Home News Stories

బద్ద శత్రువులు ఒక్కటయ్యారు…!

రాజకీయ వైరుధ్యం.. కుటుంబ తగాదాలు.. దశాబ్దాల వైరం పక్కకు జరిగాయి.. ఉప్పూ-నిప్పులా కొనసాగిన కుటుంబాల నేతలు ఒకేగూటి పక్షులయ్యారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్న నానుడి.. నిజం కాదని నిరూపిస్తూ ఒకే గొడుగు కిందకు చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా, వ్యక్తిగతంగా కక్షలతో రగిలిపోయిన వారిని తెదేపాలోకి తీసుకురావడంలో పార్టీ నాయకత్వం చతురత చూపించింది. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కలసి ప్రచారం చేస్తారని.. విజయనగరం జిల్లాలో కిశోర్‌చంద్రదేవ్‌, విజయరామరాజు ఒకే వేదికపైకి వస్తారని, చిరకాల రాజకీయ ప్రత్యర్థులైన నారా, నల్లారి కుటుంబాలు చేతులు కలుపుతాయని, దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా వారసులు ఒకే పార్టీలో చేరతారని, ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కలసి పనిచేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఈ ఎన్నికల్లో అది సాధ్యమైంది.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. వీరు ఒకే పార్టీలోకి వస్తారని కొన్ని రోజుల క్రితం వరకు ఎవరూ ఊహించలేదు. ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్‌ గొడవలతో మొదలైన వైరం.. ఆ తర్వాత రాజకీయంగానూ కొనసాగింది. 1994, 1999 ఎన్నికల్లో నారాయణరెడ్డిపై రామసుబ్బారెడ్డి గెలుపొందారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డిపై ఆదినారాయణరెడ్డి విజయం సాధించారు. మొదటి రెండుసార్లు కాంగ్రెస్‌, 2014లో వైసీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. రామసుబ్బారెడ్డిని ఒప్పించి ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. ప్రస్తుతం టీడీపీ తరఫున కడప ఎంపీ స్థానం నుంచి ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి బరిలో నిలిచారు.

కర్నూలు జిల్లా రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థులైన కోట్ల, కేఈ కుటుంబాలు మొదటిసారి చేతులు కలిపాయి.. సూర్యప్రకాశ్‌రెడ్డి తండ్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి తండ్రి కేఈ మాదన్న కాలం నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం తీవ్రంగా నడిచింది. వారిద్దరూ ఒకే పార్టీలో ఉన్నా… ప్రత్యర్థులుగా కొనసాగేవారు. టీడీపీ ఆవిర్భావం వరకు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, మాదన్న కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ఆ తర్వాత కేఈ వర్గం టీడీపీలోకి వచ్చి.. మళ్లీ కాంగ్రెస్‌లోకి.. ఆ తర్వాత టీడీపీలో చేరింది. మొదట్నుంచి కాంగ్రెస్‌లో కోట్ల వర్గం ఉంది. తాజాగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబంతో సహా టీడీపీలో చేరారు. ఒకప్పుడు పరస్పరం ఎదురుపడేందుకూ ఇష్టపడని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కలిసి ప్రచారం సాగిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో నాలుగు దశాబ్దాల రాజకీయ విభేదాల్ని పక్కనబెట్టి నారా, నల్లారి కుటుంబాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌ నేత నల్లారి అమరనాథ్‌రెడ్డికి వ్యతిరేకంగా, గ్రూపు రాజకీయాలు నడిపారు చంద్రబాబు. ఇప్పుడు అదే అమరనాథ్‌రెడ్డి కుమారుడు కిశోర్‌కుమార్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్‌ ఇచ్చారు. 1978లో కాంగ్రెస్‌ తరఫున చంద్రగిరి నుంచి చంద్రబాబు, వాయల్పాడు నుంచి అమరనాథ్‌రెడ్డి విజయం సాధించారు. అమరనాథ్‌రెడ్డి, చంద్రబాబు ఒకే పార్టీలో ఉన్నా.. వేర్వేరు వర్గాలకు నాయకత్వం వహించేవారు. అమరనాథ్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి నుంచి చంద్రబాబు రాజకీయ సలహాలు తీసుకునేవారు. అప్పట్లో జిల్లాపరిషత్‌ ఎన్నికలు జరగ్గా.. అమరనాథ్‌రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థిని కాదని పీలేరు నియోజకవర్గంలోని ఓ పీహెచ్‌సీ వైద్యురాలుగా ఉన్న కుతూహలమ్మను జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలిని చేయడంలో చంద్రబాబు చక్రం తిప్పారు. అప్పట్నుంచి అమర్‌నాథ్‌రెడ్డి, చంద్రబాబు మధ్య రాజకీయ విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇరు కుటుంబాల మధ్య రాజకీయ వైరాన్ని పెంచాయి. కొన్ని నెలల కిందట కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరగా ఆయనకు పీలేరు టిక్కెట్‌ను చంద్రబాబు ఖరారు చేశారు.

విజయనగరం జిల్లాలో కొన్ని శతాబ్దాలుగా శత్రువులు, రాజకీయ ప్రత్యర్థులైన విజయనగరం, బొబ్బిలి రాజులు.. మరోపక్క కురుపాం, మేరంగి రాజులు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. 1757లో విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య జరిగిన ‘బొబ్బిలి యుద్ధం’ నుంచి వారు వైరివర్గాలుగానే కొనసాగుతున్నారు. మంత్రి సుజయకృష్ణ రంగారావు బొబ్బిలి సంస్థానం వారసుడు. ఆయన 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌, 2014లో వైసీపీ నుంచి గెలిచారు. టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ప్రస్తుతం అశోక్‌ గజపతిరాజు, సుజయకృష్ణరంగారావు సన్నిహితంగా పనిచేస్తున్నారు. కురుపాం సంస్థానాధీశులైన శత్రుచర్ల కుటుంబానికి, మేరంగి సంస్థానాధీశులైన వైరిచర్ల కుటుంబానికి తీవ్ర విభేదాలుండేవి. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉండి, కేంద్ర మంత్రిగా పనిచేసిన కిశోర్‌చంద్రదేవ్‌ ఇటీవలే టీడీపీలో చేరారు. మరోపక్క మాజీ మంత్రి విజయరామరాజు 2014లో టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు.

ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి హనుమంతరావు రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహించేవారు. వీరిద్దరూ ఒకరు ఒక పార్టీలో ఉంటే, మరొకరు మరో పార్టీలో ఉండేవారు. ఒకరు టీడీపీలోకి వెళితే, మరొకరు కాంగ్రెస్‌లోకి వచ్చేవారు. ఇప్పుడు ఆ రెండు కుటుంబాలూ టీడీపీలోనే ఉన్నాయి. కరణం బలరాం చీరాల నుంచి, గొట్టిపాటి హనుమంతరావు సోదరుడి కుమారుడు గొట్టిపాటి రవికుమార్‌ అద్దంకి నుంచి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. కరణం బలరాం, గొట్టిపాటి రవి రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్నారు.

విజయవాడలో కొన్ని దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న వంగవీటి, దేవినేని కుటుంబాలు ఇప్పుడు టీడీపీలోకి వచ్చాయి. గతంలో వంగవీటి రంగా కాంగ్రెస్‌లో ఉండేవారు. దేవినేని నెహ్రూ మొదట్లో టీడీపీ.. తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లి.. తిరిగి టీడీపీలోకి వచ్చారు. ఇటీవలే నెహ్రూ మరణించారు. ప్రస్తుతం రంగా, నెహ్రూ వారసులిద్దరూ టీడీపీలోనే ఉన్నారు. రంగా కుమారుడు రాధాకృష్ణ మొదట కాంగ్రెస్‌లోనూ.. తర్వాత ప్రజారాజ్యం, వైసీపీలో కొనసాగి టీడీపీ గూటికి వచ్చారు. మరోవైపు దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు.

ఇక అనంతపురం జిల్లాలో పరిటాల రవి, జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబాల మధ్య తీవ్ర రాజకీయ వైరుధ్యాలు ఉండేవి. రవి కుటుంబం మొదట్నుంచి టీడీపీలోనే ఉంది. ఆయన చనిపోయిన తర్వాత.. సతీమణి సునీత రాప్తాడు నుంచి గెలిచారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జేసీ కుటుంబం టీడీపీలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్‌రెడ్డి అనంతపురం లోక్‌సభ స్థానానికి, ఆయన సోదరుడు ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పటికి పరిటాల, జేసీ కుటుంబాల మధ్య అంత సయోధ్య లేకపోయినా… రాజకీయంగా ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. వారసులు కలిసి ప్రచారం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here