జో బైడెన్. ట్రంప్ కటౌట్‌తో పోలిస్తే తేలిపోయే ఫిజిక్ అయినా, చివరికి ఎన్నికల యుద్ధరంగంలో ఏనుగునే కుమ్మేశారు. ప్రపంచ పెద్దన్నకి కొత్త అధినేతగా అద్భుత విజయాన్ని సాధించారు. ఆనవాయితీ ప్రకారం మరోసారి తానే గెలుస్తానని, తాను రగిలించిన జాతీయవాదం అంత తేలిగ్గా చల్లారిపోదనే ఓవర్ కాన్ఫిడెన్సుతో ఉన్న ట్రంప్ ఘోరంగా ఓడిపోయారు. డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడన్ ఇంత సంచలన విజయం సాధించడానికి అనేక అనుకూలతలు కలిసొచ్చాయి. ట్రంప్ తప్పిదాలు ఆయనకు ప్లస్ అయ్యాయి.

అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర మైగ్రెంట్స్ దేనని చెప్పాలి. ట్రంప్ నిర్ణయాలతో అనుక్షణం ఆందోళనపడ్డవారు జో బైడెన్ కి జైకొట్టారు. అక్రమంగా వలస వచ్చిన కోటీ 10 లక్షలమందికి అమెరికా పౌరసత్వం ఇస్తామనే ప్రచారం జో బైడెన్‌ని అధికారపీఠం వైపు నడిపించింది. గద్దెనెక్కినప్పటినుంచీ అక్రమ వలసదారులను టార్గెట్ చేసుకున్నారు ట్రంప్. వారిని వెనక్కి పంపేస్తామంటూ పదేపదే హెచ్చరికలు చేశారు. వలసదారులపై ట్రంప్ మొండివైఖరి రిపబ్లికన్ పార్టీని చావుదెబ్బకొట్టింది. జాతివివక్ష కూడా ట్రంప్ ఓటమికి కారణమైంది. వరసగా నల్లజాతీయులపై జరిగిన అమానుషాలతో బ్లాక్స్ రగిలిపోయారు. పోలీసుల చేతిలో జార్జిఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పోయిన ఉదంతం…నల్లజాతీయులందరినీ ఏకం చేసింది. ట్రంప్ తీరుపై ఆగ్రహంతో ఉన్న ఆఫ్రికన్ అమెరికన్లు జార్జి ఫ్లాయిడ్ ఘటన తర్వాత ప్రత్యక్ష పోరాటానికి దిగారు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటూ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా వీధుల్లోకొచ్చారు. వారిని తమవైపు తిప్పుకోవడంలో, వారి ఆగ్రహాన్ని ఓట్లరూపంలో మలుచుకోవడంలో డెమోక్రాట్లు సక్సెస్ అయ్యారు. డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీచేసిన కమలా హారిస్ పూర్వీకులది ఇండియా కావటంతో…ఇండో అమెరికన్లు ఆ పార్టీకి అండగా నిలిచారు.
గత ఎన్నికల పొరపాట్లు రిపీట్ కాకుండా ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించారు డెమోక్రాట్లు. రెండు దశాబ్ధాలుగా.. సీనియర్లను తమ వైపు తిప్పుకోవడంలో వెనుకబడ్డారు డెమోక్రాట్లు. కానీ ఈసారి మాత్రం వారి గురి తప్పలేదు. సీనియర్ ఓటర్లు ఈసారి బైడెన్ కి అండగా నిలిచారు. అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసిన కరోనా.. సీనియర్లపై తీవ్ర ప్రభావం చూపించింది. కరోనాను కట్టడి చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో.. ట్రంప్ కంటే జో బైడెన్ మెరుగైన నాయకుడని నమ్మారు సీనియర్ సిటిజన్లు. 2016 ఎన్నికల్లో ట్రంప్ నాయకత్వాన్ని బలపరిచిన 65శాతం మంది సీనియర్లు… ఈసారి జో బైడెన్ వైపు నిలిచారు. మరోవైపు మాటలకు చేతలకు పొంతనలేని ట్రంప్ ని మరోసారి నమ్మలేక…అమెరికా యువత కూడా బైడెన్ వెంట నడిచింది.
కరోనాని మొదట్లో లైట్ తీసుకున్నారు ట్రంప్. అగ్రరాజ్య అధిపతిగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాల్సిన నాయకుడు…తనే మాస్కు లేకుండా తిరిగాడు. కరోనాని పట్టించుకోవాల్సిన పన్లేదన్నట్లు నిర్లక్ష్యం వహించారు. దీంతో వైరస్ విజృంభించి అమెరికాలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. లక్షలమంది వైరస్ బారినపడ్డారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చి జాగ్రత్తపడేలోపు పరిస్థితి చేజారిపోయింది. కరోనాపై ట్రంప్ నిర్లక్ష్యాన్ని ప్రజల్లో ఎండగట్టడంలో జో బైడెన్ నెగ్గుకొచ్చారు. ఫస్ట్ వేవ్ ఉన్నప్పుడే ట్రంప్ తగిన చర్యలు తీసుకుని ఉంటే…రెండు లక్షలమంది ప్రాణాలు కోల్పోయేవారే కాదనే ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లారు జో బైడెన్. అంతేకాదు…తాము అధికారంలోకి వస్తే కరోనా వ్యాక్సిన్ ని ఫ్రీగా దేశ ప్రజలందరికీ అందిస్తామని వాగ్దానం చేశారు. ఒబామా కేర్ హెల్త్ బిల్లును అమలుచేసే విషయంలో ట్రంప్ నిర్లక్ష్యంపై డెమోక్రాట్ల ప్రచారం ప్రజలపై ప్రభావం చూపించింది. అమ్మా పెట్టదు అడుక్కోనివ్వదన్నట్లు ట్రంప్ వైఖరి ఉందని, హెల్త్ కేర్ బిల్లును అమలు చేయకపోగా, కొత్త బిల్లును కూడా తీసుకురాకుండా అమెరికన్ల ప్రాణాలతో ట్రంప్ చెలగాటమాడుతున్నారని జోబైడెన్ ప్రచారంలో వేలెత్తి చూపించారు. తాము అధికారంలోకి వస్తే హెల్త్ కేర్ బిల్లుకోసం పదేళ్లలో 70 బిలియన్ డాలర్లు ఖర్చుపెడతామని హామీ ఇచ్చారు. అయితే కరోనానే తేలిగ్గా తీసుకున్నట్రంప్…వ్యాక్సిన్ రాబోతోందని ఊదరగొట్టారే తప్ప.. ప్రజల ఆరోగ్య సంరక్షణకు స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. చైనాతో పాటు మిగిలిన దేశాలను నిందించిన ట్రంప్…కరోనా కట్టడికి తమ ప్రభుత్వం ఏంచేస్తోందో చెప్పుకోలేకపోయారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విషయంలో.. డెమోక్రాట్ల విధానాన్ని అమెరికన్లు ఆమోదించారు.
అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికి దిశానిర్దేశం చేసే విశ్వనాయకుడు. అగ్రరాజ్య అధిపతిగా ఆ దేశ అధ్యక్షుడి ప్రతి మాటా, చర్యా ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. అలాంటి అత్యున్నత హోదాలో ఉండికూడా… హుందాగా వ్యవహరించలేకపోయారు ట్రంప్. కామెడీ కేరికేచర్ గా మారిపోయారు. ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి… వివాదాస్పద వ్యాఖ్యలు,నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు. విధానాల్లో, మాట తీరులో తన వ్యవహారశైలితో అమెరికన్లలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు ట్రంప్. ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురుచూసేంతగా తన చర్యలతో వారిని విసిగించారు ది గ్రేట్ అమెరికన్ ప్రెసిడెంట్. మైనారిటీలు, మైగ్రెంట్స్ విషయంలో ట్రంప్ నిర్ణయాలను సగటు అమెరికన్ సమర్ధించలేకపోయాడు. ఇక వీసాల విషయంలోనూ ట్రంప్ చర్యలను న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయి. ట్రంప్ ని మరోసారి అధ్యక్షుడిగా గెలిపిస్తే కొంపముంచుతాడనే భయంతో జో బైడెన్ వైపు మొగ్గారు అమెరికన్లు.
అమెరికా అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టబోతున్న జోబైడెన్‌కి ఇంటా బయటా మద్దతు పెరుగుతోంది. ట్విట్టర్లో జో బైడెన్ కి 14.4 మిలియన్ ఫాలోవర్లుగా ఉండగా.. ప్రెసిడెంట్ కాగానే ఆ సంఖ్య 16 మిలియన్లు దాటేసింది. ఈ గెలుపు అమెరికన్లదని వినమ్రంగా స్పందించారు జో బైడెన్.. అమెరికా ప్రజలు ఆశించిన పాలన అందిస్తామన్నారు. అమెరికన్లు తమ భవిష్యత్ కోసం ఓటేశారని, వారి నిలబెట్టుకుంటానని మాటిచ్చారు. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన ప్రొఫైల్‌ను అప్డేట్ చేయడంతో డెమోక్రాట్లలో జోష్ పెరిగింది.