Home News

తెలంగాణలో మరో ఉప ఎన్నిక..ఈటల నెక్స్ట్ స్టెప్ అదేనా ?

తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత ఈట‌ల రాజేంద‌ర్ ఏం చేయబోతున్నారు..రాజకీయంగా ఆయ‌న అడుగులు ఎటువైపు అన్న అంశాల పై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు ఊపిరి సలపనివ్వకుండా కేసులు ఇలా టార్గెట్ ఈటల అన్న రేంజ్ లో అధికారపార్టీ రాజకీయం నడుస్తుంది. దీంతో ఈటల ఎలాంటి స్టెప్ తీసుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.

టీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఈటల పై మాటల దాడి మొదలైంది. మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్తర‌ఫ్ చేసిన‌ట్టుగా ఎమ్మెల్యే ప‌ద‌వి నుంచి రాజీనామా చేయ‌మ‌ని కోర‌క‌ముందే..పార్టీ నుంచి బ‌హిష్కరించ‌క‌ముందే ఆయన స్వయంగా త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతోపాటు.. పార్టీ నుంచి కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు తెలుస్తుంది. ఈ క్రమంలో వ‌చ్చే ఆరు మాసాల్లో ఉప ఎన్నిక ఖాయంగా వ‌స్తుంది అని స్థానికంగా చర్చ నడుస్తుంది.

ఇప్పటికే ఈట‌ల రాజేంద‌ర్ హుజూరాబాద్‌లో త‌న అనుచ‌రులు, పార్టీ కేడ‌ర్‌తో స‌మావేశ‌మ‌మయ్యారు. వారితో చ‌ర్చించాకే ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయడంపై ఓ క్లారిటీకి వచ్చే అవ‌కాశం ఉంది. ఉప ఎన్నిక‌ల‌కు వెళితే అప్పుడు త‌న స‌త్తా నిరూపించుకుని సొంత‌గా గెలిచి కేసీఆర్‌కు స‌వాల్ విసిరే అవకాశం ఉంది. అటు టీఆర్ఎస్ కూడా హుజూరాబాద్ లో స్థానిక నేతలు జారిపోకుండా జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ద్వారా బుజ్జగింపులు మొదలుపెట్టింది.

బీసీ సామాజిక వ‌ర్గంలో ఈట‌ల రాజేంద‌ర్ కు మంచి ప‌ట్టుంది. అదేస‌మ‌యంలో తెలంగాణ ఉద్యమలో యాక్టివ్ గా ఉండటంతో ఉద్యమకారులు,తెలంగాణ సమాజంలో ఓ గుర్తింపు ఉంది. ఈ మైలేజ్ ద్వారా ఉప ఎన్నికలో గెలిచి ఆ తర్వాత ఏ పార్టీలో చేరాలన్నది ఈటల డిసైడ్ అయ్యే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here