బీహార్ కంటే, మిగిలిన రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల కంటే దుబ్బాక రిజల్ట్ మీదే అందరి దృష్టి. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నికలు జరిగిన దుబ్బాకలో వార్ వన్ సైడ్ జరుగుతుందనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దుబ్బాకలో పోటాపోటీ ఫైటింగ్ జరిగింది. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కావచ్చునుకుంటే చివరికొచ్చేసరికి పోల్ సీన్ కాస్తా టీఆరెస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. కాంగ్రెస్ బలహీనపడిపోయిందని, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీనేనని చెబుతూవచ్చిన కమలం పార్టీ…దుబ్బాకలో దుమ్మురేపి దమ్ము చూపించే ప్రయత్నంచేసింది. సెంటిమెంట్ రాజకీయాలకు కాలం చెల్లిందంటూ.. దుబ్బాక బరిలో గులాబీపార్టీకి గట్టిపోటీ ఇచ్చింది.

దుబ్బాకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని కేటీఆర్ ప్రకటన చేసినా…టీఆరెస్ మాత్రం లోలోన టెన్షన్ పడుతోంది. దుబ్బాకలో బీజేపీ అనుసరించిన వ్యూహంతో ఆ పార్టీ డిఫెన్సులో పడాల్సి వచ్చింది. వాస్తవానికి ఏ ఎన్నికల్లోనైనా టీఆరెస్ దూకుడుగా వ్యవహరించి.. ప్రత్యర్థి పార్టీలను బోల్తా కొట్టించే స్ట్రాటజీని అనుసరిస్తుంటుంది. అయితే దుబ్బాకలో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నారాయణఖేడ్, పాలేరు, రెండోసారి అధికారంలోకి వచ్చాక హుజూర్ నగర్ ఎన్నికల్లో అదే వ్యూహంతో తిరుగులేని విజయాన్ని సాధించిన టీఆరెస్…దుబ్బాకలో మాత్రం ఆత్మరక్షణలో పడిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ ఎదురుదాడికి దిగటంతో…ఆ పార్టీ ఆరోపణలకు వివరణలు ఇచ్చుకోవడం, కమలం పార్టీ నేతల సవాళ్ళకు ప్రతిసవాళ్ళు విసరడంతోనే టీఆరెస్ ప్రచారం గడిచిపోయింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక వచ్చిన దుబ్బాక ఎన్నికలను సవాలుగా తీసుకున్నారు బండిసంజయ్. ప్రచారం నుంచి అరెస్ట్ దాకా దుబ్బాక బై ఎలక్షన్ లో ఆయనే సెంటర్ పాయింట్ గా ఫోకస్ అయ్యారు. మొదట్లో దూకుడుగా ప్రచారం కొనసాగించిన తెలంగాణ రాష్ట్ర సమితికి సవాళ్లు విసిరారు. బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లో కేంద్ర నిధులు ఉన్నాయనీ, కాదని నిరూపిస్తే ఇక్కడే ఉరేసుకుంటానని దుబ్బాకలో సవాల్ విసిరారు బండి సంజయ్. బీడీ కార్మికుల పెన్షన్లో 16వందలు కేంద్రం ఇస్తోందని సోషల్ మీడియా వేదికగా బీజేపీ చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయింది టీఆరెస్. దీనికి తోడు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో సోదాలు, దాడులతో పోలీసులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు అవకాశం ఇచ్చినట్లయింది. బండి సంజయ్ కి మంత్రి హరీష్ రావు ప్రతిసవాలు విసిరినా బీజేపీ దూకుడే ఫోకస్ అయ్యింది.
చనిపోయేవరకు అధికారపార్టీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి కుమారుడిని వ్యూహాత్మకంగా దుబ్బాక బరిలో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. వివాదరహిత నాయకుడిగా దుబ్బాకలో ముత్యంరెడ్డికి మంచి పేరుంది. ఆయన్ని టీఆరెస్ అవమానపరిచిందని, కనీస గౌరవం ఇవ్వలేదని ప్రచారం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి. అటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తనకున్న స్థానబలంతో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. బీజేపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పన్లేదంత టెంపో తీసుకొచ్చారు రఘునందన్. పార్టీ ముఖ్యనేతలంతా మోహరించడం, పోలీసుల దాడుల వివాదంలో స్వయానా కేంద్రమంత్ర కిషన్ రెడ్డి దుబ్బాకకి రావడం బీజేపీ శ్రేణులను మరింత ఉత్సాహపరిచింది. ఇక దివంగత నేత సతీమణిగా కేవలం సెంటిమెంటుని, అధికారపార్టీ బలాన్ని నమ్ముకుని బరిలోకి దిగారు సుజాత. పేరుకు రామలింగారెడ్డి భార్య బరిలో ఉన్నా…అభ్యర్థిని తానేనన్నంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మంత్రి హరీష్ రావు. మొత్తానికి ఎవరి అంచనాలు ఎలా ఉన్నా దుబ్బాక ఫలితం తెలంగాణలో సరికొత్త సమీకరణాలకు తెరలేపబోతోంది. గెలిస్తే సరిపోదనే విషయం టీఆరెస్ పార్టీకి తెలుసు. గత ఎన్నికల్లో వచ్చినమెజారిటీ ఏమాత్రం తగ్గినా…విపక్షాలు రెట్టించిన ఉత్సాహంతో కదనరంగంలోకి దూకుతాయి. అందుకే దుబ్బాక ఫలితాలకోసం రాజకీయపక్షాలతోపాటు సామాన్యులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు