Home News Politics

పల్నాటి సీమ గురజాలలో సంకుల సమరం….!

గుంటూరు జిల్లా పల్నాడులో కీలక నియోజ‌క‌వ‌ర్గం గుర‌జాల. పల్నాటి బ్రహ్మనాయుడు పరిపాలించిన గురజాల నియోజకవర్గంలో ఏ ఎన్నికైనా ఆసక్తికరంగానే వుంటుంది. ఇక్కడ గెలుపు, ఓటములు అంత తేలిక కాదు. గత 5 ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్ధిగా యరపతినేని శ్రీనివాసరావు పోటి చేస్తున్నారు. ఈ సారి ఎన్నికలలో కూడా ఆయనే బరిలో దిగనున్నారు. గతంలో బలంగా వున్న కాంగ్రెస్‌ పార్టీకి, ఇప్పటి వైసిపి పార్టీకి ఇక్కడ సరైన అభ్యర్ధే దొరకలేదని చెప్పవచ్చు. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ కూడా ధీటైన ప్రత్యర్ధి కాసు మహేశ్ రెడ్డిని నిలబెట్టడంతో గురజాల రాజకీయం రసకందాయంలో పడింది.

గురజాల నియోజకవర్గంలో కాపులు, బిసీలు, ముస్లిం, మైనార్టీలు గెలుపు, ఓటములను నిర్ణయించే స్థితిలో వున్నారు. కాపులు, ముస్లిం, మైనార్టీలు ఎటు మొగ్గితే అటు విజయం సిద్ధించే అవకాశముంది. ఇప్పటి వరకు కాపులలో 60శాతం మంది టీడీపీకి అనుకూలంగా వుండటం జరిగింది. జనసేన రాకతో ఈ లెక్క తప్పే అవకాశముంది. ముస్లిం, మైనార్టీలు 60శాతం గతంలో కాంగ్రెస్‌కు, ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా వుండేవారు. ఈ నియోజకవర్గంలో బిసీలలో అధిక ఓటు బ్యాంక్‌ కలిగిన వడ్డెరలు టీడీపీతోనే వున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా రెడ్డి వర్గానికి అవకాశం ఇవ్వడంతో బీసీ నేత మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్యే చాన్స్ ఇవ్వడంతో వైసీపీకి అనుకూలంగా ఉన్న యాదవుల ఓటు బ్యాంక్ ఎటు మొగ్గుతుందన్న ఆసక్తీ ఇక్కడ ఉంది.

ఈసారి ఇక్క‌డి నుంచి వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్ పోటీకి సిద్ధ‌మ‌వుతున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించిన య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు .2019 ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించేందుకు వ్యూహాత్మ‌కంగా సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న మూడుసార్లు విజ‌యం సాధించారు. 1994, 2009, 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న మూడు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. 2019లోనూ విజ‌యం సాధించి ఇక త‌న‌కు తిరుగులేద‌నిపించుకోవాల‌ని చూస్తున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు మంచి ప‌ట్టు ఉంది.గ‌త నాలుగున్న‌రేళ్లుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగిన ప‌లు అభివృద్ధి ప‌నులు ఆయ‌న‌కు మంచి పేరును తెచ్చి పెట్టాయి.

ప్ర‌భుత్వ అధివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప‌క్క‌న పెడితే గ‌త యేడాదిన్న‌ర కాలంగా వ్య‌క్తిగ‌తంగా అనేక కార్య‌క్ర‌మాలు ఆయ‌న అమ‌లు చేస్తున్నారు. వ్య‌క్తిగ‌తంగా కూడా కోట్లాది రూపాయాల‌ను ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో చేస్తోన్న సేవా కార్య‌క్ర‌మాలు కంటిన్యూగా జ‌రుగుతూనే ఉన్నాయి. మ‌హిళ‌ల ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు ఆయ‌న అనేక సెంటిమెంట్ కార్య‌క్ర‌మాలు చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో మ‌హిళ‌లు అంద‌రికి చీర‌ల పంపిణీ, ష‌ష్టిపూర్తి కార్య‌క్ర‌మాలు, పెన్ష‌న్ దారుల‌కు ప‌సుపు – కుంకుమ కార్య‌క్ర‌మంలో మ‌రోసారి చీర‌ల పంపిణీ, యువ‌త కోసం కార్య‌క్ర‌మాలు ఇలా చెప్పుకుంటే చాలా కార్య‌క్ర‌మాల‌తో ఆయ‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ పెంచుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఆయన దందాలపై, ఇసుక, గనుల తవ్వకాలపై అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అదే ఆయనకు డ్యామేజ్ చేస్తుందంటున్నారు.

ఇక వైసీపీ విష‌యానికి వ‌స్తే మాజీ మంత్రి కాసు వెంక‌ట‌కృష్ణారెడ్డి త‌న‌యుడు కాసు మ‌హేష్‌రెడ్డి ఇక్క‌డి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. న‌ర‌సారావుపేట‌కు చెందిన ఆయ‌న‌కు గుర‌జాల‌లో పోటీ చేసేందుకు పూర్తి ఆస‌క్తి ఉందా ? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. మ‌హేష్‌రెడ్డి మ‌న‌సు ఎలా ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి మూడు ద‌శాబ్దాల త‌ర్వాత సీటు రావ‌డంతో వారంతా ఏక‌తాటిమీద‌కు వ‌చ్చి య‌ర‌ప‌తినేని ఓడించాల‌ని చూస్తున్నారు. మహేష్ తరుచూ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తుండడంతో వైసీపీ బాగానే పుంజుకుంది. యరపతినేని అక్రమాలపై కాసు మహేష్ గళమెత్తుతున్న తీరు కూడా నియోజకవర్గంలోని విద్యావంతులు, ఉద్యోగుల్లో సానుకూలతను తెస్తోంది. కాసు మహేష్ ను ఇన్‌చార్జ్‌గా నియమిస్తే జంగా కృష్ణమూర్తి వైసీపీ నుంచి బయటకు వస్తారని యరపతినేని ఆలోచన చేశారు. కానీ అలా జరక్కపోగా మహేష్, జంగా కృష్ణమూర్తి కలిసి పనిచేస్తుండడం యరపతినేనికి మరింత ఇబ్బందిగా మారింది.

ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ ఎవ‌రు పోటీ చేస్తార‌న్న‌ది క్లారిటీ లేదు. అయితే ఎన్ఆర్ ఐ చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు మాత్రం జ‌నంలో తిరుగుతున్నారు. ముఖ్యంగా ప‌ల్లెల్లో ఎక్కువ‌గా ప్ర‌చారం నిర్వ‌హించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కాంగ్రెస్ కూడా పోటీకి సిద్ధ‌మ‌వుతున్న ప్ర‌భావం మాత్రం పెద్ద‌గా ఉండ‌ద‌నే చెప్పాలి. ప్ర‌ధానంగా ఇక్క‌డి వైసీపీ, టీడీపీ మ‌ధ్యే పోటీ ఉంటుంది. అయితే టీడీపీకి విస్తృత‌మైన కార్య‌క‌ర్త‌ల బ‌లం..ప‌టిష్ట నాయ‌క‌త్వం, నాలుగున్న‌రేళ్ల‌లో జ‌రిగిన అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు ప్ల‌స్ కానున్నాయి. ఇక వైసీపీ నుంచి కాసు మ‌హేశ్‌రెడ్డి కూడా బలమైన నేత కావడంతో ఇక్కడ ఎవరిది విజయం అన్నది స్పష్టంగా చెప్పలేం. వరుస విజయాలే యరపతినేని విజయానికి అడ్డంకిగా మారనున్నాయా? కాసు మహేష్ కు ప్రజలు పట్టం కడతారా? అన్నది చూడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here