Home Entertainment Reviews

భానుమతికి “ఫిదా”: ఈ రేంజ్ లో రివ్యూ చూసి ఉండరు!

భానుమతికి “ఫిదా”: ఈ రేంజ్ లో రివ్యూ చూసి ఉండరు!

ఫిదా..
ఈ సినిమాకు
బాన్సువాడ భానుమతి అని టైటిల్ పెట్టి.. దానికి సింగిల్ పీస్, హైబ్రిడ్ రకం అని సబ్ టైటిల్ పెట్టాల్సింది. సినిమా నిండా భానుమతే. ఈ సినిమా గొప్పదనమేంటంటే.. హీరో.. హీరోయిన్ని చూసి ఎలా ఫీలవుతాడో.. ప్రేక్షకులు కూడా సేమ్ టూ సేమ్ అలాగే ఫీలవడం ఈ సినిమా ప్రత్యేకత.

“తీసిన సినిమా తీయడం.. రాసిన పాత్రే రాయడం.. ఇది కాదా శేఖర్ కమ్ముల చిత్రం అని అనాలనిపిస్తుంది” ఈ సినిమా చూస్తే. ఎందుకంటే హ్యాపీడేస్ లో, ఆనంద్, గోదావరి వీటన్నిట్లోనూ హీరోయిన్ కేరెక్టర్స్ ఎలాంటివో ఈ సినిమాలోని భానుమతి కేరెక్టర్ కూడా సేమ్ అలాంటిదే.

తనకుతాను ఆల్టర్నేట్ ఉండదని ఫీలవడం. ఒక అబ్బాయిని చూసి మోజు పడ్డం తర్వాత అతడితో ఏదో ప్రాబ్లం రావడం.. ఈమె ఉచ్చులో చిక్కిన అబ్బాయి దాదాపు కాళ్ల బేరానికి రావడం.. అనేది శేఖర్ కమ్ముల బ్రాండ్ స్టోరీ లైన్. దీన్నే శేఖర్ కమ్ముల తరచూ ప్రేక్షకుల మీదకు వదిలే సిన్మాస్త్రం.

కానీ అంతకన్నా మించినదేదో ఈ చిత్రంలో ఏర్చి కూర్చి పెట్టి జనం మీదకు వదిలేశాడు శేఖర్ కమ్ముల. సినిమా విడుదలకు ముందు నన్ను టచ్ చేయడం ఎవరి తరమూ కాదని స్టేట్ మెంట్ ఎందుకిచ్చాడో ఫిదా చూశాక కానీ అర్ధం కాదు.

సాయి పల్లవి మలయాళీ అయినా సినిమా కోసం అది పనిగా తెలంగాణ స్లాంగ్ నేర్చుకుని మరి మాట్లాడ్డం సినిమాకు ఎంత ప్లస్సయిందంటే అంత.

మధు ప్రియ పాడిన పిల్లాడొచ్చిండే పాట సినిమాకు హై ఓల్టేజ్ ను సప్లై చేసింది. సినిమాలో మరో ఇంట్రస్టింగ్ థింగ్ సడెన్ గా తేలు విజయ పాడిన పచ్చా పచ్చని పల్లెల్లోనా బతుకమ్మ పాట. ఇది తెలియని జోష్ ను ఇస్తుంది.

చెప్పుకోడానికి కథలో ఏం పెద్ద మజా ఉండదు. ఉన్నదంతా కేరెక్టరైజేషన్లలోనే. అది కూడా భానుమతి కేరెక్టరైజేషన్. ఈ పాత్ర మలచిన తీరే ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్.

హీరోయిన్ చూట్టూ అల్లిన నాన్న, అత్త, అక్క, స్నేహితురాలి పాత్రలన్నీ నోరారా నిజామాబాద్ కి చెందిన తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతుంటే.. ఎంత కమ్మని భాషో అనిపిస్తుంది. అక్కడక్కడా ఈ భాషలోని కమ్మదనం పీక్స్ కి చేరుతుంటే వారెవ్వా అనిపిస్తుంది. అసలు సినిమాలోని ఈ భాషాభినయానికే ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు.

మరో ముఖ్యాంశమేంటంటే ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా మీదున్న అపవాదును తొలగించేశాడు శేఖర్ కమ్ముల. ఎప్పుడూ సైడ్ కేరెక్టర్లు, లేదా కామెడీ విలన్లకు మాత్రమే వాడే తెలంగాణ యాసను మొదటి సారి సినిమా మొత్తం నింపేయడం వల్ల అచ్చ తెలంగాణ సినిమా రుచేమిటో చూపించాడు శేఖర్ కమ్ముల.

ఇన్నాళ్ల పాటు అచ్చ తెలుగు సినిమా అంటే గోదారి యాసలో తీసిందే అన్న ముద్ర నుంచి కూడా బయట పడేశాడు. ఈ సినిమా ఫ్యూచర్ తెలంగాణ సినిమా ఎలా ఉంటుందో చూపించిన చిత్రంగా చూపవచ్చు.

కామెడీ ట్రాక్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. పాడింగ్ కేరెక్టర్లలోనూ స్థానికులను సెలెక్ట్ చేయడం సినిమాకు మరో ప్లస్ పాయింట్. తండ్రి పాత్ర వేసిన సాయి చంద్ ను చూసి ఎన్నాళ్లయిందో. తన పాత్రలో ఒదిగిపోయాడు.

మిగిలిన వాళ్లంతా అచ్చ తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే అదరహో అనిపిస్తుంది. సినిమా మొత్తం స్లాంగ్ తో నింపేయడమే ఈ సినిమాకు జీవ కళ తీసుకొచ్చి పెట్టింది.

ఇక హీరో పాత్ర.. మెగా ఫ్యామిలీ నుంచి పాత్ర పరిధిలో ఇమిడి పోయే రేర్ హీరో దొరికాడని మళ్లీ అనిపిస్తుంది. బేసిగ్గా మెగాహీరోల్లో ఈ గుణం అంతగా కనిపించదు. సినిమా మొత్తాన్ని ఆక్రమించేసి టార్చర్ పెట్టే హీరోల కుటుంబం నుంచి ఇలా కథకు అనుగుణంగా నటించే హీరోను చూడ్డం చూడముచ్చటగా అనిపిస్తుంది.

చిత్రం రాజేష్ పాత్ర ఉంది. అలాగని దానికంటూ సపరేట్ కామెడీ క్రియేట్ చేసి అదో ప్రహసనంగా మార్చకుండా తయారు చేసిన విధం కూడా సూపర్. అంతే కాదు సినిమా మొత్తం సగం నిజామాబాద్ బాన్సువాడ, అమెరికాల మధ్య చుట్టడమే కాదు.. రెండు ప్రాంతాలనూ గ్రాండ్ గా చూపడంలో డైరెక్టర్ కంప్లీట్ సక్సెస్ సాధించాడు.

బారాత్ లో పెళ్లి కొడుకును తీసుకు వచ్చేది ఎడ్ల బండి మీద. దాని ముందు హీరో తన మరదలితో వేసే డ్యాన్సు సో నేచురల్. అదే సమయంలో అచ్చ తెలంగాణ పల్లెదనం ఉట్టి పడుతుంది.

మాటలంటే ఇలా ఉండాలనిపించే విధంగా సాగిందీ చిత్రం. పనిమాలా ప్రయోగించే ప్రాసలతో కూడిన పంచ్ లు కాదు డైలాగ్స్ అంటే. ఇదిగో ఇలా ఉండాలని ఓ రోల్ మోడల్ గా రాశారు ఈ సినిమాకు ప్రకాష్, శేఖర్ కమ్ముల. అంత బాగా సినిమాకు మాటలు ప్రాణం పోశాయి.

ఈ మధ్యకాలంలో వచ్చిన అతి కొద్ది మంచి సినిమాల్లో ఫిదా ఒకటి. వండ్రఫుల్ మూవీ. శేఖర్ కమ్ముల తనదైన సహజవిశ్వరూపం చూపించాడు. మంత్ ఎండింగ్ లోనూ జనం ఉన్న డబ్బులను కూడేసుకుని మరీ చూసేంతగా మలచాడు. అసలు బాగున్న సినిమాకు ప్రత్యేకించీ పబ్లిసిటీ అవసరం లేదు. జస్ట్ మౌత్ టాక్ చాలని చెప్పడానికిదో నిదర్శనం.

సంగీతం శక్తి కాంత్ కార్తిక్ అద్భుతమైన పనితీరు కనబరిచాడు. రెండు మూడు పాటలు అద్భుతహః అనిపించాయి కూడా. అదే సమయంలో పాట అంటే సినిమాలో దర్శకుడు చెప్పడానికి వీల్లేని లాగ్ ని కంట్రోల్ చేయడానికి కట్టె కొట్టే తెచ్చే అనేలా చెప్ప స్టోరీ. ఈ సూత్రాన్ని యాజ్ ఇట్ ఈజ్ వాడేశాడు శేఖర్ కమ్ముల.

మంచి సినిమాలన్నీ దిల్ రాజు వాకిట్లోకే చేరుతాయో లేక దిల్ రాజే మంచి చిత్రాలను ఒడిసి పట్టడంలో ముందుంటాడో తెలియదు కానీ. సినిమా అంత గొప్పగా ఉంది. ఛాయగ్రహణం విజయ్ సీ కుమార్ తనదైన పనితనం చూపించాడు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ కూడా పక్కాగా అమరింది.

ఇక మిగిలింది ఇంత చదివి కూడా ఈ సినిమా చూడక పోవడం. కాబట్టి చూసెయ్యండి ఓ పనై పోతుంది. మంచి ఫీల్ మీ నరనరాల్లో ప్రవేశించి^భవిష్యత్తు మీద భరోసా కల్పిస్తుంది.

ఈ మాట ఎందుకనాల్సి వస్తోందంటే.. వచ్చే రోజుల్లో తెలుగు సినిమా అమరావతి వెళ్లి పోతే.. ఇక్కడ తయారయ్యే సినిమాలకేం ఇబ్బందేం లేదని ఓ చిన్న హింట్ ఇచ్చాడు శేఖర్ కమ్ముల. ఆల్రెడీ పెళ్లిచూపుల్లాంటి చిత్రాలతో తరుణ్ భాస్కర్ లాంటి యువకులు ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నారు. కాబట్టి అచ్చ తెలుగు సినిమా అటెళ్లిపోతే అచ్చ తెలంగాణ సినిమా సత్తా చాటడానికి సిద్ధంగా ఉందన్నమాట. అందుకు ఫిదా శ్రీకారం చుట్టిందన్నమాట. ఇదే సినిమాలో చెప్పినట్టు గట్టిగా అనుకుంటే జరిగిపోద్దిలే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here