Home News Politics

ఏలూరులో విన్నర్ ఎవరు…?

ఏలూరులో ఏ పార్టీ గెలుస్తుందో రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ గురించి అందరికీ తెల్సిందే. 1989 నుండి మొన్న 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఇదే విషయం రుజువైంది కూడా. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ పాగా వేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఏలూరులో ఈ సారి గెలుపు ఎవరికి అంత సులువుగా రాదనే చెప్పాలి. ప్రస్థుతమున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పోటీ టగ్ ఆఫ్ వార్ గా మారింది.

పశ్చిమ గోదావరి జిల్లా లోని 16 శాసనసభ నియోజకవర్గాలలో ఏలూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ టీడీపీ,వైసీపీలు ఎంత బలంగా ఉన్నాయో…అంతే బలంగా జనసేన కూడా ఉంది. టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి కోటరామరావు(బుజ్జి), వైకాపా నుండి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), జనసేన నుండి రెడ్డి అప్పలనాయుడు బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు ఏలూరు బరిలో హోరాహోరీగా తలపడుతున్నారు. ఇక వీరిలో బుజ్జి, నాని కాపు సామాజికవర్గానికి చెందిన వారు కాగా, అప్పలనాయుడు తూర్పు కాపు. ఇక ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువగానే ఉండటంతో జనసేనకి కలిసొచ్చే అవకాశం ఉంది.

అలాగే జనసేన ఓట్లు చీల్చే ఓట్ల ప్రభావం ఎవరి మీద పడుతుందో చూడాలి. పైగా రెడ్డి అప్పలనాయుడు నియోజకవర్గంలో బలంగా ఉన్నారు. దీంతో మిగతా ఇద్దరి నేతలకి తీసిపోకుండా ఢీ అంటే ఢీ అనేలా ఉన్నారు. అప్ప‌ల‌నాయుడు గ‌తంలో తేదేపా నుంచి స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధిగా ఉన్నారు. దెందులూరు ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ విష‌యంలో ఆయ‌న గ‌ట్టిగా ఢీకొన్నార‌న్న కార‌ణంతోనే ప‌వ‌న్ ఇక్క‌డ అప్ప‌ల‌నాయుడుకు సీటు ఇచ్చారు. కానీ తెదేపా, వైకాపాల అంత బలమైన క్యాడర్ జనసేనకి లేదు. అయితే 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసిన ప్ర‌స్తుత టీడీపీ అభ్య‌ర్థి బుజ్జి ఏకంగా రెండో స్థానంలో ఉన్నారు. దీనిని బ‌ట్టి ప‌వ‌న్‌కు అభిమాన‌గ‌ణం, కుల బ‌లం ఇక్కడ జ‌న‌సేన‌కు కొంత వ‌ర‌కు ప్ల‌స్ కావొచ్చు.

అటు బుజ్జి ఇక్కడ అభివృద్ధి బాగానే చేసినా..తాజాగా నగరంలో మంచి పట్టున్న ఏలూరు మేయర్‌ నూర్జహాన్, ఆమె భర్త, కోఆప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌ పెదబాబులు వైసీపీలో చేరడం బుజ్జికి దెబ్బనే చెప్పాలి. దీంతో ముస్లిం ఓటర్లు ఎక్కువ వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. ఇది బుజ్జి విజయావకాశాలని దెబ్బ తీయొచ్చు. కానీ అడిగిన వెంటనే పని చేస్తాడు అనే పేరు బుజ్జికి ఉంది. ఇక్కడ టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. మరోవైపు వైసీపీ నుండి సీనియర్ నేత ఆళ్ళ నాని బరిలో ఉన్నారు. ఇక్కడ నానికి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే వైసీపీలో కొంతమంది అసంతృప్త నేతలు ఉన్నారు. వీరి వలన నానికి కొంత తలనొప్పులు ఉన్నాయి. అయితే ఏలూరు మేయర్ పార్టీలో చేరడం నానికి కలిసొచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ముగ్గురు అభ్యర్ధులు గట్టిగా ఉండటంతో…ఈ సారి ఏలూరులో త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ పోరులో ఏలూరు ఎవరి సొంతమవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here