Home News Stories

ఇదేం దిక్కుమాలిన ఆఫర్ పుల్లయ్య…

మూడంటే మూడు రూపాయిలకు ఏం దొరుకుతాయి మార్కెట్లో అంటే టపిమని చెప్పలేని పరిస్థితి… అవును కాస్త ఆలోచించాలి మరి కాని మూడు రూపాయలకు చీర ఇస్తామంటే ఇంక షాపింగ్ అభిరుచి గల మన మహిళామణులు ఆగుతారా…ఎగిరి గంతేసి షాప్ ముందు వాలిపోయారు. పోటెత్తిన జనాలతో హడలిపోయిన షాప్ యాజమని లబోదిబోమంటు పోలీసులను ఆశ్రయించాడు…ఏమా కథ జర దేఖో

సరిగ్గా చెప్పాలంటే మూడు రూపాయాలకు దారపు కండే దొరకని పరిస్థితి . అలాంటి మూడు రూపాయిలకు ఒక చీర అంటే ఎవరు మాత్రం ఆశ పడకుండా ఉండరు? ఎవరో సినిమా స్టార్ ను తీసుకొచ్చి.. లక్షల లెక్కన డబ్బులు ఇచ్చినా అందుకు వచ్చే రెస్పాన్స్ ఏమిటో చెప్పలేని పరిస్థితి. అదే 3రూపాయిలకే చీర అంటే జనాలు పోటెత్తటమే కాదు.. సదరు షాపు పేరు ఊరు మొత్తమే కాదు.. పక్కనున్న జిల్లాల్లోనూ తెలిసిపోయే పరిస్థితి. అందుకేనేమో వరంగల్ కి చెందిన కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ భారీ ప్లాన్ వేసింది.

షాపు వార్షికోత్సవం సందర్భంగా మూడంటే మూడు రూపాయిలకే చీర ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారీగా ప్రచారం చేపట్టింది. తమ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో చీరను మూడు రూపాయిలకే ఇస్తామని అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.

ఇంత ప్రచారం చేశాక.. భారీ ఆఫర్లు పెట్టాక ఎవరు మాత్రం ఊరుకుంటారు. వేలాది మంది షాపింగ్ మాల్ ను ముంచెత్తారు. జనాలు వస్తారని తెలుసు కానీ.. మరీ ఈ స్థాయిలో వస్తారని అంచనా వేయని షాపింగ్ మాల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. మూడు రూపాయిల చీర ఎక్కడ మిస్ అవుతుందోనన్న ఉద్దేశంతో పనులన్నీ ఆపుకొచ్చిన వేలాది మహిళలను కంట్రోల్ చేసేసరికి షాప్ యజమానికి తల ప్రాణం తోకలోకి వచ్చింది…

షాపింగ్ మాల్ లోకి కనీసం వచ్చిన వారిని ఎంటర్ అవ్వనివ్వలేదు. దీంతో ఫైర్ అయిన మహిళలు శాపనార్థాలు పెట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి శాంతిభద్రతల సమస్య ఏర్పడకుండా అర్జెంట్ గా మాల్ ను మూయించేశారు. మూడు రూపాయిలకే చీరను సొంతం చేసుకొని ఎంచక్కా ఇంటికి వెళ్లాలనుకున్న వారికి తీవ్ర ఆశాభంగం వాటిల్లింది. మొత్తంగా చూస్తే.. మూడు చీరతో వచ్చే మైలేజీ ఏమో కానీ వేలాది మంది మహిళల శాపనార్థాలు మాత్రం కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ కు భారీగానే దక్కాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here