Home News Politics

గద్వాలలో అత్తా అల్లుడి సవాల్‌….!

ప్రధాన పార్టీల నేతలకు కేరాఫ్ పాలమూరు ఒకప్పుడు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన జిల్లా, రాష్ట్ర,జాతీయ స్థాయిలో చక్రం తిప్పగల నేతలకు కొదవలేని ఈ జిల్లాలో ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్నాయి రాజకీయపక్షాలు. ఇక ఉమ్మడి జిల్లాలో కీలక నియోజకవర్గం కొత్త జిల్లాగా ఏర్పడ్డ గద్వాల ముందస్తు ఎన్నికలవేళ రాజకీయం ఎలా ఉంది. గద్వాలలో అత్తకి అల్లుడు సవాల్‌ విసురుతుండటంతో ఇక్కడ రాజకీయం ఆసక్తిగా మారింది. ఎన్నికల్లో హోరాహోరి తలపడుతున్న అత్తా అల్లుడి ఫైట్ పై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్…


ఒక వైపు కాకలు తీరిన కాంగ్రెస్‌ నాయకురాలు డీకే అరుణ. గద్వాల సంస్థానంలో జేజెమ్మగా పేరొందారు. దశాబ్దాలుగా గద్వాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. రాజకీయ వ్యూహాలకు కేంద్రమైన గద్వాల బంగ్లాలో వేసే ఎత్తుగడలతో మూడుసార్లు గెలుపొందిన ఆమె నాలుగోసారి విజయానికి పావులు కదుపుతున్నారు. ఇదే బంగ్లాలో రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకుని ఎదిగారు టీఆర్ఎస్ అభ్యర్ధి బండ్ల కృష్ణమోహన్‌. అరుణ భర్త డీకే భరతసింహారెడ్డి మేనల్లుడైన ఆయనకు బంగ్లా ఆనుపానులన్నీ ఎరుకే. వాటినే ఒంటపట్టించుకుని డీకే కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఎదిగారు. అత్తతో రెండుసార్లు తలపడి ఓటమి చవిచూసిన ఆయన ఇప్పుడు మూడోసారి బరిలోకి దిగారు. అత్తా అల్లుళ్ల పోరుతో కృష్ణా, తుంగభద్ర నదుల నడుమ వెలసిన నడిగడ్డ రసవత్తర సమరానికి వేదికగా మారింది.

గద్వాల కోటపై జెండా ఎవరు ఎగుర వేస్తారనే ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. తొలిసారిగా 1999 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అరుణ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2004, 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. నాలుగోసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే, కీలక పదవి ఖాయమని ఆమె భావిస్తున్నారు. భరతసింహారెడ్డి అనుచరుడిగా కొనసాగిన ఆయన మేనల్లుడు కృష్ణమోహన్‌రెడ్డి డీకే కుటుంబంతో విభేదించి స్వతంత్ర రాజకీయాలు ప్రారంభించారు. తొలుత టీడీపీ నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా, 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అరుణపైనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మూడోసారి కూడా ఓడిపోతే తన రాజకీయ భవిష్యత్తుకు ఫుల్‌స్టాప్‌ పడే పరిస్థితి వస్తుందనే ఆందోళన ఆయనలో నెలకొంది. దాంతో, ఇక్కడ గెలుపును ఇద్దరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గత మూడు ఎన్నికల్లో ఇక్కడ పోటీ డీకే వర్సెస్‌ ప్రత్యర్థి అన్నట్లు ముఖాముఖి జరిగింది. కానీ, ఈసారి బీజేపీ నుంచి గద్వాల వెంకటాద్రి రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి రంజిత్‌కుమార్‌ కూడా బరిలో నిలిచారు.


టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డికి మంత్రి హరీశ్‌రావు అండగా నిలుస్తున్నారు. ప్రచారంలో అన్నీ తానై గులాబీ జెండా ఎగురవేసేందుకు ముందుకెళ్తున్నారు. ఈసారి అరుణను కట్టడి చేయాలని టీఆర్‌ఎస్‌ కంకణం కట్టుకుంది. దీంతో పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరుగాంచిన గద్వాలలో బిగ్‌ఫైట్‌ నడుస్తుంది. 70 శాతం ఓటు బ్యాంకు ఉన్న బోయలు, వాల్మీకులు, కురమలు, పద్మశాలీల పై అన్నీ పార్టీలు దృష్టిసారించాయి. అయితే టీఆర్ఎస్ తరుపున ఇక్కడ టికెట్‌ ఆశించిన బీసీ నాయకులు ఆంజనేయులు గౌడ్‌, మధుసూదన్‌ బాబు అంటీముట్టనట్లు ఉండడం ఇక్కడ గులాబీ పార్టీకి ప్రతికూలంగా మారింది.

తెర వెనక వ్యూహాలు, ప్రతి వ్యూహాలు గద్వాలలో జోరుగా సాగుతున్నాయి. గత నాలుగున్నరేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైనా, కేసీఆర్‌ కుటుంబంపైనా అరుణ నేరుగా విమర్శల ఎక్కుపెట్టారు. దాంతో, ఆమెను కట్టడి చేసేందుకు కేసీఆర్‌ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. బాధ్యతలు మంత్రులు హరీశ్‌, జూపల్లి కు అప్పగించారు. ప్రగతి నివేదన సభల నిర్వహణలోనూ గద్వాలకు అగ్రపీఠం వేశారు. ఆ వేదిక నుంచే కృష్ణమోహన్‌ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇక, కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో చైర్‌పర్సన్‌గా ఉన్న అరుణ రాష్ట్రంలోని వివిధ నియోజక వర్గాల్లో పర్యటిస్తుండడంతో ఆమె భర్త భరతసింహారెడ్డి, కూతురు స్నిగ్థారెడ్డి ప్రచారంలో తోడుగా నిలుస్తున్నారు. కృష్ణమోహన్‌ రెడ్డికి ఆయన సతీమణి జ్యోతి, కుమారుడు సాయిసాకేత్‌ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.

ఇక డీకే అరుణ హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గెలవడం, ఆరు దశాబ్దాలుగా కుటుంబ ప్రాతినిధ్యం అన్ని వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఉండడం, కాంగ్రెస్‌ వర్గీయుల అండ ఉండడం,జిల్లా సాధించారనే పేరు అరుణకి ప్లస్ గా మారాయి. కాకపోతే కుటుంభ పెత్తనం, భర్త భరతసింహారెడ్డి జోక్యం, ఇటీవల కొందరు కాంగ్రెస్‌ నాయకులు పార్టీని వీడడం ఆమెకు మైనస్. బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి రెండుసార్లు ఓడిపోయాడనే సానుభూతి, నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి, మంత్రులు హరీశ్‌, జూపల్లి అండతో ఎక్కువ నిధులు తీసుకురావడం తనకు అనుకూలం అంటున్నారు. పార్టీలో వర్గ విభేదాలు, కొందరు పార్టీ నేతలను వ్యక్తిగతంగా దూరం చేసుకోవడం, సరైన ఫ్యూహం లేకపోవడం కృష్ణమోహన్ మైనస్.

గద్వాలలో ఆరు దశాబ్దాలుగా డీకే కుటుంబమే గెలుస్తూ వస్తోంది. డీకే సత్యారెడ్డి రెండుసార్లు, సమరసింహారెడ్డి నాలుగుసార్లు, భరతసింహారెడ్డి ఒకమారు, అరుణ మూడుసార్లు గెలిచారు. 16సార్లు ఎన్నికలు జరిగితే.. 15సార్లు డీకే కుటుంబ సభ్యులు పోటీ చేసి 10 సార్లు గెలిచారు. నియోజకవర్గంలో సుమారు 55 వేల ఓట్లు గద్వాల పట్టణంలోనే ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో ఎవరు ఎక్కువ ఓట్లు సాధించుకుంటే వారినే విజయం వరిస్తూ వస్తోంది. గత ఎన్నికల్లోనూ మున్సిపాలిటీ పరిధిలో వచ్చిన ఆధిక్యమే అరుణ విజయానికి దోహదపడింది. నాలుగోసారి ఎన్నికల బరిలో నిలిచిన అరుణ ఈ విజయం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. గద్వాల ఎన్నికల్లో సాగునీరు, అభివృద్ధి ప్రధానాంశాలుగా నిలుస్తున్నాయి. ప్రస్థుతం రాజకీయ పరిణామాలు గమనిస్తే ఇక్కడ హస్తం పార్టీకే కొంత అనుకూల వాతావరణం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here