ముందుంది ముసళ్ల పండగంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. దుబ్బాక ఫలితంతో తొలిసారి టీఆరెస్ ఆత్మరక్షణలో పడింది. గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగరేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న సమయంలో…దుబ్బాక ఓటమి ఆ పార్టీకి గుదిబండగా మారింది. తెలంగాణకు గుండెకాయ హైదరాబాదే. రాష్ట్ర రాజధాని నగరంలో రాజకీయంగా పట్టుంటేదాని ఇంపాక్ట్ రాష్ట్రమంతా ఉంటుంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అధికారపార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. ఒకప్పుడు హైదరాబాద్.లో టీఆరెస్కి పెద్దగా పట్టులేదు. కానీ రాష్ట్రం సాధించాక, టీఆరెస్ అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. భాగ్యనగరంపై గులాబీపార్టీ పట్టు బిగించింది. గ్రేటర్.లో జెండా పాతింది. ఈసారి కూడా ఆడుతూ పాడుతూ గెలిచేయొచ్చన్న నమ్మకాన్ని దుబ్బాక ఓటమి దెబ్బకొట్టింది. దీంతో ఒక్కసారి అలర్ట్ అయిపోయింది టీఆరెస్.

దుబ్బాకలో బీజేపీ గెలవగానే ఇక గోల్కొండలో కాషాయ జెండా ఎగరేస్తామని ప్రకటించారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన చెప్పింది గ్రేటర్ ఎన్నికల గురించే. దుబ్బాకలోనే గెలిచిన బీజేపీ… అదే వ్యూహాన్ని అర్బన్ ఓటర్లుండే జీహెచ్.ఎంసీలో అమలుచేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్న ఆలోచన అధికారపార్టీని కలవర పెడుతోంది. సీఎం సొంత జిల్లాలో సిట్టింగ్ సీటునే దక్కించుకున్న ఊపులో… గట్టిగా ప్రయత్నిస్తే గ్రేటర్.లో రిజల్ట్ రిపీట్ చేయొచ్చనే ఆలోచనతో బీజేపీ ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వేడెక్కించడం ఖాయం.
జీహెచ్ఎంసీలో పోయిన ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకుంది టీఆరెస్. ఈసారి అలవోకగా వంద దాటేస్తామని మొన్నటిదాకా నమ్మకంతో ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. మూడొంతుల అధికారపార్టీ కార్పొరేటర్లపై వ్యతిరేకత కనిపిస్తోంది. దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడయ్యే అవకాశం లేకపోలేదు. అయితే దుబ్బాక వేరు, గ్రేటర్ వేరని టీఆరెస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా…అర్బన్ ఓటర్లుండే గ్రేటర్.లో ఏదన్నా జరగొచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం సపోర్ట్ టీఆరెస్కున్న అడ్వాంటేజ్. ముస్లిం ఓటర్లున్న పాతబస్తీతో పాటు మరికొన్ని చోట్ల పతంగి పార్టీ నెగ్గుకొస్తోంది. మిగిలినచోట్ల మైనారిటీల ఓట్లు టీఆరెస్కి అనుకూలించేలా ప్రభావం చూపుతోంది. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉంటుందా అన్నదే ప్రశ్న. ఎంఐఎంని ఇప్పటికే బీజేపీ తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తోంది. ఓటర్ల తొలగింపుల్లో లోపాలు సరిచేయకపోతే తడాఖా చూపిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తోంది. మైనారిటీల ప్రభావం లేని ప్రాంతాలపై దృష్టిసారిస్తే సులువుగా టార్గెట్ రీచ్ కావచ్చనే వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోంది. లక్ష్యం చేరొచ్చన్నది కమలనాథుల ఆలోచన. పైగా ఈమధ్యే వరదలు నగరంపై తీవ్ర ప్రభావం చూపించాయి. చాలా బస్తీలు వారాల తరబడి జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి.
ప్రభుత్వసాయంలో స్థానిక నేతల జోక్యంతో బాధితుల్లో అసహనం పెరిగిపోతోంది. కొన్నిచోట్ల సాయం అందలేదంటూ జనం రోడ్లెక్కుతున్నారు. ఇవన్నీ గ్రేటర్ ఎన్నికల్లో తమకు ప్లస్ అవుతాయని అంచనావేస్తోంది బీజేపీ. దుబ్బాకలో మల్లన్న సాగర్ ముంపు బాధితుల తరఫున పోరాడింది బీజేపీ. ఉప ఎన్నికల్లో అది కాస్త కలిసొచ్చింది. హైదరాబాద్‌లోనూ వరద సాయం అందనివారి తరఫున పోరాటాన్ని ఉధృతం చేసే ఆలోచనతో ఉంది బీజేపీ.టీఆర్.ఎస్‌లో అసంతృప్త నేతలను దువ్వే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. పార్టీలో ప్రాధాన్యం దక్కని హైదరాబాద్ నగర నేతలపై ఫోకస్ పెట్టింది. ఓవైపు క్షేత్రస్థాయిలో బలపడుతూనే…కొందరు నేతలను చేర్చుకోవడం ద్వారా టీఆరెస్ని నైతికంగా దెబ్బకొట్టాలనేది బీజేపీ వ్యూహం. రాజధానిలో పార్టీకి గట్టి బేస్ ఉండటంతో… గ్రేటర్ సిటీలో ప్రభుత్వ వైఫల్యాలను డివిజన్ల వారీగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తోంది.
ఇప్పటికే సర్వే చేయించామని, 75 స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమనే ప్రకటనలతో మైండ్ గేమ్ కూడా స్టార్ట్ చేసింది కమలం పార్టీ. డిసెంబరులోగా ఎన్నికలు జరిపించేయాలని మొదట ఉత్సాహపడ్డ టీఆరెస్…దుబ్బాక ఫలితం తర్వాత తొందరపడొద్దనుకుంటోంది. క్షేత్రస్థాయిలో అసంతృప్తులు చల్లారక, వరదసాయం అందరికీ అందాకే ఎన్నికలకు వెళదామనుకుంటోంది. ఏదయినా ఫిబ్రవరి 11తో జీహెచ్.ఎంసీ పాలకవర్గ పదవీకాలం ముగియబోతోంది. వచ్చే నెలకాకపోతే ఆ పైవచ్చే నెలయినా ఎన్నికలుపెట్టాల్సిందే. వెంటనే పెడితే దుబ్బాక గెలుపుతో టాప్ గేర్.లో ఉన్న బీజేపీ అదే స్పీడ్.తో ప్రచారం కొనసాగిస్తుంది. కాస్త ఆలస్యమైతే ఈ లోపు గ్రౌండ్ వర్క్ పూర్తిచేసుకుంటుంది.
ఒకప్పుడు తామెంతో బలంగా ఉన్న గ్రేటర్ పరిధిలో మళ్లీ పుంజుకోవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. మినీ అసెంబ్లీ ఎన్నికల్లాంటి గ్రేటర్లో గెలిచి.. తెలంగాణలో టీఆర్ఎస్కు తామే నిజమైన ప్రత్యామ్నాయమని మరోసారి చాటిచెప్పాలనే కదనోత్సాహంతో ఉంది కమలం పార్టీ. ఏదయినా గ్రేటర్ ఎన్నికల్లో అధికారపార్టీకి బీజేపీ పక్కలో బల్లెమే. 30 డివిజన్లలో బీజేపీ ప్రభావం ఉన్నట్టు 15 రోజుల కింద నిఘా వర్గాలు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్టు సమాచారం. దుబ్బాక రిజల్ట్ తర్వాత ఆ ప్రభావం మరిన్ని డివిజన్లకు విస్తరించొచ్చని టాక్ వినిపిస్తోంది. ఈసారి బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పూర్తిగా సైడైపోయి…టీఆరెస్-బీజేపీ మధ్యే ఫైట్ నడిచేలా ఉంది