నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి. సుడి సునామీలా తిరిగి అనుకోకుండా ముఖ్యమంత్రి అయిన అదృష్టజాతకుడు. అదే సమయంలో రాష్ట్ర విభజనకు మౌన సాక్షిగా మిగిలిన దురదృష్టవంతుడు. కాకపోతే..విభజన అనివార్యమని తెలిశాక, తానేమీ చేయలేనని తేలిపోయాక కర్ర కత్తిని తిప్పి ఓరి తెలుగువాడా..అంటూ సమైక్యాంధ్ర రాగాన్ని తీసి తర్వాత సోదిలో లేకుండా పోయాడు. ఓ మాజీ ముఖ్యమంత్రి మంత్రమేసినట్లు రాష్ట్ర రాజకీయాలనుంచి అదృశ్యమైపోయాడు. నల్లారి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆ మధ్య పచ్చ కండువా కప్పుకోవడంతో…అన్న ఎటువైపన్న చర్చ జరిగినా…కిరణ్ మాత్రం నోరుమెదపలేదు.
రాష్ట్ర విభజన వద్దని అప్పట్లో అధినాయకత్వానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కిరణ్‌కుమార్‌రెడ్డి. రాష్ట్రం విడిపోయినా కాంగ్రెస్ బావుకునేదేం లేదని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్‌కి తీరనినష్టం తప్పదని హెచ్చరించారు. ఇవేమీ కాంగ్రెస్ అధినాయకత్వం చెవికెక్కలేదు. చివరికి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పిందే జరిగింది. ఏపీలో పార్టీ చాపచుట్టేస్తే.. తెలంగాణలో చావుతప్పి కన్నులొట్టబోయింది. 2019 ఎన్నికల్లో ఏపీలో నాలుగుసీట్లొస్తాయన్న ఆశలేదు. తెలంగాణలో అద్భుతం జరుగుతుందన్న నమ్మకం కూడా లేదు. అప్పట్లో కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పింది నిజమేనని, తామే తొందరపడ్డామనీ కాంగ్రెస్ అధినేత్రి చింతిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ మధ్య బీజేపీలో చేరతాడనీ.. లేదు లేదు తమ్ముడి బాటలోనే టీడీపీలో చేరొచ్చని ప్రచారం జరిగినా…పార్టీలోకి తిరిగి రమ్మంటూ కిరణ్‌కుమార్‌రెడ్డికి రెడ్‌కార్పెట్ పరుస్తోంది కాంగ్రెస్.
ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కోసం కాంగ్రెస్ తలుపులు బార్లా తెరిచేసింది. ఆయన్నెలాగయినా పార్టీలోకి రప్పించేందుకు రాయబారాలు నడుపుతోంది. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజును రంగంలోకి దింపింది కాంగ్రెస్ హైకమాండ్. సీనియర్ నేత టి. సుబ్బిరామిరెడ్డిని చర్చలకు పంపింది. పార్టీలో పునః ప్రవేశానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన కిరణ్ కుమార్ రెడ్డి.. త్వరలోనే ఢిల్లీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌కి దూరమై ఏ పార్టీలో చేరని మాజీ ఎంపీలు హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్‌కుమార్ లాంటి నేతల్ని కూడా దువ్వే పన్లో ఉంది కాంగ్రెస్.