నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి. కీలక సమయంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారాన్ని వెలగబెట్టి…రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ చిత్రపటంనుంచి చటుక్కున మాయమైపోయిన నాయకుడు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ నాయకత్వం గట్టి పట్టుదలతో ఉందని తెలిసినా నిలువరించలేకపోయిన నిస్సహాయుడు. అవసరమైనప్పుడు బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీస్తానని ఊరించీ ఊరించీ అంతా అయిపోయేదాకా పదవిని పట్టుకుని వేలాడారన్న అపనిందలున్న ఉత్తరకుమారుడు. నాలుగేళ్లుగా ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియకుండా ఓ రకంగా రాజకీయంగా అజ్ఙాతంలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని మళ్లీ కాంగ్రెస్ దువ్వుతోంది.
కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే బృహత్తర బాధ్యతని పల్లంరాజు అండ్‌కోకు అప్పగించడం..మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఓ సిట్టింగేయడం జరిగిపోయింది. ఇప్పుడు నేరుగా ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఊమెన్‌చాందీనే రంగంలోకి దిగారు. పార్టీ అధినాయకత్వమే గట్టిగా చెప్పిందో..లేదంటో బాధ్యత తీసుకున్నందుకు తానేదో ఒకటి చేయాలని చాందీ అనుకుంటున్నారోగానీ మొత్తానికి కిరణ్‌కుమార్‌రెడ్డిని వెల్కమ్ బ్యాక్ అంటోంది కాంగ్రెస్. అయితే ఏపీలో నిండా మునిగిన పార్టీని గట్టెక్కించే సత్తా కిరణ్‌కుమార్‌రెడ్డికి ఉందా అన్నదే అందరి డౌట్.
వైఎస్ మరణం తర్వాత, కొన్నాళ్లు సీఎంగా ఉన్న రోశయ్యను తప్పించాక అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యారు కిరణ్‌కుమార్‌రెడ్డి. ఆయన నాయకత్వ పటిమను గుర్తించి ఇవ్వలేదా పదవి. అప్పట్లో అంతకుమించి అధినాయకత్వానికి మరో ఆప్షన్ లేకపోయింది. ఓ రకంగా కిరణ్‌కుమార్‌రెడ్డికి అది జాక్‌పాటే. కానీ రాజకీయంగా, పాలనాపరంగా ఆయన ముద్ర మాత్రం ఏ కోశానా కనిపించలేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అధినాయకత్వాన్ని ధిక్కరించినట్లు కనిపించినా, సొంతంగా సమైక్యాంధ్ర పార్టీ పెట్టినా ఎలాంటి ప్రభావం లేదు.
ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డికి నచ్చజెప్పి పార్టీలోకి తీసుకొచ్చినంతమాత్రాన కాంగ్రెస్‌కి ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే సొంతజిల్లాలోనే ఆయన ప్రభావం చూపలేని పరిస్థితి. నల్లారి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే పచ్చకండువా కప్పేసుకున్నాడు. నల్లారి కుటుంబ మద్దతుదారులంతా పొలోమని టీడీపీలో చేరిపోయారు. ఇంటగెలవడమే కష్టమైన పని రచ్చ గెలుస్తాడనుకోవడం అత్యాశే. 2014 ఎన్నికల్లో పోటీచేసేందుకే ధైర్యం చేయలేనివాడు..నిస్తేజంగా ఉన్న పార్టీని పరుగులుపెట్టిస్తాడనుకోవడం పగటికలే. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఓ వెలుగువెలిగిన వాళ్లంతా ఎవరిదారి వారు చూసుకునేసరికి కాస్త ఖాళీగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డే కాంగ్రెస్‌కి ఆశాకిరణంలా కనిపిస్తున్నట్లున్నాడు.