Home News Politics

గులాబీ పార్టీకి మరో ‘ముఖ్య’ నేత షాకిస్తారా…? ఆ నేత సోషల్ మీడియాలో ఎందుకు టార్గెట్ అయ్యారు…

ఉమ్మడి ఓరుగల్లు రాజకీయాల్లో ఏం జరుగుతుంది. మొన్న కొండా దంపతులు ఇచ్చిన షాక్ తో కోలుకోని గులాబీ పార్టీకి మరో ‘ముఖ్య’ నేత కూడా షాక్ ఇవ్వనున్నారా…అడిగిన టిక్కెట్లు ఇస్తే కండువా మార్చేందుకు ఆ నేత సై అంటున్నారంటూ జిల్లాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంత‌కీ ఎవ‌రా నాయ‌కుడు అనుకుంటున్నారా…?

సైకిల్ పార్టీ నుంచి కారు పార్టీ వరకు కిలక పోర్టుపోలియోలు దక్కించుకుని జిల్లా రాజకీయాల్లో తన దైన ముద్ర వేసిన నేత ప్రస్థుత డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి. జిల్లాలో టిక్కెట్ల కేటాయింపు పై అసంతృప్తిగా ఉన్న కడియం హస్తం పార్టీతో టచ్ లోకి వెళ్ళినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో కారు టైర్ల‌కు ఊహించని రీతిలో పంచ‌ర్లు అవుతుండగా మరో కీలక నేత జంప్ అవుతారన్న ప్రచారం జిల్లా గుళాబీ నేతలను గందరగోళంలో పడేస్తుంది.

గులాబీ బాస్ జంబో లిస్ట్ ప్ర‌క‌టించిన త‌ర్వాత క‌డియం అసంతృప్తిగా ఉన్నారు. ఆయ‌న స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నుంచి టిక్కెట్ ఆశించారు. ఆయ‌న‌కు కాక‌పోయినా.. క‌నీసం ఆయ‌న కూతురు కడియం కావ్యకు అయినా టిక్కెట్ ఇప్పించాల‌నుకున్నారు. కానీ అదికాస్తా డాక్టర్ టి.రాజ‌య్య‌కు ఇచ్చారు. ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త ఉంది. క‌డియం అనుచ‌రులు, అభిమానులు అభ్య‌ర్థిని మార్చాలంటున్నారు. ఆయ‌న వ‌ర్గానికి చెందిన జెడ్పీటీసీలు ఏకంగా అస‌మ్మ‌తిలా మారి రాజ‌య్య‌ను ఓడిస్తామంటున్నారు. అయితే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌, కూతురి పొలిటిక‌ల్ ఎంట్రీపై ఆశ‌లు పెట్టుకున్న క‌డియం శ్రీహ‌రి… కాంగ్రెస్ నాయ‌కుల‌కు ట‌చ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ త‌న కూతురికి ఇచ్చి.. త‌న‌కు వ‌రంగ‌ల్ ఎంపీ టికెట్ ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధ‌మేన‌న్నార‌ట‌. దీనిపై ఇంకా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఇపుడిదే విష‌యంపై ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌లో హాట్ హాట్ డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయి.

పార్టీ ఎందుకు మారుతారు..? కేసీఆర్ ఆయ‌న్ను డిప్యూటీ సీఎం చేశారు. ఎంతో ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు.. ఇది గాలి వార్త అని కొట్టి పారేయ‌కండి..! ఇందులో కూడా లాజిక్ ఉందంటున్నారు. క‌డియం ఎప్పుడు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉండాల‌నుకుంటున్నారు. ఇపుడు మ‌ళ్లీ ఇస్తే ఎమ్మెల్సీ లేకుంటే వ‌రంగ‌ల్ ఎంపీ స్థానం. అయితే మ‌ళ్లీ టీఆరెస్ గెలిచినా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం లేద‌ట‌. ఎందుకంటే కేసీఆర్ సీఎం ప‌గ్గాల‌ను కేటీఆర్ కు అప్ప‌గించే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. పైగా కేటీఆర్‌కు క‌డియం పెద్ద‌గా స‌త్సంబంధాలు లేవ‌ట‌. క‌డియం హ‌రీష్‌రావు బ్యాచ్ అన్న ముద్ర ప‌డిపోయింది అంటున్నారు. అందుకే త‌న కూతురికి టిక్కెట్ కోసం ఎంత‌గా ప్ర‌య‌త్నాలు చేసినా.. కేటీఆర్ ఇవ్వ‌నివ్వ‌లేద‌న్న అసంతృప్తి క‌డియంలో ఉంది.

ఈ స‌మ‌యంలో ఏ మాత్రం త‌ప్ప‌ట‌డుగు వేసినా… పొలిటిక‌ల్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డుతుంది. అందుకే మార్పు నిర్ణ‌యం తీసుకునే యోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. క‌డియం మాత్ర‌మే కాదు… టీఆరెస్ టిక్కెట్ ఆశించి భంగ‌ప‌డ్డ డోర్నకల్ స‌త్య‌వ‌తి రాథోడ్ సైతం కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే క‌డియం పార్టీ మార్పుపై ఇప్ప‌టికిప్పుడు నోరు విప్ప‌కున్నా… ఎన్నికల నోటిఫికేష‌న్ రాగానే రాజ‌కీయం మారుతుంద‌ని చెబుతున్నారు.

తనకు పార్టీలు మారాల్సిన అవసరం లేదని, నైతిక విలువలు, నీతి నిజాయితీలే పెట్టుబడిగా రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. పార్టీ అధినేత కేసీఆర్‌ మాటే తనకు శిరోధార్యం అని 1994లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి.. 2015లో ఉపముఖ్యమంత్రి అయ్యేవరకు రాజకీయాల్లో నేను విలువలకు కట్టుబడి ఉన్నానన్నారు. నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేయలేదన్నారు. సోషల్‌ మీడియాలో తన పై కావాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here