Home News

తెలంగాణ రాజకీయాల్లో ఈటల సరికొత్త రికార్డ్

తెలంగాణలో కొంత కాలంగా నడుస్తున్న రాజకీయ హైడ్రామాకి తెరదించుతు ఫ్యూడల్ వ్యవస్థ అంతం..ఆత్మ గౌరవ నినాదం పేరుతో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ అడుగు వేసిన మొదటి వ్యక్తిగా ఈటల రాజేందర్ రికార్డు సృష్టించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు రాజీనామాలు చేయకుండానే మంత్రులుగా కొనసాగినా తాను మాత్రం ఆత్మ గౌరవం కోసమే రాజీనామా చేశా అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అధికార టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో అధికార టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తొలి ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ రికార్డు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు అధికార టిఆర్ఎస్ నుంచి ఏడేళ్లలో ఏ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదు.

తెలంగాణ మలి ఉద్యమంలో 19 ఏళ్లపాటు ఈటల రాజేందర్ కేసిఆర్ అడుగుజాడల్లో నడిచిన నాయకుడు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచరించిన వ్యక్తి. అయితే తనకు నచ్చని అంశాలను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పార్టీ అధినేతకు చెప్పే ప్రయత్నం చేశారు. కోటీశ్వరులకు రైతు బంధు ఇవ్వడం లాంటివి, ఐకెపి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం లాంటివాటిని గులాబీ బాస్ నోటీసుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అది కేసీఆర్ కి నచ్చలేదు. పార్టీ అధినేత ఏది చెబితే అదే ఫైనల్ గా నడిచే ప్రాంతీయ పార్టీల్లో ఈటల మాటలు కేసీఆర్ కి కంటగింపుగా మారాయి.

గత రెండేళ్ల కాలంగా కేసిఆర్ తో ఈటలకు బొత్తిగా పొసగలేదు. దీంతో భూకబ్జా ఆరోపణల పేరుతో ఫిర్యాదులంటు అప్పటికప్పుడే విచారణకు ఆదేశించి ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈటల సానుభూతి పై లెక్కలేసిన కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా పొమ్మనలేక పొగబెట్టారు.ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తొలగించలేదు. ఇక కేసిఆర్ తో ఒకసారి తెగితే అతకదు అన్న క్లారిటీ ఉన్న ఈటల అంతిమంగా బిజెపి వైపు అడుగులేశారు.

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో బర్తరఫ్ అయిన మంత్రుల్లో ఈటల రెండోవాడు. మొదటి వ్యక్తి అప్పటి డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. ఆయన పై ఆరోపణలంటు అప్పటికప్పుడు మంత్రి వర్గం నుంచి తొలగించి అదే సామాజికవర్గానికి చెందిన కడియం శ్రీహరిని ఎంపీగా రాజీనామా చేయించి మరి మంత్రివర్గంలో తీసుకున్నారు. రాజయ్య పై బహిరంగంగా వచ్చిన ఆరోపణలు లేవు ఐదేళ్లు గడుస్తున్నా రాజయ్యను ఎందుకు తొలగించారో ఇప్పటి వరకు ఆయన కానీ, కేసిఆర్ కానీ బయట ఎక్కడా చెప్పలేదు.

ఈటలతో పోలిస్తే తాటికొండ రాజయ్య పెద్దగా చరిష్మా ఉన్న నాయకుడు కాదు. కానీ ఈటల బర్తరఫ్ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వీరిద్దరి మధ్యలో మరో కీలక నేత, కేసిఆర్ కుటుంబసభ్యుడైన హరీష్ రావు వ్యవహారం కూడా చెప్పుకోవాలి. హరీష్ రావును కొంతకాలం కేసీఆర్ దూరం పెట్టారు. చివరకు ఆయన వార్తలను టీఆర్ఎస్ అనుకూల మీడియాలోనూ బ్యాన్ చేశారు. రెండో సారి మంత్రి వర్గంలో సైతం అతికష్టం మీదే హరీశ్ కి చోటు దక్కింది. తర్వాత ఏమైందో ఏమో కానీ హరీష్ రావు మెల్లమెల్లగా కేసిఆర్ కు దగ్గరయ్యారు. ఇప్పుడు మళ్ళీ పార్టీ,ప్రభుత్వంలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు.

టిఆర్ఎస్ లోహరీష్ రావు ఎక్కువగా అవమానాలపాలైనాడు అని ఈటల చేసిన కామెంట్ ను హరీష్ సీరియస్ గా ఖండించారు. అయితే అది మీడియా ముఖంగా కాకుండా పత్రిక ప్రకటన ద్వారా కావడం గమనర్హం. హరీష్, కేసిఆర్, కేటిఆర్ మధ్య బంధం ఇప్పుడు స్ట్రాంగ్ గానే ఉన్నట్లు కనబడుతున్నది. అయితే రాజయ్యని బర్తరఫ్ చేసిన ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కేసీఆర్ మాట జవదాటలేదు. హరీశ్ కూడా తనను పక్కన పెట్టిన కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు కానీ పైకి మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఈటల మాత్రం టిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్ కి సవాల్ విసిరిన ఒకే ఒక్క నేతగా మారాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here