ఇంట్లో,స్కూళ్ళలో చదవండర్రా అన్ని పోరు పెట్టిన పక్కకెళ్ళి వాట్సప్ లో స్టేటస్ చూసుకునే పిల్లలున్న ఈ రోజుల్లో ఓ బామ్మ ఎగ్జామ్స్ రాసి ఒక రేంజ్ లో మార్కులు సాధించేసింది. ఇటివల సోషల్ మీడియాలో వైరలైంది కేరళ బామ్మ కాత్యాయని అమ్మ. 96ఏళ్ల వయసులో చదువుకోవాలనే తపనతో లిటరసీ పరీక్షలు రాసి 100కి 98శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి టాపర్‌గా నిలిచింది. ఈ బామ్మగారి పట్టుదల చూసి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్ సైతం అబ్బురపడ్డారు…
అలెప్పీ ప్రాంతానికి చెందిన 96ఏళ్ల బామ్మ కాత్యాయనికి చదువుకోవడం ఎంతో ఇష్టం. అందుకే కేరళ లిటరసీ మిషన్ ఆథారిటీ నిర్వహించిన తరగతులకు ఆమె హాజరైంది. ఆగస్టులో నిర్వహించిన క్లాస్ 4 పరీక్షలు రాసింది. అప్పుడే ఆమె పరీక్ష రాస్తున్న ఫొటోను ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. వయసుతో సంబంధం లేకుండా చదువుకోవాలనే పట్టుదలతో ఆమె పరీక్షలు రాసింది. నూటికి 98శాతం మార్కులు తెచ్చుకొని క్లాస్ 4 టెస్ట్‌లో టాపర్‌గా నిలిచినట్లు లిటరసీ మిషన్ అథారిటీ వెల్లడించింది.
ఇక మంచి మార్కులు తెచ్చుకున్నందుకు ఈ బామ్మ ఫుల్ ఖుషీగా ఉంది. బామ్మ కాత్యాయని మనవరాళ్లు అపర్ణ, అంజన తనకు ఎంతో సహాయం చేశారని బామ్మ చెబుతోంది. ‘మా కాలంలో ఆడపిల్లలు అసలు పాఠశాలలకే వెళ్లే వారు కాదు. నా పెద్ద కూతురు అమ్మినమ్మ 2016లో పదో తరగతి పరీక్షలు రాసింది. ఇక నేను దాన్ని చాలేంజ్ గా తీసుకొని చదువుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. నా మనవరాళ్లు ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. అందుకే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను’ అని ఈ బామ్మ చెబుతోంది. అన్నట్లు రేపు ఈ బామ్మ గారు కేరళ సీఎం విజయన్ చేతుల మీదుగా మెరిట్ సర్టిఫికెట్ అందుకోనుంది.