Home News

ఆ మంత్రికి…ఎమ్మెల్యేకి చెడిందా…!

అమాత్యుడి అతిజోక్యంతో క‌స్సుమంటున్నారు ఆ ఎమ్మెల్యే… అధికార, అన‌ధికార వ్యవ‌హ‌రాల్లో త‌ల‌దూర్చుతూ… ఎమ్మెల్యేగా తన అధికారాల‌కే కోత పెడుతున్నారని మండి ప‌డుతున్నారు… తాడో పేడో తేల్చుకోక పోతే త‌న ఉనికికే ప్రమాద‌ని భావించి నిర‌స‌న గ‌ళం విప్పారు ఆ అధికారపక్ష శాసనసభ్యుడు … ఏకంగా త‌న గ‌న్‌మెన్‌ను ప్రభుత్వానికి స‌రెండ‌ర్ చేసి కలకలం రేపారు … ఇంత‌కీ ఎవరా ఇద్దరు? … అసలు వారి మధ్య పంచాయ‌తీ ఏంటి?

పాల‌మూరు జిల్లాలో మంత్రి నిరంజ‌న్ రెడ్డి వ్యవహారతీరుపై గ‌ద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహ‌న్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు… త‌న అధికారాల‌కే ఎస‌రు పెడుతున్నార‌ని మండిప‌డుతున్నారు… ఈ ఎపిసోడ్‌తో .. ఎన్నిక‌ల ముందు నుంచి వీరి మ‌ధ్య కొన‌సాగుతూ వచ్చిన కోల్డ్ వార్ కాస్తా …. ముదిరి పాకాన పడి రచ్చకెక్కింది … తాజాగా గ‌ద్వాల జిల్లా ప‌రిష‌త్ సిఈఓ నియామకం విష‌యంలో తాను ప్రతిపాదించిన వ్యక్తిని కాకుండా … మంత్రి నిరంజన్‌రెడ్డి మరొకరిని నియమించడానికి రికమెండ్‌ చేసారని .. ఎమ్మెల్యే కృష్ణమోహ‌న్ రెడ్డి
తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు…

త‌న ప్రమేయం లేకుండా , కనీస స‌మాచారం ఇవ్వకుండా, తాను ప్రతిపాదించిన వారిని కాద‌ని .. మంత్రి ఏక‌ప‌క్షంగా జ‌డ్పీ సీఈఓని నియ‌మించ‌డంపై కృష్ణమోహ‌న్ రెడ్డి త‌న స‌న్నిహితుల వద్ద ఆవేద‌న వ్యక్తం చేసిన‌ట్లు స‌మాచారం… మంత్రి త‌న‌కు క‌నీస విలువ ఇవ్వకుండా … త‌మ జిల్లా, నియోజ‌కవ‌ర్గాల్లో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ .. నిర‌స‌న‌గా కృష్ణమోహ‌న్ రెడ్డి త‌నకున్న గ‌న్ మెన్‌ను ప్రభుత్వానికి స‌రెండ‌ర్ చేశారు… అధికారపార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఆయన గన్‌మెన్‌ను స‌రెండ‌ర్ చేయడం జిల్లాలో చ‌ర్చనీయాంశంగా మారింది… కృష్ణమోహన్‌ మాత్రం త‌న వ్యక్తిగ‌త కార‌ణాలతోనే గన్‌మెన్‌ను స‌రెండ‌ర్ చేసానని చెప్తున్నా .. మంత్రితో ఉన్న విభేదాలే ఈ తీవ్ర నిర్ణయానికి దారితీసిందన్న చర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది.

తెలంగాణలో రాష్ట్రస్థాయి నేత‌గా ఎదిగిన , మాజీ డికే అరుణకు కంచుకోటగా ఉన్న గ‌ద్వాల నుంచి కృష్ణమోహ‌న్ రెడ్డి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు… డికే అరుణకు స‌మీప బంధువైన ఆయన వ‌రుసగా మూడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమెతో త‌ల‌ప‌డ్డారు… ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తొలిసారి విజ‌యం సాధించిన ఆయ‌న నియోజ‌క వర్గంలో త‌న‌కంటూ సొంతవర్గాన్ని ఏర్పాటు చేసుకుని, ప‌ట్టు పెంచుకునే ప్రయ‌త్నంలో ఉన్నారు.ఆ క్రమంలో జిల్లా టిఆర్‌ఎస్‌లో వర్గవిభేదాలు మొదలయ్యాయి .. ముఖ్యంగా గ‌ద్వాల నియోజ‌క వ‌ర్గంలో కృష్ణమోహ‌న్ రెడ్డికి వ్యతిరేకంగా మ‌రో వ‌ర్గం త‌యారైంది .. వారికి మంత్రి నిరంజన్‌రెడ్డి స‌హ‌క‌రిస్తున్నార‌ని అనుమానిస్తున్నారంట కృష్ణమోహ‌న్ రెడ్డి … నియోజ‌కవ‌ర్గం లో అభివృద్ది ప‌నులు, కాంట్రాక్టుల కేటాయింపుతో పాటు … అధికారుల‌ నియామ‌కాలు, ట్రాన్స్‌ఫర్ల విష‌యంలో కృష్ణమోహ‌న్ రెడ్డి తనకు రుచించ‌ని నిర్ణయాలే అమ‌ల‌వుతుండ‌టంతో ఆయ‌న లోలోన రగిలిపోతున్నారని అనుచరులు అంటున్నారు ..

అంతిమంగా జిల్లా ప‌రిష‌త్ సిఈఓ నియామకం విష‌యానికి వ‌చ్చేట‌ప్పటికి ఇరు వ‌ర్గాల మ‌ద్య విభేదాలు రచ్చకెక్కినట్లు కనిపిస్తున్నాయి .. సీఈఓగా కృష్ణమోహ‌న్ ప్రతిపాదించిన వారిని కాకుండా … మంత్రి సిఫార్సుతో ఆయన వ్యతిరేక వర్గీయులు చక్రం ఇప్పారు .. తన వ్యతిరేకులు సూచించిన వ్యక్తే సిఈఓగా భాద్యత‌లు చేప‌ట్టడం … కృష్ణమోహ‌న్ రెడ్డి బ‌హిరంగంగానే తేల్చుకునేందుకు సిద్దమైన‌ట్లు తెలుస్తోంది… అందులో భాగంగానే ఆయన గన్‌మెన్‌ను సరెండ‌ర్ చేయ‌డం రాజకీయంగా కలకలం రేపుతోంది.. ఈ వ్యవ‌హ‌రం టీ క‌ప్పులో తుఫానులాగా స‌ర్దుకుంటుందో? లేక రాజ‌కీయ ప్రకంప‌న‌ల‌కు దారి తీస్తుందో? చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here