Home Entertainment Cinema

పార్టీ పెట్టింది టికెట్లు అమ్ముకోవడానికి కాదురా.. రాజశేఖర్ సంచలన డైలాగ్..

రాజకీయ పార్టీ పెట్టింది టికెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి కాదు.. ఈ మాటలు వినగానే తెలియకుండానే చిరంజీవి పేరు గుర్తుకు వస్తుంది. నిజానికి ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎక్కువగా విమర్శలు కూడా ఆయనపైనే వచ్చాయి. అప్పట్లో పార్టీ పేరు చెప్పుకొని ఆయన టికెట్లు అమ్ముకున్నాడు అంటూ ప్రతిపక్షాలు కూడా బాగానే ప్రచారం చేశాయి. ఆ పార్టీలో ఉన్న అల్లు అరవింద్ చాలా నియోజకవర్గాలకు వెళ్లి టికెట్లు అమ్ముకున్నాడని వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం దారుణంగా ఓడిపోవడం.. 2011లో ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి కొన్ని రోజులు రాజకీయాలు చేసినా కూడా ఇప్పుడు పూర్తి స్థాయి సినిమా హీరోగా మారిపోయాడు.

ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలతో మంచి విజయాలు అందుకొన్నాడు ఈయన. ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్పుకోవాల్సి వస్తోంది అంటే దానికి కారణం రాజశేఖర్.. ఈయన నటించిన అర్జున సినిమా ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. ఇది ఇప్పటి సినిమా కాదు.. ఎప్పుడో రెండు మూడేళ్ల కింద పూర్తి చేసి విడుదలకు నోచుకోని ఒక సినిమా. ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు నిర్మాత నట్టి కుమార్. ఇందులో ఒక డైలాగ్ నేరుగా చిరంజీవిని తాకేలా కనిపిస్తుంది. నేను పార్టీ పెట్టింది టికెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి కాదురా.. ఓడిపోతే మూసుకోడానికి అంతకంటే కాదు.. మీలాంటి వెధవలకు గుణపాఠం చెప్పడానికి అంటూ రాజశేఖర్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది కచ్చితంగా ఆయన చిరంజీవిని ఉద్దేశించి చెప్పాడు అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఎప్పుడో అయిపోయి దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసి ఇలా సెటైర్లు వేయడం మంచి పద్ధతి కాదు అంటూ రాజశేఖర్ కు మెగా అభిమానులు కొందరు సోషల్ మీడియాలో వార్నింగులు కూడా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య రాజశేఖర్ చిరంజీవి మధ్య గొడవలు మళ్లీ మొదలయ్యాయి. మా అసోసియేషన్ డైరీ లాంచ్ ఈవెంట్ లో ఇద్దరి గొడవలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. రాజశేఖర్ పై క్రమశిక్షణా రాహిత్యం చర్యలు తీసుకోవాలంటూ మా అసోసియేషన్ కు చిరంజీవి సూచించాడు. ఆ వెంటనే ఆయన ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాడు. ఇలాంటి సమయంలో తన సినిమాలో చిరంజీవి రాజకీయాలను ఉద్దేశించి ఒక డైలాగు పెట్టడంతో రాజశేఖర్ మళ్లీ వివాదాల్లోకి వచ్చాడు. మార్చ్ 6న అర్జున సినిమా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here