ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది గోదావరి జిల్లాలోని ప్రధాన పార్టీలు సామాజికవర్గ ఓట్ల సమీకరణపై దృష్టి సారించాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జిల్లాలో ప్రధాన పార్టీలు నేతలు సామాజికవర్గ ఓట్ల సమీకరణపై దృష్టి సారించారు. ఇప్పటినుంచే కులాల ఓట్ల లెక్కల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆయా సామాజిక వర్గాల్లో తమ పార్టీకి ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలపై కూలంకషంగా అంచనాలు వేసుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో పార్టీల ప్రభావంతోపాటు కుల సమీకరణలు ఎన్నికల్లో గెలుపు,ఓటములను ప్రభావితం చేస్తాయి. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. రెండు, మూడు దశాబ్దాలకు మునుపు కుల రాజకీయాల ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉండేది. ఇటీవల కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ కుల సమీకరణలు రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ, వైసీపీ నేతలు కులసంఘాల నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. సామాజికవర్గాల వారీగా తమ పరిధిలో ఉన్న ఓట్ల వివరాలను ఇప్పటికే సేకరించిన ఆయా పార్టీల నేతలు ఏఏ కులాల ఓట్లను ఆకర్షించడానికి కుల సంఘాల్లో ఏ నాయకులను కలవాలి.. వారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి వంటి అంశాలపై సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు టిక్కెట్టు ధీమా ఉన్న ఇన్చార్జిలు, కోఆర్డినేటర్లు సీరియస్ గా దృష్టిసారించారు.
గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ఏ కులం ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు, గత ఎన్నికల్లో ఏ పార్టీకి,అభ్యర్థికి సపోర్టు చేశారు ? ఆ ప్రభావం ఎంత మేర ఎఫెక్ట్ చూపింది వంటి అంశాలపై పార్టీల నేతలు కూడికలు, తీసివేతల పనిలో బిజీగా ఉన్నారు. ఈ కుల సమీకరణలపై లెక్కలు వేసుకోవడానికి రాజకీయాలతో సంబంధంలేని ఆయా మేధావి వర్గాల వారినీ ఉపయోగించుకుంటున్నారు. జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ ప్రధాన పోటీదారులుగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా పోటీచేసే జనసేన ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై విశ్లేషణలు చేసుకుంటున్నారు.
2014 ఎన్నికల్లో తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, కొత్తపేట, రంపచోడవరం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఒక్క రంపచోడవరం మినహా మిగిలిన నాలుగు అసెంబ్లీల పరిధిలో కాపు సామాజికవర్గం ఓటర్ల ప్రభావం ఎక్కువ. అంటే ఆ ఎన్నికల్లో తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, కొత్తపేటలలో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా వైసీపీకి మద్దతు తెలిపి ఉంటారన్న కోణంలోనూ విశ్లేషణలు సాగాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలతోపాటు కీలక నాయకులు పార్టీలు మారారు. దీంతో సమీకరణలు కూడా అదే రీతిలో మారతాయన్న అంచనాలు నెలకొన్నాయి.
ఈ జిల్లాలో టీడీపీ కాపు సామాజికవర్గంతోపాటు బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. కాపుల్లో చినరాజప్పకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఇచ్చారు. బీసీ జాబితాలో టీడీపీ ముందు నుంచీ యనమలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మరో బీసీ సామాజికవర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, కొత్తపేట, రామచంద్రపురంలలో కాపు సామాజికవర్గం వారికి టిక్కెట్టు ఇచ్చింది.
జిల్లాలో టీడీపీ, వైసీపీ టిక్కెట్ల హామీ లభించినవారితోపాటు కొన్నిచోట్ల ఆశావహులు కుల సమీకరణలపై దృష్టిసారించారు. ఏ నాయకుడిని ప్రసన్నం చేసుకుంటే ఏ కులంలో ఎన్ని ఓట్లు వస్తాయి? పార్టీకి సానుకూలంగా ఉన్న వారితోపాటు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న కులాల్లో ఏ ఎత్తుగడలు వేసి రాబట్టుకోవాలి.. ఇలా తమకున్న అవకాశాలను పరిశీలించుకుంటున్నారు.