Home News Stories

ట్రంప్‌ అంత తేలిగ్గా దిగిపోతాడా?


అమెరికాలో ట్రంప్‌ ఓటమి అంచుల్లో ఉన్నాడు. అధికారిక ప్రకటన రాకుండా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాడు. తనకు ఆధిక్యం ఉందనుకున్న చోటకూడా కోర్టుకెక్కాడు. బిజినెస్‌మ్యాన్‌గా లాభసాటి వ్యాపారం ఎలా చేయాలో బాగా తెలిసిన ట్రంప్‌…నాలుగేళ్లు వైట్‌హౌస్‌లో ఉండటంతో అధికారం రుచి మరిగాడు. అందుకే అంత తేలిగ్గా అధ్యక్షపీఠాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేనని మొండికేస్తున్నాడు..మారాం చేస్తున్నాడు. ఇప్పటికే ట్రంప్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయిన అమెరికన్లు రోడ్లమీద పడి రణరంగం సృష్టించేలా ఉండటంతో…సగటు పౌరులు బిక్కుబిక్కుమంటున్నారు.

గెలుపోటములు దోబూచులాడినా చివరికి అదృష్టం డెమోక్రాట్ల వైపే మొగ్గుతోంది. ట్రంప్‌ వ్యతిరేకతతో అనుకూలించిన పాపులర్‌ ఓట్లతో వైట్‌హౌస్‌ వైపు వడివడిగా అడుగులేస్తున్నారు జో బైడెన్‌. దీంతో నిప్పులు తొక్కిన కోతిలా చిందులేస్తున్నాడు ట్రంప్‌. ఓడిపోయినా కుర్చీ వదిలిపెట్టేది లేదని ముందే చెప్పేశాడు. సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తానని వార్నింగ్‌ ఇచ్చేశాడు. అసలే అమెరికాలో రాష్ట్రానికో రూలు. ఎవరి రాజ్యాంగం వాళ్లదన్నట్లు ఉంటుందక్కడి వ్యవస్థ. ఫలితాలన్నీ కొలిక్కివచ్చేసరికి ఓ వారం పట్టేలా ఉంది. ఓట్లపరంగా ట్రంప్‌ ఓడిపోయినా…కొత్త అధ్యక్షుడు వెంటనే శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే పరిస్థితయితే లేదు. ఎందుకంటే టెక్నికల్‌గా ట్రంప్‌ పదవీకాలం ఇంకా 76 రోజులు ఉంది. అధికారాలన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి. ఒక్క పూట వదిలేస్తేనే ఇల్లుపీకి పందిరేసే ట్రంప్‌ రెండున్నర నెలల టైంలో తిమ్మిని బమ్మిని చేసినా ఆశ్చర్యపడాల్సిన పన్లేదంటున్నారు.

అధికారానికి దూరం కావడం అనివార్యమని తెలిశాక ట్రంప్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందోనని రాజకీయ ప్రత్యర్థులే కాదు సామాన్యులు కూడా భయపడుతున్నారు. దిగిపోయేలోపు రివెంజ్‌ తీర్చుకోడానికి కూడా వెనుకాడే రకం కాదు ట్రంప్‌.తనకు ఓట్లేయనివారిమీద, తనకువ్యతిరేకంగా పనిచేసినవారిమీద పగ తీర్చుకుంటాడనే టెన్షన్‌ అప్పుడే మొదలైంది. ట్రంప్‌ వీరాభిమానులు విధ్వంసాలకు, హింసకు తెగబడేలా కనిపిస్తున్నారు. నాలుగైదురోజులైతే ఎలాగోలా ఊపిరిబిగబట్టొచ్చు. 76రోజుల కుషన్‌ని చివరి క్షణందాకా వాడుకోనిదే వైట్‌హౌస్‌వీడే అవకాశం లేదు ట్రంప్‌. అందుకే ఆ సమయంలో ఎలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటాడో, ఎవరి కొంపముంచుతాడోనని అందరి భయం. అసలే కోతి…ఆపై కల్లుతాగితే ఏమవుతుందో వేరే చెప్పాలా. గాడ్‌ సేవ్‌ అమెరికా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here