Home News

రాజీనామా పై ఈటల నాన్చుడు అందుకేనా…!

టీఆర్‌ఎస్‌కు దూరమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా విషయంలో ఇంకా ఎందుకు జాప్యం చేస్తున్నారు. నేడో, రేపో రాజీనామా అంటూ ప్రచారమైతే జరిగింది కానీ రాజీనామా లేఖ బయటకు రాలేదు. రోజులు గడుస్తున్నా ఈటల రాజీనామా ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజీనామా విషయంలో బయటపడని ఈటల అంతరంగం పై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో ఈటల రాజేందర్‌ బయటపడడం లేదు. ఈటల రాజీనామా విషయంలో సన్నిహితులకు కూడా సమాచారం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో ఈటల మరో ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది.
బీజేపీలో చేరికపై పూర్తి స్పష్టత రాకే రాజీనామా విషయంలో జాప్యం చేస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో బిజెపి పెద్దలను కలిసిన ఈటల ఆ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 13 లేదా 14 న ఈటల ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఢిల్లీ ఫ్లయిట్‌ ఎక్కే ముందే..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఈటల ఉన్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన రెండు మూడు రోజుల్లో.. స్పీకర్ ఫార్మాట్ లో లేఖ ఇచ్చి ఉంటే ఈ అంశంపై పెద్దగా చర్చ జరిగి ఉండేది కాదు. రెండ్రోజుల పాటు హుజురాబాద్‌లో పర్యటించిన ఈటల.. నియోజకవర్గంలో జనం మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అయితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశంపై నియోజకవర్గ పర్యటనలో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు ఈటల రాజేందర్. ప్రస్తుతం అన్ని అంశాలపై మాట్లాడుతున్న ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఎప్పుడు చేస్తారన్నది టీఆర్ఎస్ నేతలకు సైతం అంతుబట్టడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here