Home Health corona

షాకింగ్: ఒక్క హైదారాబాద్ లోనే 32వేల మరణాలు..ఆర్టీఐ నివేదికలో సంచలన విషయాలు

తెలంగాణ‌లో క‌రోనా కేసులు ఉధృతంగా ఉన్నా ప్రభుత్వ లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కరోనా బులిటెన్ అందుకు భిన్నంగా ఉండేది. దేశంలో మిగ‌తా రాష్ట్రాలతో పోల్చిచూస్తే తెలంగాణ మెరుగ్గా ఉంది. పాజిటివ్ రేట్ చాలా త‌క్కువ‌ మరణాల సంఖ్య తక్కువంటు ఇన్నాళ్లు గొప్పలు చెప్పింది తెలంగాణ సర్కార్. ఇప్పుడు ఆర్టీఐ నివేదికలో మాత్రం సంచలన నిజాలు బయటికొస్తున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు ఇప్పుడు రికార్డుల పూర్వకంగా బయటికొస్తున్నాయి.

రైట్ టూ ఇన్ఫ‌ర్మేష‌న్ యాక్ట్ ద్వారా ఓ స్వచ్చంద సంస్థ సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది. గ‌డిచిన ఏడాది కాలంగా హైద‌రాబాద్ మ‌హ‌న‌గ‌రంలో మున్సిప‌ల్ శాఖ ద్వారా జారీ చేసిన మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల సంఖ్యను చూస్తే న‌మ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఏడాది కాలంలో 32వేల‌మంది చ‌నిపోయారాని..హైదరాబాద్ శవాల దిబ్బగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. ఏప్రిల్ 2020 నుంచి మే 2021 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో 32,752 డెత్ స‌ర్టిఫికెట్లు జారీ చేసిన‌ట్లు ఆర్టీఐ లెక్కలు చెప్తున్నాయి. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి. దాదాపు మూడు నెలల పాటూ రాష్ట్రంలో అప్పుడు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించారు.

మళ్లీ ఈఏడాది కూడా అదే సమయంలో ఏప్రిల్ నుంచి సెకండ్ వేవ్ ప్రారంభమైంది. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మే వరకు ఒక్క హైద‌రాబాద్‌లోనే 32వేల మంది డెత్ సర్టిఫికెట్లు పొందినట్లు నివేదిక చెబుతుంది. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య సంభ‌వించిన మ‌ర‌ణాల సంఖ్య 18,420 ఉండ‌గా..ఈ ఏడాది జనవరి నుంచి మే వ‌ర‌కు సంభ‌వించిన మ‌ర‌ణాల సంఖ్య 14,332. ఈ మరణాలన్నీ కొవిడ్‌ మ‌ర‌ణాలనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని వారు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు చెబున్నారు.

ఆయితే ప్రభుత్వ లెక్కల్లో మాత్రం ఏడాది కాలంగా రాష్ట్రం మొత్తం మీద కరోనాతో చ‌నిపోయిన వారి సంఖ్య కేవ‌లం 3257 మాత్రమే ఉందని వైద్యారోగ్యశాఖ నివేదిక‌లు చెప్తున్నాయి. కానీ ఏడాది కాలంగా స‌ర్కార్ జారీ చేసిన డెత్ స‌ర్టిఫికెట్లు హైదరాబాద్ లోనే 32వేల‌కు పైగా ఉంటే మ‌రి మిగ‌తా మ‌ర‌ణాలు ఎలా సంభ‌వించాయి మొత్తం డెత్ స‌ర్టిఫికెట్ల‌లో కేవ‌లం 10శాతం మాత్రమే కొవిడ్ మ‌ర‌ణాలు ఉంటే మిగ‌తా 30వేల మంది ఎలా చ‌నిపోయారు ఏ వ్యాదితో చ‌నిపోయారు అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ లెక్కలకు ప్రభుత్వం ఏ సమాధానం చెబుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here