ఫిక్స్ అయిన ప్రోగ్రాం ప్రకారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విశాఖలో ఫ్లైటెక్కి హైదరాబాద్‌లో దిగాలి. కానీ మనసు మార్చుకున్నారు. చాలారోజులైంది చంద్రబాబుని చూసిపోదామనుకున్నారో..ఢిల్లీ పెద్దల మనసులో మాటని ముఖాముఖి చెప్పాలనుకున్నారోగానీ..వైజాగ్‌లో రైలెక్కి విజయవాడలో దిగేశారు. అనుకోని అతిథిలా నరసింహన్ రావడం..ఏపీ సీఎం చంద్రబాబుతో దాదాపు గంటన్నర మీటింగేయడంతో మ్యాటర్ ఏమై ఉంటుందని అందరిలో ఒకటే ఉత్కంఠ. బీజేపీమీద ఈ స్థాయిలో పోరాటాలు వద్దని గవర్నర్ నచ్చజెప్పారనీ..ఓసారి కమిటైతే తన మాట తానే విననన్నట్లు చంద్రబాబు రియాక్ట్ అయ్యారన్న రేంజ్లో అనుకూల పత్రికల్లో కథనాలు. కానీ ఆయనేం చెప్పారో, ఈయనేం విన్నారో యాజిటీజ్‌గా చెప్పేందుకు పక్కనెవరూ లేరు.
పార్లమెంట్లో ఎంపీల దీక్షల్ని పట్టించుకోలేదు. ఒకటికి నాలుగుపార్టీలు అవిశ్వాసనోటీసులిచ్చినా కేంద్రం లెక్కచేయలేదు. టీడీపీ బయటికొచ్చేశాక ఎన్డీఏలో ముసలం మొదలైందనీ…చంద్రబాబులాంటి పాతమిత్రుడ్ని వదులుకోవడం వ్యూహాత్మక తప్పిదమని బీజేపీ పెద్దలు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారనీ ఈమధ్య కాలంలో కొన్ని మీడియాల్లో కథనాల్ని వండివారుస్తున్నారు. ఇక మొన్న 12 గంటల ధర్మపోరాట దీక్ష ఢిల్లీ పీఠాన్ని కుదిపేసిందని పచ్చదండు పెడబొబ్బలు పెడుతున్నా ఢిల్లీ పెద్దలు పెదవి విప్పింది లేదు. కాకపోతే బావ కళ్లెదుటే బామ్మర్ది బాలయ్య హిందీలో మోడీని చెడామడా తిట్టేయడం మాత్రం బీజేపీ పెద్దల చెవుల్లో పడకుండా ఉండదు.
చంద్రబాబుతో గవర్నర్ భేటీలో కేంద్రంతో కయ్యం విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని చెబుతున్నారు. కేంద్రంతో గొడవ పడటం వల్ల ఏ ప్రయోజనంలేదని, దూకుడు తగ్గించాలని నరసింహన్ చెప్పినా చంద్రబాబు ససేమిరా అన్నారనేది అనుకూలవర్గాలు చేసుకుంటున్న ప్రచారం. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుందని కేంద్రపెద్దలు గవర్నర్ ద్వారా హెచ్చరిక సంకేతాలు పంపి ఉంటారనేది మరో వాదన. కొన్నాళ్ల పాటు మౌనంగా ఉంటే తమవైపునుంచి చేయాల్సిందేదో చేస్తామని మోడీ మాటగా కాస్త గట్టిగానే చెప్పుంటారు. మీ శ్రేయోభిలాషిగా చెబుతున్నానంటూనే కేంద్ర పెద్దల మదిలో ఏముందో గవర్నర్ చెప్పేశారనీ..రాజీపడేదే లేదంటున్నా మోడీ లక్ష్యంగా విమర్శల తీవ్రత ఇకపై అంతగా ఉండకపోవచ్చనేది బయట జరుగుతున్న చర్చ. గవర్నర్ రాయబారం ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.