వరంగల్,ఖమ్మం మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడింది. వరంగల్ మేయర్గా గుండు సుధారాణిని ఎంపిక చేసింది టీఆర్ఎస్. ఇక ఖమ్మం మేయర్ పదవి నీరజను వరించింది. కొత్తగా గెలిచిన కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం అనంతరం మేయర్ల ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులను నియమించిన టీఆర్ఎస్ అధినాయకత్వం సీల్డ్ కవర్ లో ఈ పేర్లను పంపింది.

వరంగల్ కార్పోరేషన్ లో మొత్తం 66 మంది కార్పొరేటర్లు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్ ఆఫీసియో సభ్యులకు ప్రత్యేక వరుసలో సీటింగ్ ఏర్పాటు చేశారు. కరోనా బారినపడి హోమ్ ఐసోలేషషన్లో ఉన్న 8 మంది కార్పొరేటర్లకు కూడా ఎన్నిక లో పాల్గొనడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.
ఇక ఖమ్మం మేయర్గా పునుకొల్లు నీరజను ఎంపిక చేసింది టీఆర్ఎస్ అధిష్టానం. మరో ఇద్దరు పోటీ పడినా నీరజ వైపు టీఆర్ఎస్ హైకమాండ్ మొగ్గు చూపింది. 26వ డివిజన్లో గెలిచిన నీరజ యాక్టివ్గా రాజకీయాల్లో ఉంటారనే పేరుంది. దాంతో కొందరు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు నీరజ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. సిద్దిపేట మున్సిపాలిటీకి మంజుల, జడ్చర్లకు దోరెపల్లి లక్ష్మి, నకిరేకల్ లో రాచకొండ శ్రీను, అచ్చంపేటలో నర్సింహ్మ గౌడ్ పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం ఖరారు చేసింది.