గ్రేటర్ లో అసెంబ్లీ ఎన్నికలు కమలం అగ్రనాయకులకు సవాల్‌గా మారాయి. గత ఎన్నికల్లో విజయం సాధించిన స్థానాలను కాపాడుకోవడం అగ్నిపరీక్షగా తయారైంది. ఒక పక్క అభ్యర్దులను స్పీడ్ గా ప్రకటించిన కమలాం పార్టీ ఈసారి ఒంటరిగా ఎన్నికల బరిలో దిగనుంది. దీంతో ఎవరికి వారు తమ నియోజకవర్గంలోనే దృష్టి కేంద్రీకరించి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో, గ్రేటర్లో తమ అధిపత్యం చెలాయించాలంటే తాము తిరిగి గెలిచి సత్తా చాటాలని ఉవ్వీళ్లూరుతున్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి చింతల రామచంద్రారెడ్ది మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఆయన గ్రేటర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా టీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్, మహాకూటమితో చింతల రాంచంద్రారెడ్డికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి.
గత ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు మరో సారి బరిలోకి దిగుతున్నారు. ఆయన ప్రస్తుతం నగర అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ గులాబీ పార్టీ నుంచి మైనంపల్లి హనుమంతరావు బరిలో దిగే అవకాశం ఉంది. ఇక మహాకూటమి తరుపున టీజేఎస్ లీడర్ కపిలవాయి పొటీలో ఉండనున్నారు. ఇక్కడ త్రి ముఖ పోటీ జరిగే అవకాశం ఉంది.
ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మరోసారి తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తరచూ పాదయాత్రలు, పర్యటనలు చేసి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. బీజేపీలో చేరిన పరిపూర్ణనంద స్వామితో ఆయన సన్నిహితంగా ఉంటున్నారు. ఎన్వీఎస్ఎస్కు మద్దతుగా నియోజకవర్గంలో స్వామి ప్రచారం చేస్తారని నాయకులు భావిస్తున్నారు. ఇక ఇక్కడ కారు పార్టీ అభ్యర్థి గా బేతి సుభాష్ రెడ్డి బరిలో దిగగా మహా కూటమి నుంచి టీడీపీ అభ్యర్ధిగా దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ పోటీ చేయనున్నారు. ఇక్కడ ముగ్గురి మధ్య త్రిముఖ పోటీ జరుగనుంది.
గోషామహల్ నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ అనేక సార్లు పార్టీకి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేశారు. కొన్నిసార్లు అగ్ర నాయకులను సైతం బాహాటంగానే విమర్శించారు. ఆయనకు ఈ సారి టికెట్ వస్తుందా.. అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. చివరకు టికెట్ సాధించి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఒంటరి పోరాటంతో గెలిచి తన ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ బరిలోకి దిగనున్నారు. టీఆర్ఎస్ నుంచి నందకిశోర్ బిలాల్ పోటీలో దిగనుండగా ఇక్కడ పోటీ ముఖేశ్ ,రాజా సింగ్ మధ్యే ఉండనుంది.
కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ గ్రేటర్లో పార్టీకి పెద్ద దిక్కు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువ సీట్లు గెలిపించి ఇమేజ్ కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి తన బంధువుకు టికెట్ ఇప్పించేందుకు చొరవ చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువ సీట్లు సాధిస్తే వచ్చే ఎన్నికల్లో తన గెలుపు సునాయాసం అవుతుందని ఆయన భావిస్తున్నారు. కాని సనత్ నగర్,సికింద్రాబాద్ లో కమలదళానికి చాన్స్ లేనట్లే కనిపిస్తుంది.
ముషీరాబాద్‌లో హోంమంత్రి నాయిని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. గతంలో సునాయాసంగా గెలిచిన లక్ష్మణ్‌కు ఈసారి ప్రత్యర్థులు బలమైన పోటీ ఇవ్వనున్నారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో పట్టు కొనసాగించడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. కాని నియోజకవర్గంలో మాత్రం ఢీ అంటే ఢీలాగే ఉండనుంది. ఇక్కడ కారు పార్టీ నుంచి ముఠా గోపాల్ అభర్ధిగా ఉండనుండగా మహాకూటమి నుంచి టీడీపీకి సీటు దక్కే అవకాశం ఉంది. టీడీపీ నుంచి ఎమ్మెన్ శ్రీనివాస్ రేసులో ఉండనున్నారు.ఇక్కడ జరిగే త్రిముఖ పోటీలో లక్ష్మణ్ చెమటోడ్చాల్సిందే.
అంబర్‌పేట నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తున్న కిషన్‌రెడ్డికి ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. గతంలో సునాయాసంగా గెలిచిన ఆయన ఇప్పుడు గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఒక వైపు మహాకూటమి, మరో వైపు టీఆర్ఎస్ అభ్యర్థులతో ఆయనకు పోటీ ఉండే అవకాశముంది. అయినా సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లను సాధించి అటు పార్టీలో ఇటు నియోజకవర్గంలో ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం విస్తృతంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు.