వందేళ్లలో ఎప్పుడూ లేనంత భారీవర్షాలతో హైదరాబాద్ నగరం వరదలో చిక్కుకుంది. రోజులతరబడి కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకుముందు వచ్చిపడ్డ వరదలతో టీఆరెస్ ప్రభుత్వం ఇరుకున పడాల్సి వచ్చింది. ఎన్ని సహాయకచర్యలు చేపట్టినా బాధితుల నిరసనలు, విపక్షాల విమర్శలు తప్పలేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణలోఇప్పుడు బురద రాజకీయం నడుస్తోంది. కేంద్రబృందం కంటితుడుపుగా పరిశీలించి వెళ్లినా…కేంద్రం నుంచి పైసా సాయం అందలేదని నిందిస్తోంది టీఆర్ఎస్. మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటలయుద్ధం నడిచింది.

బీజేపీ రాష్ట్రాలైన గుజరాత్, కర్నాటకలకు ఉదారంగా తక్షణసాయం అందించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకుమాత్రం పైసా ఇవ్వలేదని ఆరోపిస్తోంది టీఆర్ఎస్. ఇప్పటికే జీఎస్టీ సహా పలు అంశాల విషయంలో కేంద్రంతో విభేదిస్తున్న టీఆర్ఎస్ వరదసాయంలో కేంద్రం వైఖరిని నిలదీస్తోంది. అధికారలుతో సమీక్షించిన కేసీఆర్… మోదీ సర్కారు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు.
తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలుండి కూడా.. ఏమీ చేయలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. కిషన్‌రెడ్డిని టార్గెట్ చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఆరోపణలను అదేస్థాయిలో తిప్పికొట్టారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. వరదలు, వర్షాలపై సమగ్ర నివేదిక సమర్పించకుండా సాయం ఆశించడాన్ని తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇవ్వకపోవడం వల్లే… కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా రాష్ట్ర ప్రభుత్వమే వరద బాధితులకు రూ.10 వేల చొప్పున సాయం అందిస్తోంది. జీహెచ్ ఎంసీ ఎన్నికలు ముంగిట్లో ఉండటంతో…వరదసాయం అందరికీ అందజేస్తే అది తమకు అనుకూలిస్తుందనే ఆలోచనతో టీఆరెఎస్ ఉంది. అయితే వరదసాయం పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్. బాధితుల నిరసనలకు అండగా నిలబడుతున్నాయి. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండటంతో…విపక్షాలు ఆరోపణలతో ప్రజల్లోకి వెళ్తుండటం రాజకీయ వేడి పుట్టిస్తోంది. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా వరద నష్టం జరగటంతో…వచ్చే ఎన్నికల్లో ఇదే కీలకాంశం కాబోతోంది.
హైదరాబాద్ సహా తెలంగాణకు 8వేల868 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. తక్షణ సహాయంగా 1350 కోట్లు అందించాలని ప్రధానికి అక్టోబరు 15న లేఖరాశారు సీఎం కేసీఆర్. ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వరదలపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసినా, కేంద్ర బృందం వచ్చిపోయినా ఎలాంటి సాయం అందకపోవటంతో…బీజేపీని టార్గెట్ చేస్తోంది టీఆరెస్.
కేంద్రం పట్టించుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే… ఇప్పటివరకు సమగ్ర నివేదికే ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెబుతుండడంపై పెద్ద చర్చే జరుగుతోంది. తెలంగాణను ఆదుకునేందుకు రాష్ట్ర విపత్తు స్పందన నిధి కింద 225 కోట్లు విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించిందని, రహదారుల మరమ్మతుల కోసం కూడా 220 కోట్లను విడుదల చేయనుందని వెల్లడించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. అయితే నివేదిక రాలేదన్న కారణంతో సాయం ఆలస్యమైంది. వరదలు, వర్షాలపై.. రాజకీయ వేడికి ప్రధాన కారణం జీహెచ్ఎంసీ ఎన్నికలే.
జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ముగియబోతోంది. డిసెంబరులోనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం మొదట భావించినా… వరదలు ముంచెత్తడంతో పునరాలోచనలో పడింది. వెంటనే ఎన్నికలు నిర్వహించే కంటే.. ముందు బాధితులకు పూర్తి సహాయం అందించాకే ఎన్నికలు జరపాలన్న నిర్ణయానికి వచ్చింది అధికార టీఆర్ఎస్. హైదరాబాదులో వరదల బారిన పడ్డ కుటుంబాలకు 10 వేల చొప్పున నగదు సహాయం అందించేందుకు.. 550 కోట్లు కేటాయించింది. నాలుగున్నర లక్షల కుటుంబాలకు సాయం అందగా… ఇంకా అనేక కుటుంబాలు నగదు సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి.
వరదసాయం పంపిణీలో అధికారపార్టీ నేతల ప్రమేయంతో పాటు, అధికారుల అక్రమాలపై విమర్శలు వస్తున్నాయి. బాధితుల ఆందోళనలకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు పలుకుతున్నాయి. జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఈలోగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, ప్రజల్లో మద్దతు పెంచుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాయి విపక్షపార్టీలు