Home News Stories

హస్తం సైకిల్ సవారీ…

తెలంగాణలో కొత్త పొత్తులు పురుడు పోసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బద్ద శత్రువులుగా వ్యవహరించిన టీడీపీ,కాంగ్రెస్ లు కేసీఆర్ పై యుద్దానికి ముకుమ్మడిగా సిద్దం అవుతున్నాయి. గులాబీ బాస్ ఏకంగా 105 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించి ఒక పక్క ఎన్నికల సమర శంఖం పూరించడంతో కాంగ్రెస్ మహాకూటమి దిశగా అడుగులు వేస్తుంది. టీడీపీ,సీపీఐ,టీజేఎస్ తో కాంగ్రెస్ కూటమి ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పై యుద్దానికి సిద్దమవుతుంది.

కాంగ్రెస్,టీడీపీల ఉమ్మడి లక్ష్యం కేసీఆర్ ని గద్దెదింపడం, ఇరు పార్టీల పరస్పర అవసరాలు. హస్తం పార్టీకి వచ్చే ఎన్నికల్లో అధికారం ముఖ్యం, అలాగే ఒకప్పుడు పటిష్టమైన క్యాడర్ నాయకత్వం ఉండి వలసలతో బక్కచిక్కిన టీడీపీకి ఉన్న కాస్త మందిని అయినా పార్టీ విడిచివెళ్ల కుండా పార్టీని నిలబెట్టడం అవసరం ఇది ఒక రకంగా జీవన్మరణ సమస్యే. ఈ పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీతో అంటకాగకపోతే కష్టం. మొదట అధికార టీఆర్ఎస్ తో పొత్తుకు అర్రులు చాచిన టీడీపీ గులాబీ,కమలం రహస్య స్నేహంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని కాంగ్రెస్ మాత్రం దిక్కనుకుంది.

ఇందుకోసం ఇరు పార్టీలు సీట్ల విషయంలో కొన్ని త్యాగాలకు సిద్దం కావాల్సి ఉంటుంది. ఒకప్పుడు పటిష్టమైన క్యాడర్ నాయకత్వం ఉండి వలసలతో బక్కచిక్కిన టీడీపీకి ఇప్పుడు ఏ స్థానాల్లో పట్టుంది. ఎక్కడెక్కడ తన ప్రభావం చూపగలుగుతుందంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా,రంగారెడ్డి,మహబూబ్ నగర్ జిల్ల్లల్లోని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పట్టున్న టీడీపీ రెండు పార్లమెంట్ స్థానాలు 25 అసెంబ్లీ స్థానాలు అడిగే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం మరో మూడు పార్టీలకు సీట్ల పంపకం చేయాల్సి ఉన్నందున 15 సీట్ల వరకూ ఇచ్చే అవకాశం ఉంది. అన్ని పార్టీలకు పొత్తుల్లో సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉన్నందున కాంగ్రెస్ కూడా అంతకు మించి సాహసం చేయకపోవచ్చు. కాంగ్రెస్ లో కూడా భారీగా ఆశవహులు ఉండటంతో అన్ని పార్టీలకు కలిపి సీట్ల పంపకానికి 30 సీట్లుగా టార్గెట్ ఫిక్స్ చేసుకుంది.

కాని హస్తం, సైకిల్ కలయికలో అనేక అవాంతరాలున్నాయి. మొదటి సమస్య సీట్ల బదలాయింపు ఎలా. ఒక్కో నియోజకవర్గంలో ఇరు పార్టీల నుంచి సీనియర్ నేతలు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. నర్సంపేట నుంచి కాంగ్రెస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి ఉండగా టీడీపీ నుంచి రేవురి ప్రకాశ్ రెడ్డి ఆ స్థానం కోసం పట్టుబట్టే అవాకాశం ఉంది. అలాగే వనపర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి బరిలో ఉండగా టీడీపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి కోసం అడిగే చాన్స్ ఉంది. ఇదే పరిస్థితి జగిత్యాల,మహేశ్వరం,సత్తుపల్లి,జడ్చర్ల,నిజామాబాద్ రూరల్ ,కోదాడ,కొత్తగుడెం,సనత్ నగర్ ,కుత్బుల్లాపూర్ లలో ఉంది. ఒక వేళ ఇరు పార్టీల మద్య పొత్తు ఉంటే వీరిని ఎలా సమన్వయం చేస్తారు అన్నది సస్పెన్స్ గా ఉంది.

కాంగ్రెస్,టీడీపీ కలిసి బరిలోకి దిగుతాయి అంతవరకు ఓకే, ఒక వేళ దిగినంతమాత్రాన ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సవ్యంగా జరుగుతుందా అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్న. హస్తం సైకిల్ సవారీ అనుకున్నంతా ఈజీ ఏం కాదు మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here