Home News Politics

ముగ్గురు ఎంపీల జలక్ తో…మొదటికొచ్చిన సైకిల్ సమస్య…!

ముగ్గురు ఒకే జిల్లా ఎంపీలు. టీడీపీ నుండి గెలిచిన ముగ్గురు ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. ఒకరు పార్టీ ఫిరాయించి ఎమ్మెల్యే గా వెళ్ళాలనుకుంటే, మరొకరు అనారోగ్యంతో దూరంగా ఉన్నారు. ఇంకొకరు అసంతృప్తితో ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈసారి తూర్పు గోదావరీ జిల్లాలో కొత్త ముఖాలను ఎంపీ అభ్యర్థులుగా రంగంలోకి దింపడానికి కసరత్తు చేస్తుంది టీడీపీ హైకమాండ్. జిల్లాలోని ముగ్గురు ఎంపీలు ఒకేసారి ఇలా పోటీ నుంచి విరమించుకోవడం వెనకున్న కారణాలపై మాత్రం కోనసీమలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి….

రాజకీయ చైతన్యం కలిగిన తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ఈసారి ఎన్నికల్లో మళ్ళీ పోటీకి విముఖత చూపుతున్నారు. ఎన్నికల నగారా మోగబోతున్న ఈ సమయంలో టీడీపీ కొత్త అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది. కాకినాడ ఎంపీ తోట నరసింహం అనారోగ్యం ఉండటం వలన మరోసారి పోటీ చేయడానికి దూరంగా ఉన్నారు. తన భార్య తోట వాణికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలై పార్టీకి దూరంగా ఉన్న చలమలశెట్టి సునీల్ ఈ టిక్కెట్ పై గురిపెట్టి టీడీపీ సైకిలెక్కేశారు.
దీంతో సునీల్ ఈసారి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

ఎంపీ సినీ నటుడు మురళీమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి పార్లమెంట్ స్థానం విషయంలో ఏం జరగబోతుందనేది జిల్లా తెలుగు తమ్ముళ్లులో ఉత్కంఠ రేపుతోంది. మురళీమోహన్ ఈసారి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని నేరుగా పార్టీ అధినేత,సీఎం చంద్రబాబు ఎదుటే స్పష్టం చేశారు. తానుగాని, తన కోడలు మాగంటి రూప గాని ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని చెప్పడంతో మురళీ మోహన్ తీసుకున్న నిర్ణయం పట్ల అధినాయకత్వం అవాక్కయ్యింది. ఇటీవల పార్టీ నిర్వహించిన సర్వేలో అనుకూలంగా రాకపోవడంతో మురళీ మోహన్ పోటీకి ఆసక్తి చూపలేదని తెలుస్తుంది.

ఎంపీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిని దింపాలనే ఆలోచన జరుగుతోంది. ఈ మేరకు పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. బుచ్చయ్యచౌదరి ఎంపీ అభ్యర్థిత్వంపై పార్టీ పరంగా సర్వే జరుగుతోంది. మరో వైపు సినీనటుడు ఆలీని బరిలో దింపే ఆలోచన చేస్తున్నారు. స్థానికుడైన ఆలీ గత ఎన్నికల్లో టిడిపి రాజమండ్రి అసెంబ్లీ టికెట్ ఆశించారు. ఆలీ ఎంపీ అభ్యర్ధి అయితే విజయావకాలు ఏలా ఉంటాయనే పరిశీలన చేస్తున్నారు పార్టీ పరిశీలకులు.

ఇక అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఇటీవలే టీడీపీని విడిచి వైసీపీలో చేరారు. ఈయన కూడా ఈసారి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కడో ఒక చోట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పి.గన్నవరం, చింతలపూడి, పాయకరావుపేట స్థానాలపై పోటీకి ఆసక్తిగా ఉన్నారు అమలాపురం ఎంపీ రవీంద్ర. ఇక్కడ టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్ధిగా గంటి హారిష్ ను బరిలోకి దింపే అవకాశం ఉంది. హారిష్ మాజీ లోక్ సభ స్పీకర్ స్వర్గీయ బాలయోగి కుమారుడు. కోనసీమలో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు బాలయోగి . బాలయోగి కుమారుడు పోటీ చేస్తే విజయావకాలు మెరుగుగా ఉంటాయనే విశ్వాసం టీడీపీ అధిష్టానానికి ఉంది.

మొత్తానికి ఎన్నికల ముందు జిల్లాలోని మూడు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థిత్వం పై ఆసక్తి నెలకొంది. ముగ్గురు ఎంపీలు తీసుకున్న అనూహ్య నిర్ణయం కొత్త అభ్యర్ధుల ఎంపిక తూర్పు టీడీపీ నాయకుల్లో ఉత్కంఠ రేపుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here