీసుకుని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ తరహాలో ఉండే కథనం రాసుకున్నాడు ఈయన. సినిమాలో కూడా అలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ అదిరిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్టులు.. కమర్షియల్ హంగులు లాంటివి లేకుండా సింపుల్ గా మంచి స్క్రీన్ ప్లేతో ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు. ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది విశ్వక్ సేన్ గురించే. మొదట్నుంచి చివరి వరకు కూడా తన భుజాలపై ఈ సినిమాను నడిపించాడు. ఫలక్ నుమా దాస్ కంటే కూడా మెచ్యూరిటీ ఉన్న కారెక్టర్ ఇది. పోలీస్ ఆఫీసర్ పాత్ర అంటే చిన్న విషయం కాదు దానికోసం చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడు విశ్వక్. తొలి అరగంట వరకు అలా అలా సాగిన సినిమా కాస్తా ప్రీతి అనే అమ్మాయి కిడ్నాప్ తర్వాత మరింత ఆసక్తి పెంచేస్తుంది. అక్కడ్నుంచి సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఎవర్ని చూసినా అనుమానమే.. ఎవరైనా చేసుండొచ్చు అనిపించే సన్నివేశాలతో సినిమాను చాలా బాగా నడిపించాడు దర్శకుడు. అంతా అనుకున్నట్లుగానే చివర్లో ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి ముగించాడు. అది కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఎలాంటి కమర్షియల్ హంగులు లేకపోవడంతో రెగ్యులర్ సినిమాలు చూసేవాళ్లకు పెద్దగా రుచించకపోవచ్చు. కానీ క్రైమ్ థ్రిల్లర్స్ చూసేవాళ్లకు మాత్రం ఈ సినిమా పండగే. పంచ్ డైలాగులు.. కామెడీ.. పాటలు అలాంటివేం లేకుండా తను అనుకున్న కథను అనుకున్నట్లుగా తెరకెక్కించడంతో శేలేష్ సక్సెస్ అయ్యాడు. ఓవరాల్‌గా పాయింట్ చిన్నదే అయినా కూడా స్క్రీన్ ప్లేతో హిట్ నడిచింది అంతే. అక్కడక్కడా దిశ కేసును కూడా తన సినిమాలో వాడుకున్నట్లు అనిపించింది. ఓఆర్ఆర్‌లో అమ్మాయి కార్ ఆగిపోవడం.. పదేపదే టోల్ గేట్స్ చూపించడం అవన్నీ దిశను గుర్తు చేస్తాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చివర్లో చెప్పాడు దర్శకుడు. సినిమాలో విశ్వక్ సేన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా సార్లు చూపించినా కూడా చివర్లో సెకండ్ పార్ట్‌లో చూడండి అన్నట్లు వదిలేసాడు దర్శకుడు. ఇక ఇన్వెస్టిగేషన్ విషయంలో ప్రతీ విషయం కూడా చాలా డీటైలింగ్‌గా రాసుకున్నాడు దర్శకుడు శేలేష్.

నటీనటులు:
విశ్వక్ సేన్ ఈ సినిమాకు ప్రాణం. తన పాత్రలో అద్భుతంగా నటించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించడం చిన్న విషయం కాదు కానీ ప్రతీ విషయాన్ని కూడా చాలా బాగా అర్థం చేసుకున్నాడు ఈ కుర్ర నటుడు. సీరియస్ పాత్రలో అదరగొట్టాడు. రుహానీ శర్మది చిన్న పాత్రే. కానీ ఉన్నంత సేపు బాగానే ఉంది. మరో కీలక పాత్రలో మురళీ శర్మ బాగా నటించాడు. ఆయనతో పాటు భానుచందర్, ప్రీతి అనే అమ్మాయిగా సాహితి బాగున్నారు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ప్రధాన బలం. ముఖ్యంగా పాటలు లేని సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ దే ప్రధాన ఆకర్షణ అయి ఉండాలి. ఈ విషయంలో వివేక్ నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు. ఎడిటింగ్ కూడా బాగుంది. అయితే అక్కడక్కడా సేమ్ సీన్స్ రిపీట్ అయినట్లు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ సమయంలో కాస్త ల్యాగ్ అవుతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు శేలేష్ కొలను తను రాసుకున్న కథ కంటే కూడా స్క్రీన్ ప్లే మరింత పకడ్భందీగా రాసుకున్నాడు. తొలి సినిమానే అయినా కూడా అద్భుతంగా వర్కవట్ చేసుకున్నాడు. క్రైమ్ జోనర్ ప్రేక్షకులకు హిట్ పండగే.

చివరగా:
క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు హిట్.. హిట్టే..

రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here