Home News Updates

ఈటల బీజేపీలో చేరితే కేటీఆర్ ఇలాఖాలో మారనున్న రాజకీయం

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరతారన్న వార్త ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ కుదుపులకు కారణం అవుతుంది. జిల్లాలోని పలువురు టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలు ఇప్పుడు ఈటల వైపు చూస్తున్నారు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా దాని ప్రభావం రాజన్న సిరిసిల్లా జిల్లా పై పడేలా ఉంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు టీఆర్‌ఎస్‌లో సరైన స్థానం లభించకపోవడంతో ఇప్పుడు గట్టి ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు.

ఇప్పుడిప్పుడే సిరిసిల్లాలో దూకుడుగా కార్యక్రమాలు చేపడుతున్న బీజేపీ శ్రేణులు జిల్లాను లీడ్ చేసే నాయకుడి కోసం చూస్తున్నాయి. గత నెలలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను బీజేపీ, అనుబంధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌లో ఆదరణలేని నాయకులు, ప్రజాప్రతినిధులు బీజేపీ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఈటల బీజేపీలో చేరితే జిల్లా రాజకీయాల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిని పలకరించే వారే కరువయ్యారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వలసవచ్చిన వారు సొంత గూటికి తిరిగి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆడెపు రవీందర్‌ తిరిగి బీజేపీ గూటికి చేరారు. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరిన మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ గుడ్ల మంజుల మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. గంభీరావుపేటకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం అతని తనయుడు సర్పంచ్‌ కటకం శ్రీధర్‌పంతులుతో పాటు పలువురు బీజేపీలో చేరారు. వీరంతా గట్టి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత సిరిసిల్ల పై దృష్టి పెట్టిన కేటీఆర్ మండలాల వారీగా నాయకులతో భేటీ అయ్యారు. వారిలో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రయత్నించారు. సిరిసిల్ల జిల్లాలో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఏదైనా మంత్రి కేటీఆర్‌తో పనిబడితే ఎలా అన్న ఒక్క కారణంతోనే పార్టీలో కొనసాగుతున్నట్లు గా చెప్పుకుంటున్నారు. ఇక గట్టి ప్రత్యామ్నాయం దొరికితే జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here