ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉత్కంట నెలకొంది. హై కోర్టు చేపట్టిన విచారణలో ఇక ఉత్తర్వులు మాత్రమే మిగిడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇరు వర్గాల వాదోపవాదాలు ముగిశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఎన్నికల నిర్వహణకు సిద్దంగాలేమని రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను వినిపించింది. అయితే కోవిడ్-19 వ్యాక్సినేషన్ జరుగుతున్నది కేవలం కొంతమంది ఉద్యోగుల మీదే కాబట్టి.. ప్రభుత్వ వాదనతో పని లేకుండా ఏపీ ఎన్నికల కమిషనర్ ఇచ్చిన షెడ్యూల్ మేరకు ఎన్నికలు జరగాలనేది ఆయన తరఫు న్యాయవాది వాదించారు.
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తమ ప్రాధాన్యత వ్యాక్సినేషనే అని, ఎన్నికల నిర్వహణ అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అయితే ఈ సందర్భంగా ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫున వినిపించిన వాదనల్లోని ఒక అంశాన్ని ధర్మాసనం తప్పు పట్టినట్టుగా తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ హయాంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఇష్టంతో లేదనే వాదనను ఆయన తరఫున న్యాయవాది వినిపించినట్టుగా పత్రికల్లో కథనాలు వెలువడగా ఈ వాదనను ధర్మాసనం తప్పు పట్టినట్టుగా తెలుస్తోంది. ఎస్ఈసీ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు ఏమీ చెప్పలేదు.

నిమ్మగడ్డ విడుదల చేసిన షెడ్యూల్ మేరకు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది కానీ, ఆయన హయాంలోనే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని వాదించలేదు. అయితే నిమ్మగడ్డ తరఫు న్యాయవాదులు ఈ అంశాన్ని ప్రస్తావించినట్టుగా, దాన్ని కోర్టు తప్పు పట్టినట్టుగా.. ఒక పత్రికలో కథనంలో రాగా ఈ అంశం మరింత ఆసక్తిదాయకంగా మారింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. తమ ప్రాధాన్యత వ్యాక్సినేషనే అని, ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని తేల్చి చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఎప్పుడు ఎంత మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ చేయబోతున్న విషయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు అందించిందట. ఇదిలా ఉండగా సింగిల్ జడ్జి ఎస్ఈసీ నిమ్మగడ్డ విడుదల చేసిన షెడ్యూల్ ను రద్దు చేశారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో.. ధర్మాసనం ఈ అంశంపై ఏం తీర్పును ఇస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిదాయకంగా మారింది.