Home News Politics

గుంటూరు పశ్చిమ టీడీపీలో నెక్స్ట్ ఎవరు…?

సిట్టింగులు వలస పోతున్న సెగ్మెంట్లో అధికారపక్షానికి సరికొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి … ఆయా నియోజకవర్గాల్లో అంతోఇంతో ఆర్థిక స్థోమత ఉన్న ప్రతి లీడర్ ఈ సారి టికెట్‌ తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు .. నిన్న మొన్నటి వరకు నియోజకవర్గంలో కనపడని నేతలు సైతం సామాజికవర్గ లెక్కలతో హడావుడి మొదలుపెడుతున్నారు .. ముఖ్యంగా గుంటూరు వెస్ట్‌ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సైడయిపోవటంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎవరి స్దాయిలో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు.. దీంతో గుంటూరు పశ్చిమ రాజకీయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ టికెట్‌ ఆశావహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది … తమ కెపాసిటీ ఏంటో తమకు ఆ స్థాయి ఉందో లేదో కూడా పట్టించుకోకుండా .. చేతిలో నాలుగు కాసులు ఉన్న ప్రతిఒక్కరు ఎమ్మెల్యే టికెట్‌ కోసం పోటీపడుతుండటం పార్టీకి తలనొప్పిగా మారింది … గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల ప్రస్తుతం పార్టీ మారడం ఖాయమవ్వడంతో టికెట్‌ ఆశావహుల లిస్ట్‌ చాంతాడంత తయారైంది .. ప్రధానంగా రెండు సామాజికవర్గాల నుంచి ఏకంగా ఆరుగురు అభ్యర్థులు టికెట్ మాదంటే మాది అంటూ హడావుడి చేస్తున్నారు . ..
పశ్చిమ టీడీపీ టికెట్‌ కోసం కమ్మ నేతలు మన్నవ మోహన్ కృష్ణ, మన్నవ సుబ్బారావు, కోవెలమూడి రవీంద్ర, రాయపాటి రంగ బాబు .. కాపు నేతలు శనక్కాయల శివశంకర్, చందు సాంబశివరావు పోటీ పడుతున్నారు .. పార్టీలో సీనియర్ నాయకుడి గా ఉన్న కోవెలమూడి రవీంద్ర తప్ప వాస్తవానికి మిగతా నేతలు ఎవరూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్న దాఖలాలు లేవు … రవీంద్ర లోకల్‌గా ఉంటున్నా ప్రజలతో అంటీముట్టనట్టు ఉంటారన్న ప్రచారం ఉంది…

టికెట్‌ ఆశిస్తున్న వారిలో మరి కొద్ది మంది నిన్న మొన్నటి వరకు పార్టీ ఇచ్చిన పదవులు అనుభవించి .. నియోజకవర్గంలో కర్ర పెత్తనం చేసి అటు కార్యకర్తలు, ఇటు ప్రజల్లో చులకైన వారే.. అసలు గుంటూరులో ఎన్ని కాలనీలు ఉన్నాయి … ఏ పేట ఎక్కడ ఉందో తెలియని వారు సైతం ఒక్కసారిగా టికెట్‌ రేసులోకి వచ్చారిప్పుడు.. తమకు బాలకృష్ణ అండ ఉందని ఒకరు .. చంద్రబాబు భరోసా ఇచ్చారని మరొకరు … టికెట్‌ వచ్చేసినట్లు హడావుడి చేస్తుండటం కేడర్‌లో గందరగోళం నింపుతోంది.వాస్తవానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గతం లో టీడీపీకి అండగానే ఉన్నా.. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు… దానికి కారణం టీడీపీ పెద్దల నిర్ణయ లోపాలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది… రెడ్డి, కాపు, బిసి నేతలు కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలయ్యారు … సెగ్మెంట్లో కమ్మ వర్గం లో మెజారిటీ ఓట్లు టీడీపీకి అనుకూలంగా ఉంటాయి… ఆ సాలిడ్‌ ఓటుబ్యాంకుకి తోడు బిసి, కాపు లేదా ఆర్య వైశ్య కమ్యూనిటీ చెందిన వ్యక్తికి అభ్యర్థిగా నిలిపితే ఆయా ఓట్లు కలిసివచ్చి విజయావకాశాలు ఉంటాయన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.

జనసేన సింగిల్ గా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉండటంతో ఆ పార్టీ కాపు అభ్యర్థిని రంగంలోకి దించితే సమీకరణలు ఎలా ఉంటాయన్న లెక్కలు వేసుకుంటుందంట టిడిపి అధిష్టానం .. ఆ క్రమంలో గుంటూరు ఈస్ట్‌, వెస్ట్‌ రెండు సెగ్మెంట్లలో అధిక ఓటింగ్ ఉన్న ఆర్యవైశ్య వర్గం నుంచి వెస్ట్‌లో అభ్యర్థిని నిలబెడితే అది రెండు నియోజకవర్గాల్లో ప్రభావం చూపిస్తుందన్న ఆలోచనలో ఉందంట. గుంటూరు ఈస్ట్ లో ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మద్దాల గిరి కి అక్కడ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు … గుంటూరు తూర్పు నుండి ముస్లిం అభ్యర్థిని రంగంలో దింపే ఆలోచనలో ఉంది టిడిపి … ఈ నేపథ్యంలో మద్దాల గిరి ని పక్కన పెడితే ఆర్యవైశ్య సామాజిక వర్గంలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.. అదే విషయాన్ని పార్టీ సీనియర్ నేతలతో పాటు ఎంపీ గల్లా జయదేవ్ చెప్పడంతో ఇప్పుడు మద్దాలి గిరి ని గుంటూరు పశ్చిమలో అభ్యర్థిగా పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉందంట సైకిల్ పార్టీ..

మద్దాల గిరికి టికెట్ ఇస్తే ఆర్యవైశ్య సామాజిక వర్గం నుండి జిల్లాలో టీడీపీకి ప్రాతినిధ్యం ఉంటుంది … ఒకవేళ గుంటూరు నుండి మద్దాల గిరి తప్పిస్తే ఆ ప్రభావం పార్టీపై గట్టిగానే పడుతుందని .. గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో లక్షా పాతిక వేల వరకు ఉన్న ఆర్యవైశ్య ఓటుబ్యాంకుపై ఆ ఎఫెక్ట్‌ పడుతుందని టిడిపి నేతలు భావిస్తున్నారు .. ఆర్యవైశ్యుల కమ్యూనిటీని దూరం చేసుకుంటే ఆ ప్రభావం బ్రాహ్మణ, జైన్ కమ్యూనిటీ పడుతుందని టీడీపీ నేతల ఆందోళన చెందుతున్నారు . ఒక్క గుంటూరులోనే ఆర్వవైశ్యుల ఓట్లు 50 వేల వరకు ఉన్నాయి.. తెనాలి, పొన్నూరు మంగళగిరి, ప్రతిపాడు , తాడికొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా గణనీయంగానే ఆ ఓటర్లు ఉన్నారు.. ఇలా గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో పెద్ద సంఖ్యలో ఉన్న ఆర్యవైశ్య వర్గానికి సీటు కేటాయిస్తే ఆ ప్రభావం లోక్‌సభ సెగ్మెంట్లో కూడా ప్లస్‌ అవుతుందని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుత ఎమ్మెల్యే మోదుగుల పార్టీ మారడం ఖాయమవ్వడంతో .. సాధ్యమైనంత త్వరగా ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత టిడిపి పై ఉంది ….అనేక సందర్భాల్లో చివరి నిమిషం వరకు టికెట్ ఇవ్వకపోవడం.. ఇన్‌చార్జ్‌లను నియమించకపోవడం వంటి పొరపాట్లు చేసి టీడీపీ ఇప్పుడు ఆ తప్పు మరోసారి చేయకూడదని కార్యకర్తలు కోరుతున్నారు .. చూడాలి మరి టీడీపీ అధినేత లెక్కలు ఎలా ఉన్నాయో ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here