Home News Stories

కొత్త జిల్లాల కసరత్తు పూర్తయ్యేదెప్పుడు?


ఇరవై మూడా…ముప్ఫై రెండా… అంకె ఎంతనేది త్వరలోనే క్లారిటీ రాబోతోందిగానీ…ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటయితే ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది. పది జిల్లాలో తెలంగాణ ఏకంగా 31 జిల్లాలుగా పాలనావ్యవస్థను విస్తరించుకుంది. కొత్త జిల్లాలకు ఓ స్వరూపం ఏర్పడింది. ఏపీలో మాత్రం కొత్త జిల్లాలపై టీడీపీ హయాంలో కసరత్తు కొలిక్కి రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంగా కొత్త జిల్లాల చర్చ జరుగుతూ వస్తున్నా…ఆరేడునెలలుగా దీనిపై కార్యాచరణ ఊపందుకుంది. కొత్త జిల్లాల ఏర్పా ప్రక్రియలో వేగం పెంచింది ఏపీ ప్రభుత్వం.

రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల కమిటీ వరుస భేటీలు నిర్వహిస్తుంటే… జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో కసరత్తు జరుగుతోంది. భౌగోళిక, ఆర్ధిక, సహజ వనరుల లభ్యతను బేరీజు వేసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుకు రోడ్‌ మ్యాప్‌ రెడీ చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. అందుబాటులో ఉన్న అధికారులు.. ఉద్యోగులు.. సిబ్బందితోనే కొత్త జిల్లాల్లో వ్యవస్థ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందే కొన్ని మండలాలను పునర్ వ్యవస్థీకరించాల్సి వస్తుంది. అయితే మొదట అనుకున్నట్లు 26 జిల్లాలకే పరిమితం కావడం కష్టమనే భావన వ్యక్తం కావటంతో… ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య 32కు పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్.. ఉన్నతాధికారులతో అధ్యయన కమిటీ వేసింది. ఆ కమిటీకి అనుబంధంగా మరో నాలుగు బృందాలను కూడా నియమించింది. కొత్త జిల్లాల కసరత్తు జరుగుతుండటంతో పోలీస్ సిబ్బంది బదిలీలపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీచేశారు డీజీపీ. అధికారంలోకి వస్తే ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామని మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చింది వైసీపీ. అరకు లాంటి పెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా మార్చాలనే చర్చ కూడాజరిగింది. అయితే పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే మంత్రివర్గ నిర్ణయానికి భిన్నంగా వీటి ఏర్పాటు ఉండొచ్చనే ప్రచారం కూడా బలంగానే ఉంది.

క్షేత్రస్థాయి కసరత్తు వేగంగా జరుగుతుండటంతో…2021 జనవరి నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటుకి మార్గం సుగమం అయ్యేలా ఉంది. అయితే కొత్త జిల్లాల విషయంలో అప్పుడే నేతల మధ్య పంతాలు పెరుగుతున్నాయి. కేవలం పార్లమెంట్‌ నియోజకవర్గమే ప్రాతిపదికగా కాకుండా, వెనుకబాటును కూడా పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్‌ ఊపందుకుంది. కొన్ని చోట్ల సాంకేతికపరమైన అవరోధాలతో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా….క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం.

చిత్తూరు ఎంపీ సీటు పరిధిలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి నగరాన్ని ఆనుకుని ఉంటుంది. కానీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన ప్రతిపాదన ప్రకారమే వెళ్తే… చంద్రగిరి చిత్తూరు జిల్లా పరిధిలో ఉంటుంది. అతి సమీపంలో తిరుపతి జిల్లా కేంద్రంగా ఉంటే, చంద్రగిరి వాసులు మాత్రం చిత్తూరు వెళ్లాల్సి ఉంటుంది. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారిస్తే సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఆ జిల్లా పరిధిలోకి వస్తుంది.

అయితే ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతనూతలపాడు ప్రజలు, కొత్త జిల్లా కేంద్రమయ్యే బాపట్లకు వెళ్లాలంటే దాదాపు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. శ్రీకాకుళం నగరాన్ని ఆనుకుని ఉన్న ఎచ్చెర్ల విజయనగరం జిల్లా పరిధిలోకి వస్తుంది. దీంతో ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు కూడా భవిష్యత్తులో కొత్త జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలు దాదాపుగా దాదాపు సగానికి పైగా జిల్లాల్లో అనివార్యమవుతాయనే ఆందోళన ఉంది. నాయకుల మీద కూడా ఒత్తిడి పెరిగేలా కనిపిస్తోంది.

కొత్త జిల్లాల విషయంలో తమకు అన్యాయంజరుగుతుందనే ఆందోళన అప్పుడే కొన్ని ప్రాంతాల్లో మొదలైంది. ప్రభుత్వ నిర్ణయానికి ముందే తమ డిమాండ్లను తెరపైకి తెస్తూ కొన్నిచోట్ల ఆందోళనలు కూడా మొదలయ్యాయి. పార్లమెంట్‌ నియోజకవర్గాలను ప్రామాణికంగా తీసుకుంటే…. గుంటూరుజిల్లాలో నర్సరావుపేట కొత్త జిల్లా అయ్యేలా ఉంది. దీంతో పల్నాడు జిల్లా కేంద్రాన్ని గురజాల నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనే ఆందోళనలు జరుగుతున్నాయి. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కూడా కొందరు ఆందోళన బాట పట్టారు. అరకు పార్లమెంట్ స్థానాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలియటంతో… రంపచోడవరం కేంద్రంగా ముంపు మండలాలతో జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ తెరపైకొచ్చింది.

మరోవైపు శ్రీకాకుళం జిల్లా విభజనను వ్యతిరేకిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటిఆంచారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోదని ప్రకటించారు అదే జిల్లాకు చెందిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం. కొత్త జిల్లాలతో భౌగౌళిక సరిహద్దుల పునర్విభజన అంత తేలికేం కాదు. ఇది తేనెతుట్టెని కదిపినట్లేనని ప్రభుత్వానికి తెలుసు. అందుకే జాగ్రత్తగా అడుగులేస్తోంది ప్రభుత్వం.

తొందరగా కొత్త జిల్లాల వ్యవహారాన్ని తేల్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా….వచ్చే ఏడాది మార్చి దాకా అది ఆచరణలోకి రావడం కష్టమే. ఎందుకంటే జనగణన కోసం కేంద్రం విధించిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి 31 వరకూ రెవెన్యూ జిల్లాలు, డివిజన్ల సరిహద్దుల మార్పులు చేయకూడదని కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆదేశాలిచ్చింది. జనగణనకి ఆటంకం లేకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నా… కోవిడ్, లాక్ డౌన్ ప్రభావంతో జనాభా లెక్కల సేకరణ జరగలేదు. కోవిడ్‌ ప్రభావం తగ్గాక కేంద్రం జనగణనకు పూనుకుంటే దాని ప్రభావం పరోక్షంగా ఏపీ కొత్త జిల్లాలపైనా పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here